ఓబీసీ కులగణనపై మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రం

Spread the love

– కులగణన పై చిత్తశుద్ధి లేని కేంద్రం

బీహార్ లో కుల ఆధారిత జన గణన ప్రారంభమైంది. తొలి దశ కుల గణన శనివారం నుంచి ప్రారంభమైంది.బీహార్ రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కించ నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 జిల్లాల్లో ఈ కుల గణనను రెండు దశల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీసీ కుల గణన జ‌ర‌గాల్సిందే బీసీ ఉద్యమకారులు, దళిత ప్రజాతంత్ర వాదులు, వామపక్షాలు, మేధావులు డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టించుకోక పోవడం దురదృష్టకరం.

కుల గణన అనేది జరిగితే ఎవరు ఎంత శాతం ఉన్నారని తెలుస్తుంది. కులగణన చేపట్టక కేవలం ఎనిమిది శాతం ఉన్న ఆర్థికంగా వెనుకబడ్డ వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించడం వలన వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జనాభాలో 54 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. జనాభాలో 54 శాతం ఉన్నా అన్ని రంగాల్లో వెనుకబడి పోయారు. చట్టసభల్లోనే కాదు గ్రామ మండల స్థాయి ప్రాతినిధ్యం లేని కులాలు అరవై శాతం వెనుకబడిన తరగతులలో ఉన్నాయి.
ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గా ఓబీసీ వాటా భవిష్యత్తు ఏందో తేల్చాలి. బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని మేధావులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ సర్కార్ ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయబోమని స్పష్టంచేశారు.

రిజర్వేషన్లను ఎత్తేసేలా కేంద్రం వైఖరి
బీసీ కుల గణనను చట్టం అనుమతిస్తుందని, కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి, బీసీ జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్‌ కేటాయింపులు ఎలా చేస్తారు. ‘కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కుల గణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బీసీల నుంచి డిమాండ్‌ వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ పని చేయడం లేదు. తెలంగాణ, బీహార్‌, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు కులాల లెక్కలు తీయాలని కోరారు. అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశారు. ప్రజలంతా వారి కుల లెక్కలు తీయాలని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా కుల గణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ జనాభా లెక్కలు బయటకొస్తేనే దోపిడీ చేసేవారికి అడ్డుకట్ట పడుతుంది. అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.

‘అందరూ సమిష్టిగా కేంద్రం మెడలు వంచాలి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. బీసీల పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలి. దేశంలో ఓబీసీల్లో 983 కులాలకు ఐదేండ్లుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు.ప్రధాని మోదీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతున్నది, వ్యవస్థలన్నీ పతనమై పోయాయి, నిరుద్యోగం 8.4 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాళా తీసేలా చేస్తున్నారు. ఇన్సూరెన్స్, రైల్వే, కమ్యూనికేషన్, చివరికి ఇస్రో, హెచ్ఏఎల్ ప్రవేటు పరం చేస్తున్నారు.

ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడాలి. బీసీల్లోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా బలపడాలి. దేశ జనాభాలో 54% బీసీలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బాధాకరము. కులాల లెక్కలు తీయకపోతే బీజేపీ గద్దె దిగిపోవాల్సిందే. ఇప్పటివరకు వారి వాటాతోపాటు బీసీలకు వచ్చే వాటాను కూడా అనుభవిస్తున్నారు. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ” అని,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(4) & 16(4) లలో స్పష్టంగా పేర్కొనబడింది.

ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుండి వచ్చింది. రిజర్వేషన్ కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది. మండల్ కమీషన్ రిపోర్ట్ ప్రకారం ఓబీసీ ల జనాభా 54% , అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10 శాతం రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్లు లేదు.

తీర్పు వెలువరించే ముందు ఓసి ల జనాభాను సుప్రీం శాస్త్రీయ లెక్కలు లేవు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు వెనుకబడిన తరగతులు అనుకూలంగా మలచుకుని జనాభా దామాషా ప్రకారం ఓబీసీ లకు 54%రిజర్వేషన్ల కోసం పోరాడాలి . సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి, వేరే అంశాలు పక్కన పెట్టి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. మండల్ మహనీయుడే మనకు మార్గదర్శి, ఇదే అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలి. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు ప్రకారం ఓబీసీ లకు 54% రిజర్వేషన్లు అమలు చేయాలి లేదా సమగ్రమైన,శాస్త్రీయమైన కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి.

1931 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీ ల జనాభా 54% గా మండల్ కమిషన్ పేర్కొంది, ఇప్పుడు ఆ శాతం మరింత పెరిగింది, ఎందుకంటే 1931 తర్వాత దేశవ్యాప్తంగా చాలా కులాలు ఓబీసీ జాబితాలో చేర్చారు. దళిత క్రిస్టియన్లు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువయ్యారు, వారు కూడా ఓబీసీ కోటాలో వస్తారు, ఇప్పుడు లెక్కలు తీస్తే ఓబీసీ జనాభా 60 శాతం దాటొచ్చు, దానికనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం పెరగాలి. చారిత్రాత్మకమైన తప్పిదాలకు మనము అవకాశం ఇవ్వొద్దు, మన భవిష్యత్తు తరాలు మనల్ని నిందించకూడదు, ఓబీసీ ల దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధన కోసం సాధించేవరకు పోరాడాలి.
దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అదానీకి రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ ఆర్థిక దోపిడీని అరికట్టడంతో పాటు దేశంలోని బీసీలకు న్యాయం జరిగేంతవరకు అందరితో కలిసి ఉద్యమించాలి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2018 ఎన్నికల సమయంలో బీసీ కుల గణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అమలు చేయలేదు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు.

ఇక కొట్లాడి సాధించుకుంటాం.సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, కుల గణన (షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు మినహా) సామాజిక-ఆర్థిక కుల గణన నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. సంప్రదాయబద్ధంగా అసాధ్యమైనది, పరిపాలన పరంగా కష్టం మరియు గజిబిజిగా ఉంది. 2021 జనాభా గణన సమయంలో గ్రామీణ భారతదేశంలోని వెనుకబడిన తరగతి పౌరుల డేటాను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై అఫిడవిట్ ప్రతిస్పందనగా ఉంది. ఎస్ఈసిసి -2011 సమయంలో సేకరించిన ఇతర వెనుకబడిన తరగతుల కుల డేటాను కేంద్రం బహిర్గతం చేయాలని కూడా పిటిషన్ కోరింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో రిట్ పిటిషన్‌లో ప్రతిబింబించే విధంగా కుల జనాభా గణన సమస్యకు సంబంధించిన మూడు విభిన్న అంశాలు ఉన్నాయి. ఎస్ఈసిసి-2011 కింద సేకరించిన కుల డేటాను ఎందుకు పబ్లిక్‌గా ఉంచలేదో అది మొదట వివరిస్తుంది. కుల గణనను నిర్వహించడం “విధాన నిర్ణయం” కాబట్టి న్యాయవ్యవస్థ ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోదు కాబట్టి కుల గణన చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని అది వాదిస్తుంది. చివరగా, కుల గణనను ప్రయత్నించడం ఆచరణాత్మకంగా లేదా పరిపాలనాపరంగా ఎందుకు సాధ్యం కాదనే దానిపై ఇది వివరిస్తుంది.

ఎస్ఈసిసి-2011 యొక్క 130 కోట్ల మంది భారతీయుల కుల డేటా ఐదు సంవత్సరాలుగా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలో ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో అంగీకరించింది. డేటాలోని లోపాల కారణంగా అప్పటి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ కమిటీలోని ఇతర సభ్యులు పేరు పెట్టనందున, కమిటీ ఎప్పుడు సమావేశం కాలేదు ఫలితంగా, ప్రచురించ దగిన ఫలితాలతో ముడిపడి ఉన్న డేటాపై ఎటువంటి చర్య తీసుకోలేదు.

కేంద్ర ప్రభుత్వం ఓబీసీ లపై చులకన భావం, తప్పించుకొనే విధానం అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయబోమని ఓబీసీలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం చివరకు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనతో బీజేపీ సర్కారు ఉన్నది. వెంటనే కుల గణన చేపట్టి, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి బీసీ సబ్‌ప్లాన్‌ కూడా అమలు చేయాలి.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply