Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం మరో తుగ్లక్ చర్య

-పేర్ల పిచ్చి పోవాలంటే ఏకంగా రాష్ట్రానికే వై.ఎస్.ఆర్ పేరు పెట్టండి
-26 జిల్లాలకు 26మంది మంత్రుల పేర్లు పెట్టుకోండి
-ఎన్టీఆర్ పై గుండెల నిండా ప్రేమ ఉందని చెప్పే వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు పదవులకు రాజీనామాలు చేయండి
-అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

రాష్ట్రప్రభుత్వం విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చాలని తీసుకున్న నిర్ణయం మరొక తుగ్లక్ చర్యగా అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభివర్ణించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు జిల్లాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ చల్లారలేదని, విజయవాడ, గుంటూరు జంట నగరాల మధ్య ఏర్పాటు చేసిన అమరావతిని హత్య చేయడంతో పాటు విజయవాడలో ఉన్న తెలుగు అకాడమీ, హెచ్ఆర్సి ప్రధాన కార్యాలయం, వక్స్ బోర్టు,కృష్ణా రివర్ బోర్డులను తరలించారని తెలిపారు.

ఆఖరికి విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా భరించలేక వైఎస్ఆర్ పేరుగా మార్చే దుర్మార్గమైన పని చేపట్టారని చెప్పారు. తెలుగు నేల చరిత్రలో ఒక ప్రాంతంపై ఇంతగా కత్తి దూసిన నాయకుడు మరొకరు లేరన్నారు. పేర్ల పిచ్చి పూర్తి గా పోవాలంటే రాష్ట్రానికి ఏకంగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవచ్చని, 26 జిల్లాలకు 26 మంది మంది మంత్రుల పేర్లు పెట్టుకొని సంతృప్తి చెందాలని సూచించారు.

పిదప కాలానికి పిదప బుద్దులు అన్నట్లు ఏడాదిన్నరలో దిగి పోయే ముఖ్యమంత్రి కి ఏం చేయాలో తోచక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ప్రభుత్వం వైకాపా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఒక్క సంతకంతో రద్దు చేస్తుందన్న విషయం మర్చిపోవద్దు బాలకోటయ్య సూచించారు.

LEAVE A RESPONSE