– ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పరిశ్రమదారులకు మద్దతు
– ఏపీ -సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ రోడ్ షోలో మంత్రి లోకేష్
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక… ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత మాదే, ఆ తర్వాత ప్రాజెక్టు తమదిగా భావించి అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్చర్ లో ఏపీ ప్రభుత్వం… సింగపూర్ సహకారాన్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబునాయుడు విజ్ఞప్తిమేరకు ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ అందించిందని తెలిపారు. 974 కి.మీ.ల సువిశాల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్ టెక్, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఆదిత్య మిట్టల్ తో కేవలం ఒక్క జూమ్ కాల్ సంభాషణతో భారతదేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను ఎపిలో ఏర్పాటుచేయడానికి అంగీకరించారని, తమ ప్రభుత్వంపై నమ్మకానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. రెన్యూ పవర్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ కు అనంతపురం జిల్లాలో పనులు ప్రారంభించిందని తెలిపారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇటీవల ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0తో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారబోతోందని చెప్పారు.
రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్, వర్క్ ఫోర్స్ తమవద్ద సిద్ధంగా ఉందని చెప్పారు. హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్ అండ్ డి, ప్లగ్ అండ్ ప్లే ఇన్ ఫ్రాస్ట్చర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, సౌకర్యాలు, ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్న శాసనసభ్యుల్లో 50శాతం, మంత్రి వర్గంలో 75శాతం కొత్తవారు, సింగపూర్ నుంచి ఎపిలో పరిశ్రమలస్థాపనకు వచ్చే ఇన్వెస్టర్లకు అవసరమైన పూర్తిస్థాయి మద్దతు మా నుంచి మీకు అందుతుంది. ఇన్నొవేషన్, ఇన్వెస్ట్ మెంట్, ఇంపాక్ట్ సహకారాన్ని తాము సింగపూర్ నుంచి కోరుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.