అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడవగలగడం మాట దేవుడెరుగు! అది ఎప్పటికీ సాధ్యం కాదు కానీ……..!
ఈ ఆధునిక ప్రపంచంలో పట్టపగలు ఇద్దరు స్త్రీలని నగ్నంగా నడిపిస్తూ వాళ్ళ జననాంగాల మీద చేతులు వేస్తూ, పరమ జుగుప్సాకరరమైన చేష్టలు చేస్తూ, పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక మానభంగం చేస్తుంటే , చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా?
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టా రానట్టా?
లేనట్టేగా రానట్టే గా!
ఆదిమ మానవులు కూడా ఇలా చేసి ఉండరు!
మన సంస్కృతి మన నాగరికత అలా ఏడిచాయ్!
ఇదేనా సనాతన ధర్మం?
అసలు ధర్మం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది?
హింసే ఇప్పుడు నడుస్తున్న ధర్మం
అత్యాచారమే ఇప్పుడు నడుస్తున్న న్యాయం!
ఎన్ని వందల మందిని చంపినా ఈ నాయకులకు ఏమీ పట్టదు.
తెగల మధ్య జాతుల మధ్య వైరాన్ని సృష్టించేది మీరే
మీ రాజకీయ ప్రయోజనాల కోసం!
మీకు మీ అధికారమే ముఖ్యం
మీకు మీ మతమే ప్రాముఖ్యం!
మనిషిని మనిషిగా చూడరు మీరు
మీ కంటే ఆ జంతువులే నయం.
సింహమూ జింకా స్నేహం చేస్థాయేమో గానీ
మీరు మాత్రం మతం పేరట జాతుల పేరిట
కులం పేరిట
ఒకరినొకరు వైరంతో కొట్టుకు ఛస్తారు!
ఇన్నాళ్ల నుంచి ఇన్ని ఘోరాలు జరుగుతున్నా
ఆడపడుచులకి అంతా దారుణంగా
అవమానం జరుగుతున్నా
మీ నోళ్ళు పెగలవే
మీ గుండెలు కరగవే?
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు బోడి కబుర్లు మాత్రం చెప్తారు
మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా వెలిగిపోతోంది.
కానీ ఇక్కడ మన పరువు గంగలో కలిసిపోతోంది
అది గుర్తించండి!
న్యాయస్థానాలు మొట్టికాయలు వేసే వరకూ మీకు
చలనం రాదా?
రాయికైనా చలనం వస్తుంది కానీ నీకు రాదు!
సిగ్గు పడాలి!
భూమి సిగ్గుతో ముడుచుకుపోతోంది
ఆకాశం దుఃఖంతో కన్నీరు కారుస్తుంది.
ఈ దేశం మారదు. ఈ సమాజమూ మారదు
ఈ దేశానికి స్వతంత్రం ఎప్పటికీ రాదు.
వచ్చిందని అనుకోవడం ఒక భ్రమ
రావాలని కోరుకోవడం కూడా ఒక భ్రమే!
అనాదిగా ఈ దేశంలో ఆడదానికి అన్యాయమే జరుగుతుంది.
ఆడదానిలో మన తల్లినో చెల్లినో అక్కనో భార్యనో చూడం
చూసినా అత్యాచారం చేయడం మానం!
అప్పుడంటే ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే శ్రీ కృష్ణుడు కాపాడాడు
ఈ ఈ నవ యువ భారతంలో మానభంగం చేయబడుతున్న మహిళల్ని కాపాడేదెవరు
కాపాడే దేవుడే దెయ్యమైతే ఇక వినేదేవరు?
ఆ మహిళల శాపం మీకు తగలకపోదు
మీరు చేసిన పాపానికి శిక్ష మీకు పడకపోదు!
ఇది తప్పక జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి!
– జాస్తి రామకృష్ణ చౌదరి