– ఆలస్యం.. అమృతం.. విషం !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు సారధ్యం వహిస్తున్న మూడు రాజకీయ పార్టీలలో…. రెండు ప్రాంతీయ పార్టీలే . ఆంధ్రప్రదేశ్ కే దాదాపుగా పరిమితమైన రాజకీయ పార్టీలు అవి . ఒకటి -తెలుగు దేశం, రెండు -జనసేన. మూడవ పార్టీ బీజేపీ. జాతీయ పార్టీ. దీని బాగోగులు… ఢిల్లీ లో ఉన్న బీజేపీ పెద్దలు చూసుకుంటారు. కనుక, ఏపీ బీజేపీ నేతలకు వర్రీ లేదు.
జనసేనను కూడా దాని కర్త, కర్మ, క్రియ అయిన పవన్ కళ్యాణ్…. తెలుగు దేశం అండ తో విజయ తీరాలకు చేర్చారు. ఇక, అది కొత్తగా చేరుకోవాల్సిన విజయతీరాలు అంటూ ఏమీ లేవు. అందరికీ అన్నీ -జెర్సీ పాడి ఆవుల్లాటి పదవులను – పవన్ కళ్యాణ్ అప్పగించేశారు .ఎవరి ఆవును వారు పట్టుకుపోయి… ‘ప్రజాసేవ’ పనిలో ఫుల్ టైం బిజీ గా ఉన్నారు.
ఇక, తెలుగు దేశం పార్టీ. దీని జాతకం బాగుంటేనే…. కూటమి జాతకం బాగుంటుంది. దానివల్ల సమాజం లో ఎంతో కొంత ‘రూల్ ఆఫ్ లా ‘ ఉంటుంది కనుక ; తెలుగువారు కాస్తంత ప్రశాంత జీవనం ఆశించవచ్చు.
అయితే, తెలుగు దేశం పార్టీ నిర్మాణం, పటిష్టత, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం మొదలైన కార్యకలాపాలను ఇప్పుడు ఎవరు చూస్తున్నారో కార్యకర్తలకు తెలియడం లేదు. పార్టీ పటిష్టతకు, సూచనలకు, పురోభివృద్ధికి, కార్యకలాపాల మెరుగుదలకు తమకు తోచిన సలహాలేవో చెబుదామనే ఉత్సాహం తోనో , పార్టీ పై పెంచుకున్న మమకారంతోనో మంగళగిరి లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఖర్చులు పెట్టుకుని వెళ్లే వారిలో చాలామంది తీవ్రమైన నిరుత్సాహంతో తిరిగివస్తున్నారు.
తమ గోడు వినేవారు అక్కడ ఎవరూ కనపడడంలేదు అనేది వారి కంప్లైంట్. అక్కడ ‘ఎవరి గోల ‘ వారిది . పార్టీ కార్యాలయానికి ఒక పాజిటివ్ ధృక్పథం తో వచ్చిన వారిలో అధికులు , నెగటివ్ ధృక్పథం తో తిరిగి వెడుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గానీ, నారా లోకేష్ గారికి గానీ ఈ మైక్రో లెవెల్ లో కొనసాగుతున్న పరిస్థితులను పట్టించుకునే సమయం ఇప్పటి పరిస్థితుల్లో ఉండక పోవడం సహజమే. రాష్ట్ర పునర్నిర్మాణం లో వారు సీరియస్ గా తలమునకలై ఉన్నారు. అయినప్పటికీ ; తమను వీరిరువురూ పట్టించుకోవలసినంత గా పట్టించుకోవడం లేదనే భావన మాత్రం కార్యకర్తల్లో “చాపకింద నీరు ” లా పేరుకు పోవడం పార్టీ కి మంచిది కాదు.
వారిని పట్టించుకునేంత సమయం చంద్రబాబుకు లేకపోవడాన్ని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. అయితే, ఇందుకు ప్రత్యామ్నాయాన్ని ఆయన ఆలోచించాలి.
అదే…. లోకేష్ ను ” వర్కింగ్ ప్రెసిడెంట్ ” గా నియమించాలంటూ ఆ మధ్యన వచ్చిన డిమాండ్. పార్టీ ముఖ్యనాయకులు సైతం బహిరంగంగా ఈ డిమాండ్ చేశారు. పార్టీ వేదికల పై కూడా మాట్టాడారు. కానీ, ఈ డిమాండ్ పట్ల చంద్రబాబు నాయుడు అంత సుముఖత వ్యక్తం చేయకపోవడం తో పార్టీ నాయకులు కూడా సర్దుకున్నారు.
అయితే, రాష్ట్రం లో అసాంఘిక శక్తులు రోజురోజుకీ విజ్రంభిస్తున్నాయి. ఈ “శక్తులు “ అటు వైసీపీ లోనూ ఉన్నాయి. కూటమి లోనూ ఉన్నాయి . పౌర సమాజాన్ని భయం గుప్పెట్లోకి నెడుతున్నాయి. ఈ అసాంఘికిక,అరాచక శక్తులను చంద్రబాబు నాయుడు సమర్ధం గా నిలువరించగలరని రాష్ట్రం లో పౌర జనం తో పాటు టీడీపీ కార్యకర్తల్లో కూడా అధికులు నమ్మడం లేదు.
ఇందుకు అనేక కారణాలు. తాను సంస్కరణ వాదినని ప్రజలు అనుకోవాలనేది చంద్రబాబు అంతరంగం . కానీ , ఆచరణ వాది కాదు. భవిష్యత్ ను మాత్రమే చూసే విజనరీ అనే కీర్తి ప్రతిష్టల పట్ల ఆసక్తి మెండుగా ఉన్న నేత . కళ్ళెదురుగా కనపడుతున్న వర్తమానాన్ని చూసే ప్రాక్టికల్ నేత కాదు. “నేలబారు” రాజకీయాలను హ్యాండిల్ చేయడం…. తన స్థాయికి తగని పని అనేది ఆయన భావన అయితే అయి ఉండవచ్చు. బిల్ గేట్స్ లెవెల్ లో చంద్రబాబు ఆలోచనలు సాగుతూ ఉండి ఉండవచ్చు.
కానీ, ఆ “నేలబారు ” రాజకీయమే ఇప్పుడు సమాజానికి సత్యము… జీవము… మార్గము అయి ఉన్నది . సమాజానికీ అదే భగవద్గీత , బైబిల్ , మార్గదర్శి . ప్రజలకు కూడా అదే కావాలి. ముఖ్యం గా యువత కు సరైన ఉపాధి లేక ….ఆవారా లక్షణాలతో రప్పా…రప్పా అంటూ రెచ్చి పోయే గ్యాంగ్ లకు నేలబారు రాజకీయాలే కావాలి .
“మీకు క్వాంటం వ్యాలీ ఏర్పాటు కావాలా… లేక, సమాజ పీడకులను లోపల వేయడం కావాలా?” అని అడిగితే, ముందు పీడకుల బారి నుంచి రక్షణ కల్పించండి మహాప్రభో అని జనం వేడుకుంటారు.
ఐదున్నర కోట్లమంది జనం లో… ఐదున్నర వేలమందికి ఉపయోగపడే టెక్నాలజీ పై చంద్రబాబు దృష్టి పెడుతున్నారనే భావం మాత్రం జనం లోకి గట్టిగా వెళ్ళిపోయింది. దానితో, తెలుగు దేశం కార్యకర్తల్లోనే నిరాశ నిస్పృహలు గట్టిగా ఆవహించాయి. 2024 ఎన్నికల ముందు వారిలో వ్యక్తమైన ఉత్సాహం, ఉద్వేగం, ఊపు, దూకుడు , అంకిత భావం లో సగం కూడా ఇప్పుడు కనపడడం లేదు.
” ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది… ” అనే నిర్వేదానికి లోనైన టీడీపీయులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. వీటన్నిటికీ విరుగుడు… నారా లోకేష్ కు అధికారికం గా బాధ్యతలు అప్పగించడమే. వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి .
అందుకే; లోకేష్ ను ఒక పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా “అధికారికం ” గా నియమించడం తో పాటు ; ముఖ్యమంత్రి కార్యాలయం లో మంత్రిగా నియమించడమే చంద్రబాబు నాయుడు చేయవలసిన పని .
నిజానికి ;పార్టీ లోనూ…., ప్రభుత్వం లోనూ లోకేష్ ఇప్పటికే నూరు శాతం నిర్ణయాత్మకం గా వ్యవహరిస్తున్నారు . ప్రభుత్వం లోని అన్ని ముఖ్య నిర్ణయాలు , బదిలీలు , పోస్టింగ్ లూ, పదవులకు నియామకాలు మొదలైనవి లోకేష్ ఓకే చేశాకే జీ ఓ లు జారీ అవుతున్నాయి అనేది సచివాలయం లో మాట్టాడుకునే బహిరంగ రహస్యం .
“ఆ పని “ ఏదో తెర వెనుక కాకుండా , అధికారయుతం గా , బహిరంగం గా , దర్జాగా చేసే “బాధ్యత “ ను లోకేష్ కు అప్పగించాలి . ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన ఈ బాధ్యతలు మరింత సమర్ధం గా , పారదర్శకం గా చేయగలుగుతారు .
సాక్షాత్తు యన్ టీ రామారావు , తన అల్లుడైన చంద్రబాబు నాయుడును పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించి ; పార్టీ బాధ్యతలను ఆయనకు అధికారికంగా 40 ఏళ్ళ క్రితమే అప్పచెప్పినప్పుడు ; ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు , సియం “కార్యాలయ మంత్రి “ బాధ్యతలు లోకేష్ కు అప్పగించడానికి చంద్రబాబు మీన మేషాలు లెక్కించాల్సిన పని లేదు . ఈ రోజు కాకపోయినా , రేపైనా యీ బరువు బాధ్యతలను లోకేష్ మోయవలసిందే కదా ।
“జగనిజం “ దయవల్ల , కూటమి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినప్పటికీ ; కూటమి భవిష్యత్ అనేది తెలుగు దేశం పైనే ఆధార పది ఉంది. తెలుగు దేశం భవిష్యత్ నారా లోకేష్ కు సరైన బాధ్యతలు అప్పగించడం పైనే ఆధార పడి ఉంది . 15 శాతం పైబడి ఓటింగ్ బలం గలిగిన ఒక ప్రధాన కులానికి టీడీపీ ఇప్పటికే దూరమైంది . చంద్రబాబు నాయుడు గమనించాలి . ఆలస్యం అమృతం విషం !

(రచయిత సీనియర్ పాత్రికేయులు)