Suryaa.co.in

Editorial

జగన్‌రెడ్డికి ఒక న్యాయం.. సురేఖకు మరో న్యాయమా?

  • ఒకే కోర్టు.. రెండు వైఖరులా?

  • 11 ఏళ్ల నుంచి 11సీబీఐ, 9 ఈడీ కేసుల్లో జగన్ నిందితుడు

  • ఇప్పటికి దాకా కోర్టు విచారణకు హాజరుకాని జగన్‌రెడ్డి

  • మంత్రి సురేఖపై నాగార్జున వందకోట్ల పరువునష్టం దావా

  • రెండోరోజు నాగార్జున వాంగ్మూలం, మూడవరోజు సాక్షుల వాంగ్మూలం నమోదు

  • కొండా సురేఖ కేసులో ఆగమేఘాలపై చర్యలా?

  • ఆ వేగం జగన్‌రెడ్డి కేసులో ఏదన్న వ్యాఖ్యలు

  • జగన్ కేసును కూడా ఇంతే వేగంగా తేల్చాలంటూనే నాగ్ కేసులో వేగంపై ప్రశంస

  • కోర్టు చర్యను మెచ్చుకుంటూనే జగన్-సురేఖ కేసులను పోల్చుతున్న నెటిజన్లు

  • సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. కొండ సురేఖపై తన మిత్రుడు నాగార్జున వేసిన పరువునష్టం కేసు పరిణామం, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు శిరోభారంగా మారింది. సురేఖపై నాగార్జున కేసు వేస్తే, జగన్‌కు సంబంధమేమిటనుకుంటున్నారా? అదేమరి పొలిటికల్ ఫిట్టింగంటే! నాంపల్లి కోర్టు.. కేవలం రెండురోజుల్లో నాగార్జున వాంగ్మూలం, సాక్షుల వాంగ్మూలం తీసుకున్న క్రమంలో.. మరి 11 ఏళ్ల నుంచి సీబీఐ-ఈడీ కేసులున్న జగన్ కోర్టుకు ఎందుకు హాజరుకావడం లేదు? ఆయన కోర్టుకు రావాలని ఎందుకు ఆదేశించడం లేదంటూ.. సోషల్‌మీడియాలో మొదలైన చర్చ, జగన్‌కు పితలాటకంగా పరిణమించింది.

ఇదేం దేశం?.. ఈ ప్రశ్న వేసింది ఎవరో తెలుసా? ఐదేళ్లు ఏపీని పాలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. తిరుమల లడ్డు వివాదంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యస్. ఇప్పుడు సోషల్‌మీడియా సైనికులు..మేధావులు- విద్యావంతులు, జగన్‌రెడ్డి మాటలనే గుర్తు చేస్తున్నారు. జగన్‌రెడ్డికి న్యాయంలో ఒక వేగం.. మహిళా మంత్రి కొండా సురేఖకు న్యాయంలో మరో వేగమా? అని వాపోతున్నారు.

అది నాంపల్లి కోర్టు ప్రాంగణం. అందులో వివిధ కోర్టులు ఉన్నాయి. గతంలో ఇదే కోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కేసు నడిచింది. ఇంకా నడుస్తోంది కూడా. ఈ కేసును త్వరగా తేల్చమని.. అటు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, ఇటు రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశించింది. బట్.. నో యూజ్. ఇప్పటిదాకా జగన్‌ను కోర్టుకు హాజరుపరచలేకపోయారు. దానికి కారణాలు అనేకం. లా పాయింట్లతో జగన్ తన కేసును తెలుగు టీవీ జీడిపాకం సీరియల్స్‌ను తలదన్నేలా సాగదీయిస్తున్నారు.

అదే నాంపల్లి కోర్టులో.. రెండు రోజుల క్రితం జరిగిన మరో ఘటన విశేషాలు చూద్దాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో.. తన కుటుంబ పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయంటూ, హీరో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు. రెండో రోజు వాంగ్మూలం.. మూడోరోజు సాక్షుల వాంగ్మూలం. ఇప్పుడు ఈ సూపర్‌ఫాస్ట్ న్యాయంపై సోషల్‌మీడియా వేదికగా, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కోర్టు వేగాన్ని, తీరును ఎవరూ తప్పుపట్టకపోయినా.. జగన్‌రెడ్డి కేసులో ఈ వేగం కనిపిస్తే న్యాయదేవత కూడా సంతోషిస్తుంది కదా అని సూచిస్తున్నారు. ఇలాంటి తీర్పులను త్వరగా తెమిలిస్తే అందరికీ సంతోషమేనని కితాబిస్తున్నారు.

దానితోపాటు.. ‘‘వంద కోట్ల పరువునష్టం కేసులో రెండో రోజు వాంగ్మూలం. మూడవ రోజు సాక్షుల వాంగ్మూలం. 42వేల కోట్లు స్వాహా చేశారంటూ జగన్‌రెడ్డిపై సీబీఐ 11 ఏళ్ల క్రితం 9 ఈడీ కేసులు, 11 సీబీఐ కేసులు వేసినా.. నిందితుడైన జగన్‌రెడ్డి కోర్టు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదు? ఆయనను కోర్టుకు రావాల్సిందేనని కోర్టు ఎందుకు ఆదేశించడం లేదు? ఆ నిందితుడైన జగన్ పరిభాషలోనే చెప్పాలంటే.. ఇదేం దేశం’’ అంటూ మేధావులు, విద్యాధికులయిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE