Suryaa.co.in

Editorial

లోకేష్ ఎందుకు అ‘లా’ ఫైరయ్యారు?

– లోకేష్ తెగిస్తున్నారా?
– కావాలనే కొత్త చర్చకు తెరలేపారా?
– ‘వ్యవస్థల మేనేజ్‌మెంట్‌’పై సూటి అస్త్రాలు
– జగన్ బెయిల్, అవినాష్ అరెస్టు, బాబు జైలు వాదనలు
– ఆ వాదనల వెనుక మర్మమేమిటి?
– జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పడమే లక్ష్యమా?
– ‘వాయిదా వాదన’లపై నేరుగానే వ్యాఖ్యలు
– ఇప్పటికే జడ్జిల ‘నాట్ బిఫోర్‌మీ’పై బహుజన నేతల చర్చ
– న్యాయవ్యవస్థ తీరుపై పత్రికల్లో వ్యాసాలు
– న్యాయవ్యవస్థ లోపాలపై ప్రజల్లో మొదలైన చర్చ
– ఇప్పటికే వాయిదాలపై జనంలో చర్చ
– ‘వ్యవస్థల మేనేజ్‌మెంటు’కు బాబు బలయ్యారని చెప్పడమే లోకేష్ లక్ష్యమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

లోకేష్ లో ఎంత మార్పు? బహుశా పరిస్థితులు- ఎదురుదెబ్బలు- అనుభవమే అన్నీ నేర్పిస్తాయామో?! టీడీపీ ఉత్తరాధికారి లోకేష్‌ను ఒకప్పుడు-ఇప్పుడు దగ్గరగా చూసేవారికి కలిగే అభిప్రాయం ఇది. ఇప్పటి టీడీపీ సీనియర్లలో చాలామంది లోకేష్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. గన్‌మెన్లతో ఇంటి బయట రోడ్డుమీద క్రికెట్ ఆడిన లోకేష్‌ను చూశారు. హెరిటేజ్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాలు పరిశీలించే లోకేష్‌ను చూశారు.

పాత ఇంటికింద ఉన్న సెల్లార్‌లో కూర్చుని, పార్టీ వ్యవహారాలు మానటరింగ్ చేసిన లోకేష్‌ను చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తండ్రి నిరాహారదీక్ష చేస్తే, దగ్గరున్న లోకేష్‌ను చూశారు. తర్వాత నిమ్స్ ఆసుపత్రిలో చేర్చిన తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన నేతలతో ముచ్చటించిన లోకేష్‌ను చూశారు. మంత్రిగా పనితీరును చూశారు. విపక్షంలోకి వచ్చిన లోకేష్‌ను చూస్తున్నారు. యువగళం పాదయాత్రతో జనంలోకి వెళ్లిన లోకేష్‌ను చూశారు. మంత్రిగా ఉన్నంతవరకూ లోకేష్ మీడియాతో మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ.

పార్టీ బీట్‌కు సంబంధించిన కొంతమంది యువ జర్నలిస్టులతో అప్పుడప్పుడూ మాట్లాడేవారు తప్ప.. తరచూ ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు నిర్వహించిన సందర్భాలు చాలా తక్కువ. ఆ రోజుల్లోనే ఆయన భాష- ప్రసంగాల్లో కంగాళీ-తప్పులు విపరీతంగా ట్రోల్ అయ్యేవి. పప్పు అని విపక్షాలు ముద్ర వేసింది కూడా ఆరోజుల్లోనే. బహుశా అందుకే అప్పట్లో లోకేష్ , మీడియా ముందుకు వచ్చేందుకు జంకేవారేమో?!

ఇప్పుడు ఇవన్నీ చర్చించుకోవడం ఎందుకంటే.. లోకేష్ ప్రస్తుత పనితీరు, బాడీ లాంగ్వేజ్, ప్రత్యర్థిపై విసురుతున్న మాటల పంజా, గతానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి కాబట్టి. అప్పుడు తనను పప్పు అని విమర్శించిన వారి తప్పును, ఆయన తన మాటలతో వదిలిస్తున్నారు. పిలిచిమరీ మీడియాతో మాట్లాడుతున్నారు.‘‘ హలో టీవీ 9, సాక్షి బ్రదర్ ఏడీ? రా అన్నా’’.. అని ఆ మీడియా జర్నలిస్టులను ర్యాంగింగ్ చేస్తున్నారు.

అనుభవమైతే గానీ తత్వం బోధపడదంటారు. లోకేష్ దూకుడు, మాటలు, మారిన పనితీరు అవే చెబుతున్నాయి. పెద్దగా రాజకీయానుభవం లేని లోకేష్.. ఏకంగా ‘వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ై’పె చర్చకు తెరలేపటం చూస్తే, ఆయన ఎంచుకున్న లక్ష్యం ఎవరికి.. ఎక్కడ తగలాలో సరిగ్గా అక్కడ తగిలినట్లు కనిపిస్తోంది. అసలు ఆ అంశం ఎంచుకోవాలంటే బోలెడంత ధైర్యం కావాలి. తెలివి కావాలి. అన్నింటికీ మించి లోకజ్ఞానానికి సంబందించి విషయ పరిజ్ఞానం కావాలి. అవన్నీ లోకేష్‌లోఉన్నట్లు ఆయన మీడియా భేటీ స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయా?

లోకేష్ శైలి తండ్రికి భిన్నం. ఏదైనా సూటిగానే మాట్లాడతారు. తండ్రిలా నాన్చరు. ఏదో ఒక నిర్ణయం అప్పుడే తీసుకుంటారు. తండ్రిలా ఉండదు ఆయన అపాయింట్‌మెంట్ వ్యవహారం. చంద్రబాబుది ధర్మదర్శనాల వ్యవహారం. వచ్చే ముందో, వెళ్లేముందో అక్కడున్న వారితో మాట్లాడతారు. అంతే! కానీ లోకేష్ టైమంటే టైమే. ముందే సదరు వ్యక్తికి ఫోను వెళుతుంది. కారు నెంబరు తీసుకుని సెక్యూరిటీకి ఇస్తారు. లోపల టీ బిస్కట్లు ఇచ్చి గౌరవిస్తారు. అంశాన్ని బట్టి చర్చల సమయం నిర్దేశిస్తారు. అంతే!

బాబులా నేతలను గంటలకు గంటలు వెయిట్ చేయించరు. గంటలకు గంటలు మాట్లాడరు. తొలుత లోకేష్ తీరు నచ్చని పార్టీ పెద్దలు, కొంతకాలం తర్వాత.. పెద్దాయన కంటే చిన్నాయనే బెటర్ అన్న అభిప్రాయానికి తక్కువకాలానికే వచ్చారు. అంత కచ్చితత్వంతో ఉండే లోకేష్ .. నేరుగా ‘వ్యవస్థల మేనేజ్‌మెంట్’తో ఢీకొనడమే ఆశ్చర్యం!

తాజాగా రాజమండ్రి జైలు బయట.. జగన్ వ్యవస్థల మేనేజ్‌మెంట్‌పై చేసిన లోకేష్ వ్యాఖ్యలు చర్చకు అర్హమైనవే. నిజానికి లోకేష్ ప్రస్తావించిన అంశాలేవీ కొత్తకాదు. సామాన్య జనంలో చెట్ల కింద, రచ్చబండల వద్ద వినిపించే ‘కాఫీకబుర్లే’ అవి. కాకపోతే ఎవరూ బయటకు మాట్లాడే సాహసం చేయరు. ఇది కూడా చదవండి: ‘వ్యవస్థల మేనేజర్’ ఎవరో అర్ధమైందా రాజా?

మీడియాలో కింది నుంచి పైస్థాయి హోదాలో పనిచేసే ప్రతి ఒక్కరికీ వ్యవస్థల మేనేజ్‌మెంట్ అంటే ఏమిటో తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. కానీ రాసే ధైర్యం చేయరు. కారణం భయం. ఎక్కడ శిక్షలు వేస్తారేమోనన్న భయం. కోర్టు ధిక్కరణ పేరుతో కొరడా ఝళిపిస్తారేమోనన్న భయం.

గాలి జనార్దన్‌రెడ్డి ఒక జడ్జిగారికి లంచం ఇస్తూ సస్పెండైన ఘటనను మాత్రం, తాటికాయంత అక్షరాల్లో వేసి ఆనందించాయి. ఎందుకంటే అది జరిగిన ఘటన కాబట్టి! అదీ ధైర్యం! న్యాయవ్యవస్థ ఇలా అయిపోతోందని వాపోతూ సంపాదకీయాలు రాశాయి. అంతే తప్ప, ఆ వ్యవస్థ వెనుక ఏం జరుగుతోందో పరిశోధించే పనికి దిగలేదు. మామూలు వ్యవహారాల్లో స్టింగ్ ఆపరేషన్లతో హడావిడి చేసే మీడియా.. న్యాయవ్యవస్థకు సంబంధించి ఇప్పటిదాకా ఆ పని చేసిన దాఖలాలు లేవు. కారణం భయం. ఆ మాట చెప్పడానికి భయపడాల్సిన పనిలేదు.

అందుకే నేరుగా కోర్టుల పేరు చెప్పకుండా, అటు రాజకీయ నాయకులు కూడా.. వ్యవస్థల మేనేజ్‌మెంట్ అనే ఒక చక్కటి పదాన్ని ఎంచుకుంటారు. కానీ లోకేష్ సూటిగా, సుత్తి లేకుండా వాడిన వ్యవస్థల మేనేజ్‌మెంట్ అనే పదజాలం.. కోర్టులనుద్దేశించినవేనని, దానికి కొనసాగింపుగా ఆయన చేసిన వివణాత్మక వ్యాఖ్యలు, మెడపై తల ఉన్న ప్రతి ఒక్కరికీ అర్ధమైపోయాయి.

నిజానికి ఆ పదానికి ‘తెరవెనుక భావన’ అందరికీ తెలిసినా… ఇప్పుడు లోకేష్ ‘ మీడియా నోట్లో పెట్టి’ తాను అనుకున్నది.. జనాలు చాలా ఏళ్లుగా అనుకుంటున్నదీ.. మీడియా ద్వారా చెప్పేశారు. అలా చెప్పవలసిన వారికి.. చేరవలసినవారికి చేర్చేశారు! నిజానికి అలా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. కానీ నిర్భీతిగా లోకేష్ తెరలేపిన వ్యవస్థల మేనేజ్‌మెంట్ పదం, ఎవరికి తాకాలో నేరుగా వారికే తగిలింది. అలా తగిలేలా లోకేష్ వ్యూహాత్మకంగా, జనాంతికంగా చెప్పి బహిరంగ చర్చకు తెరలేపారు.

‘‘స్కిల్ కేసులో చంద్రబాబు అకౌంటుకు గానీ, నా అకౌంట్‌కు గానీ, తన తల్లి అకౌంటులో డబ్బులేమైనా బదిలీ అయినట్లు చూపించారా? అదే కేసులో చాలామంది మందికి బెయిల్ ఇస్తే, చంద్రబాబుకు ఎందుకు ఇవ్వరు? సుప్రీంకోర్టులో తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించకుండా ముకుల్ రోహత్గి వంటి పెద్ద లాయరు ఎందుకు వారాల పాటు వాయిదాలు అడుగుతున్నారు? పదేళ్ల నుంచి సీఎం జగన్ బెయిల్‌పై ఎలా బయట తిరుగుతున్నారు? బాబాయ్ వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్‌రెడ్డి స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నారు? నిందితుడిగా ఉన్న జగన్ ప్రతి వారం కోర్టుకు ఎందుకు హాజరుకావడం లేదు? బాధితుడిగా ఎన్‌ఐఏ కోర్టుకు ఎందుకు వెళ్లటం లేదు? ఇవన్నీ వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లే కదా? గతంలో జగన్ లాయర్లే కదా ఇప్పుడు పనిచేస్తున్నారు’’ అని అడుగుతున్నా’’

ఇవీ… కోర్టుల పేరు చెప్పకుండా, వ్యవస్థల మేనేజ్‌మెంట్‌పై లోకేష్ సూటిగా సంధించిన ప్రశ్నాస్త్రాలు. కానీ ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాలు, లేవనెత్తిన మేనేజ్‌మెంట్ వ్యవస్థల ముద్దు పేరు న్యాయస్థానాలేనని, లోకేష్ చెప్పకనే చెప్పినట్లు బుద్ధి బుర్ర ఉన్న ఎవరికైనా అర్ధమయి తీరాలి. ఇది కూడా చదవండి: ‘లా’ ఒక్కింతయు లేదు

నిజమే. స్కిల్ కేసులో నిందితులందరికీ ఇప్పటికే బెయిల్ వచ్చేసింది. చంద్రబాబు ఇప్పటికి జైల్లో అర్ధశతదినోత్సవం చేసుకున్నారు. అంటే ఇదే కేసు నిందితులందరికంటే ఎక్కువకాలం ఆయన జైలు శిక్ష అనుభవించారు. అయినా బెయిల్ రాలేదు ఎందుకు? చంద్రబాబు కేసు బెంచి మీదకు వచ్చినప్పుడల్లా జడ్జిలు, నాట్‌బిఫోర్‌మీ అని తప్పుకుంటున్నారు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వారాలకు వారాలు వాయిదాలు పడుతున్నాయి. మరోవైపు సీఐడీ అధికారులు రాష్ట్రాలకు తరిలివెళ్లి అక్కడ కేసుకు సంబంధించిన ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

ఇంత జరుగుతున్నా కేసు పెట్టిన సీఐడీ.. స్కిల్ కేసులో గోల్‌మాల్ జరిగిందన్న నిధులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో, ఇప్పటిదాకా కోర్టులకు సమర్పించకపోవడ మే ఆశ్చర్యం. సీఐడీ అధికారులు ఫలానా తేదీలోగా తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని.. అటు కోర్టులు కూడా ఆదే శించకుండా, ప్రభుత్వ న్యాయవాదులు అడిగే వాయిదాలను అంగీకరించడం మరో ఆశ్చర్యం.

ఇవన్నీ చంద్రబాబు కేసుకు సంబంధించి ప్రతిరోజూ పత్రికలు, చానెళ్లూ చూసే బుద్ధి జీవులకు సహజంగా వచ్చే సందేహాలు. కానీ వారెవరూ ఇదేం విచిత్రమని కోర్టుకు వెళ్లి అడగరు. రచ్చబండలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్ల వద్ద చర్చించుకుంటారంతే! అంటే న్యాయవ్యవస్ధపై చర్చ జనక్షేత్రంలోకి వెళ్లిందన్నమాట. ఇటీవల బహుజన జేఏసీ నేత బాలకోటయ్య చంద్రబాబు కేసులో జరుగుతున్న నాట్‌బిఫోర్‌మీపై ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు, చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కేసు విచారణ కార్తీకదీపం తెలుగుటీవీ సీరియళ్లను మించిపోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్య జనబాహుళ్యంలో చర్చనీయాంశమయింది.

నిజానికి కోర్టు తీర్పుల గురించి ఎవరూ ప్రశ్నించరు. న్యాయవ్యవస్థ గురించి ఎవరూ చర్చించరు. మీడియా కూడా రాసే సాహసం చేయదు. కానీ ప్రముఖ న్యాయకోవిదుడు, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ ..16 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో, సగం మంది అవినీతి పరులను సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే మాత్రం, ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు కాలేదు. అదే వ్యాఖ్య ఇతరులు చేసి ఉంటే పరిస్థితి ఏమిటని, పెద్దగా ఊహించుకోవలసిన పనిలేదు.

అప్పటి ప్రధాన న్యాయమూర్తిని ఎవరో ప్రభావితం చేస్తున్నారని సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కురియన్ జోసఫ్, ఒక ఇంగ్లీషు పత్రికకు వెల్లడించారు. ఇక మన రాష్ట్రానికే చెందిన నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్.. న్యాయవ్యవస్థ-ప్రభుత్వ సంబంధాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం -న్యాయవ్యవస్థకు నడుస్తున్న మితిమీరిన స్నేహం, ప్రజాస్వామ్యహత్యకు మరణ మృదంగం మోగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రెస్‌మీట్ పెట్టి, తమ వద్ద జరుగుతున్న లోపాలను వెల్లడించడం కొసమెరుపు.

ఇక మొన్నటి వరకూ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కిరణ్ రివిజు.. ఐదేళ్లలో 1600 మంది న్యాయమూర్తులపై ఫిర్యాదులు వచ్చాయని, స్వయంగా పార్లమెంటులో వెల్లడించారు. అయితే వీరెవరిపైనా కోర్టు ధిక్కరణ కేసులు గానీ, సంజాయిషీ నోటీసులు గానీ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. తర్వాత సదరు ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ రెండు సంఘటనలు పౌరసమాజానికి ఎలాంటి సంకేతాలిస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

మరి ఇప్పుడు వ్యవస్థల మేనేజ్‌మెంట్ అంటూ, అసలు విషయాలను లౌక్యంగా తెరపైకి తెచ్చిన లోకేష్ పరిస్థితి ఏమిటో చూడాలి. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, జగన్ అవినీతి కేసు ఏడాదిలో ఎందుకు పూర్తి చేయడం లేదు? పదేళ్లపాటు జగన్ బెయిల్‌పై ఎలా ఉంటారు? ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డి ఎందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్న లోకేష్ ప్రశ్నలకు.. సంబంధిత వేదికయిన న్యాయస్థానాల నుంచి తీర్పుల ద్వారా ఎలాంటి జవాబు వస్తాయో చూడాలి. నిజానికి లోకేష్ వ్యాఖ్యల ‘కవిహృదయం’ కూడా అదే.

నిజానికి ఈ వ్యవస్థల మేనేజ్‌మెంట్ అనే పదం లోకేష్ మాత్రమే పుట్టించింది కాదు. బాబు సీఎంగా ఉండగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తర్వాత వైసీపీ స్థాపించిన ఆయన తనయుడు జగన్.. గతంలో చంద్రబాబునుద్దేశించి, సంధించిన పద ప్రయోగాలే. బాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని జగన్ లెక్కలేనన్ని సార్లు ఆరోపించారు.

ఇక వైసీపీ నేతలయితే.. వ్యవస్థల్లో తన మనుషులను నియమించుకుని, చంద్రబాబు శిక్షలు తప్పించుకున్నారని కొన్ని డజన్ల సార్లు ఆరోపించారు. అంటే జగన్ ఆరోపించిన ఆ వ్యవస్థల మేనేజ్‌మెంట్..తాజాగా లోకేష్ చెప్పిన ఈ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఒక్కటేనని, చివరాఖరకు అర్థమయితీరాలి. అంతే!

సర్కారీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లంరెడ్డి స్వయంగా ప్రెస్‌మీట్లలో వాడిన ఈ పదాలు.. అప్పటినుంచే జనంనోట్లో నానుతున్నాయన్నది మనం మనుషులం అన్నంత నిజం. ‘‘న్యాయం చేయడమే కాదు. న్యాయం చేసినట్లు కనిపించాలి కూడా’’ అన్న మౌలిక న్యాయసూత్రం అమలు కావాలన్నదే అందరి ఆకాంక్ష!

LEAVE A RESPONSE