Suryaa.co.in

Andhra Pradesh

అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

  • ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
  • పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, క్లోరినేషన్ చేసిన మంచినీరు అందించాలి
  • జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు ఒంగోలులోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో వర్షాలపై జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వర్షాల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.

విద్యుత్ వైర్లు తెగిపడిన చోట వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలి. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, క్లోరినేషన్ చేసిన మంచి నీరు అందించాలి. వర్షాలు తగ్గేవరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలి.

ఇప్పటివరకు కురిసిన వర్షాలు జిల్లాలోని వర్షాభావ ప్రాంతాలలో సాగుకు ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సాగు చేసిన పంటలు దెబ్బతిన్నకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలి. పంటలు దెబ్బతింటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులను ఆదుకుంటాం. చేపల వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించినందున మత్య్సకారులతోపాటు భృతి కోల్పోయిన వారికి సాయంపైనా ముఖ్యమంత్రి తో చర్చిస్తాం. వర్షాలపై ఆర్.టి.జి.ఎస్. నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాజ్వీలపై నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు వాటిపై రాకపోకలు సాగించకుండా చూడాలని చెప్పారు.

మహిళా పోలీసులు, వి.ఆర్.ఏ.లు, స్థానిక సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనావాసాల మధ్య నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడడంతోపాటు నీరు కలుషితం కాకుండా నాణ్యతా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చురుకుగా చేపట్టాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు.

LEAVE A RESPONSE