Suryaa.co.in

Editorial

ఒక్క మగాడు…

– బ్యూరోక్రాట్ల బుర్రలు పనిచేస్తున్నాయా?
– కోర్టు అక్షింతలకూ కళ్లు తెరవరా?
– ఐపీఎస్ సంఘం స్పందించదేం?
– ఏబీ మాటలు ఎవరికి ఈటెలు?
– ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరికలు దేనికి సంకేతం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ అధికారమదం తలకెక్కితే ప్రజలే వాతపెడతారు. ఉద్యోగులపై పెత్తనం చేయవద్దు. మంచితనంతో వారితో పనులు చేయించుకోవాలి. అధికారం ఉంది కదాని వారితో దురుసుగా ప్రవర్తించకూడదు. ప్రతిపక్ష కార్యకర్తలు వేధించవద్దు. వారిని రాజకీయ శత్రువులుగానే చూడాలి. ఎంత తగ్గితే అంతమంచిది. మనం

జనాలకు జవాబుదారీగా ఉన్నాం. జగన్‌కు జవాబుదారీగా ఉన్నాం. అందరినీ ప్రేమిద్దాం. అందరినీ మిత్రులుగా చూద్దాం. శత్రువులుగా వద్దు. అధికారమదంతో ప్రవర్తిస్తే ప్రజలు చెప్పాల్సినరోజు చెప్పాల్సిన విధంగా వాతపెడతారు.
– వైసీపీ ప్లీనరీలో వైసీపీ నేతలు, సర్పంచులు, జడ్పీటీసీలనుద్దేశించి నెల్లూరు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్య.
* 1969 సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినందున సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నాం. తనపై ఉన్న ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నాం’’
– ‘‘ కోర్టు ఆదేశాలతో రెండువారాల క్రితమే పోస్టింగ్ పొందిన సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సస్పెండ్ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది.
* * *
అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు, అధికార పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి భిన్నంగా ఉన్న వ్యవహారమిది.
యస్. కోటంరెడ్డి చెప్పింది అక్షరసత్యం. అధికారం తలకెక్కితే దానిని ప్రజలే దించేస్తారు. ఇది అప్పుడు తెలుగుదేశం పార్టీకయినా, ఇప్పటి వైసీపీ పార్టీకయినా వర్తించే సూత్రం. విభీషణుడి అవతారమెత్తిన ఎమ్మెల్యే కోటంరెడ్డిలో హటాత్తుగా వచ్చిన ఈ మార్పునకు సంకేతం ఏమిటి? జనం నుంచి వస్తున్న ప్రమాదఘంటికలను కోటంరెడ్డి ముందస్తుగా కనిపెట్టారా? లేక తమ నాయకత్వంలో కూడా అధికారమదం తలకెక్కిందంటూ పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారా? ఏదైతేనేం.. వైసీపీలో ఒక విభీషణుడు ఉదయించాడు. తప్పును తప్పంటూ వేలెత్తిచూపెట్టే ఒక్క మగాడు ఆవిర్భవించాడు.

ఓకే.. ఓకే.. అధికార వైసీపీలో ఎట్టకేలకూ, మూడేళ్ల తర్వాతయినా ఓ విభీషణుడు పుడితే… మరి ఎప్పుడో పుట్టిన బ్యూరోక్రాట్లు ఎందుకు విభీషణులు కావడం లేదు? వారి బుర్రలు ఎందుకు పనిచేయటం లేదు? ప్రభుత్వ ఆదేశాల్లో తప్పులను ఎందుకు పాలకుల ముందు విబేధించలేకపోతున్నారు? కీలక స్థానాల్లో ఉన్న అధికారుల మస్తిష్కాలు, బానిసత్వంతో ఎందుకు పేరుకుపోయింది? పోస్టింగుల కోసం మరీ అంత పరాధీనం కావాలా? ఒక ఏబీ వెంకటేశ్వరరావు అనే ఐపిఎస్ మాదిరిగా, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించలేక ఎందుకు పలాయనవాదం పఠిస్తున్నారు?

ఇంతకూ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది పనిచేస్తోందా? లేక పడకేసిందా? ఎల్వీ సుబ్రమణ్యం అనే సీఎస్‌నే అవమానకరరీతిలో పంపించినప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మౌనవ్రతం పాటించినట్లే… ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ ఐపీఎస్‌ను సర్కారు బంతాట ఆడుకుంటుంటే, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మూగనోము పడుతోందా? అటెండర్ల నుంచి ఎమ్మార్వోల వరకూ తమ సహచరులను వేధిస్తుంటే ఆయా సంఘాలు గళమెత్తుతాయే? … మరి ఆ పాటి స్ఫూర్తి కూడా ఐపీఎస్, ఐఏఎస్ సంఘాలకు ఉండదా? ఉండాలి కదా! ‘ఒక్క మగాడు’ మాదిరిగా సర్కారు నిర్ణయాలను సవాల్ చేస్తున్న ఏబీకి బాసటగా నిలిచేందుకు భయమెందుకు? ఇవీ… బుద్ధిజీవులు సంధిస్తున్న ప్రశ్నలు.

యస్. సర్కారు నిర్ణయాలను సవాల్ చేయడమే కాకుండా, రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులు వినియోగించుకుని పాలకులను నిర్భయంగా, నిస్సంకోచంగా చూపుడువేలుతో ప్రశ్నిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు అనే అధికారి సమాజం దృష్టిలో కచ్చితంగా ఒక్క మగాడే. ఏబీ వెంకటేశ్వరరావు అనే అధికారి పూలుకడిగిన ముత్యమని ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఆయన అవినీతికి పాల్పడి, సర్కారీ సొమ్మును లూటీ చేసి ఉంటే కచ్చితంగా శిక్షార్హుడే. పరికరాలు కొనుగోలు చేసి, అందుకు ఇజ్రాయిల్ కంపెనీకి డబ్బు చెల్లించి, అందులో కమిషన్‌కు కక్కుర్తి పడితే, ఆ విషయంలో ఆయనను ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. దన్నుగా నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవినీతిపరులకు కచ్చితంగా శిక్షపడాల్సిందే.

మరి ఆ ఆరోపణలేమిటో చార్జిషీటులో బిగించి, చట్టం నుంచి తప్పించుకోకుండా చూడటమే కదా ప్రభుత్వం చేయాల్సిన పని? అందుకోసమే కదా లక్షల రూపాయల ప్రజాధనాన్ని న్యాయవాదులకు ఇస్తోంది? తాను చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు చూపాల్సిన బాధ్యత కూడా, నేరాభియోగం చేసిన ప్రభుత్వానిదే కదా? సదరు కంపెనీ నుంచి నాటి సర్కారు ఎంత డబ్బు చెల్లించి పరికరాలు కొనుగోలు చేసింది? అందులో నిఘా బాసుగా ఉన్న ఏబీ, ఏ రూపంలో ఎంత కమిషన్ తీసుకున్నారు? అన్న వాస్తవాలను సాక్ష్యాధారాలతో కోర్టు ముందుంచాలి కదా? అలాకాకుండా గుడ్డిగా నేరాభియోగంతో సస్పెండ్ చేసి, గుడ్డకాల్చినెత్తినేస్తే ఏ చట్టాలు గుడ్డిగా ఉంటాయి? ఏ కోర్టులు మౌనంగా ఉంటాయి? రెండువారాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే కదా? మళ్లీ అలాంటి పొరపాటు చేస్తే ఎలా?

ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది అలాగే కనిపిస్తోంది. పరికరాల కొనుగోలు కేసులో ఏబీని సస్పెండ్ చేసిన జగన్ ప్రభుత్వం, ఆయనకు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రెండేళ్లకు గానీ పోస్టింగు ఇవ్వలేదు. ఈలోగా ఆయనకు సగం జీతం ఇచ్చింది. ఈ రెండేళ్ల కోర్టు వాదనలకు లాయర్లకు కోట్లు ఖర్చు పెట్టింది. పోనీ అంత పెట్టినా కేసు గెలిచిందా అంటే అదీ లేదు. ఒకవేళ ఏబీవీ నేరాలను రుజువుచేసి ఉంటే, ఖర్చయిన ప్రజాధనానికి సార్ధకత ఉండేది. మరి ఖర్చయిపోయి, లాయర్ల పాలయిన ఆ ప్రజాధనం ఎవరు తిరిగిస్తారు? సస్పెన్షన్‌కు కారణమయిన జగన్మోహన్‌రెడ్డి ఇస్తారా? ఉత్తర్వులిచ్చిన నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇస్తారా? ప్రభుత్వానిదే కదా ఆ బాధ్యత? ఇది కదా ఉత్తర్వులిచ్చే ముందు బ్యూరోక్రాట్లు ఆలోచించాల్సింది?!

సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండువారాల క్రితమే పోస్టింగు పొంది, రెండురోజుల క్రితమే కర్నూలులో గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ స్థితిగతులను పరిశీలించి వచ్చిన మరుసటిరోజే, మళ్లీ రెండోసారి సస్పెండ్ చేయడమేమిటో ఎవరికీ అర్ధం కాదు. ఇంతకూ ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారంటే.. ఏసీబీ కేసులో

అభియోగం ఎదుర్కొంటున్న ఏబీ, ఆ కేసులోని సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారన్నది ఆయన సస్పెనన్‌కు కారణమట. అంటే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం.. గతంలో ఒక కేసులో సస్పెండయి, తిరిగి పోస్టింగు పొందిన అధికారులు, తమ కేసుల్లో సాక్షులుగా ఉన్నవారిని ప్రభావితం చేస్తారన్నమాట. పాలకుల కవి హృదయం అదేనని ఉత్తర్వులే చెబుతున్నాయి.

బాగుంది.కాసేపు అదే నిజమనుకుందాం. మరి ఆ ప్రకారంగా.. జగన్ అక్రమాస్తుల కేసులో, సుదీర్ఘకాలం జైలు పాలయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా సస్పెండయి, మళ్లీ విధుల్లో చేరిన ఆఫీసరే. తెలంగాణ క్యాడర్‌లో ఉన్న ఆమెను ఏపీ క్యాడర్‌కు వచ్చేలా, అవిరళ కృషి చేసిన జగన్ సర్కారు ఆమెకు కీలకమైన పోస్టింగు ఇచ్చి గౌరవించింది కదా. మరి ఆ ప్రకారంగా.. శ్రీలక్ష్మి కూడా తన కేసులో సాక్షులను ప్రభావితం చేస్తుందనుకోవాలా? అదే నిజమైతే ఆమెను కూడా మళ్లీ సస్పెండ్ చేయడమే రాజధర్మం కదా?.. తాజా ప్రెస్‌మీట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సంధించిన ప్రశ్నాస్త్రం కూడా ఇదే కదా మరి?!

అసలు స్వయంగా ముఖ్యమంత్రి జగనన్నే 16 నెలలు జైల్లో ఉండి, బెయిల్‌పై ఉన్న నాయకుడు కదా? మరి ఒక ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారే సాక్షులను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటే.. వారికి పోస్టింగులు ఇచ్చే ముఖ్యమంత్రి ఏ స్థాయిలో సాక్షులను ప్రభావితం చేయాలి? ఆ ఆరోపణలతోనే కదా ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆయన బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటం చేస్తోంది? అయితే అధికారుల మాదిరిగా సీఎంను ఎవరూ సస్పెండ్ చేయలేరు కాబట్టి, ఆ సూత్రం ముఖ్యమంత్రులకు వర్తించకపోవచ్చు. కానీ అది నైతికంగా వర్తించే సూత్రమే కదా? తాజా ప్రెస్‌మీట్‌లో ఏబీ కూడా చూపుడువేలుతో అదే ప్రశ్నించారు కదా?!

అసలింతకూ ఏబీ చేశారంటున్న ఆ పరికరాల కొను‘గోల్‌మాల్’ యవ్వారం తేల్చేందుకు ఇన్నేళ్లు ఎందుకు పడుతుందన్నది న్యాయ నిపుణుల ప్రశ్న. నత్తలు కూడా నవ్విపోతున్న ఈ ఆలస్యానికి కారణం ఎవరు? పోనీ ఆయనపై చార్జిషీటేమైనా వేశారా అంటే అదీ లేదు. నిజంగా సర్కారు వద్ద ఏబీ అవినీతి నిరూపించే ఆధారాలుంటే.. ఆగమేఘాలపై వాటిని చార్జిషీటులో పెట్టి, ఆయనపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుందంటే.. సర్కారు అభియోగాల్లో సరుకు లేదని, ఆయనను మళ్లీ సస్పెన్షన్ పేరిట మరికొద్దికాలం.. వీలయితే రిటైరయ్యే వరకూ వేధించే వ్యూహమేనన్నది, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. మరి పాలకుల ఆదేశాలు పాటించే బ్యూరోక్రాట్ల బుర్రలకు, ఈ లాజిక్ ఎందుకు అర్ధం కావడం లేదన్నదే బుద్ధిజీవుల ప్రశ్న.

అయినా ఇదే కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నదే సర్కారు వాదనయితే.. మరి వారి పేర్లు చార్జిషీట్‌లో పెడితేనే కదా, ఏబీ ఎవరిని ప్రభావితం చేస్తున్నారని తెలిసేది? అసలు చార్జిషీటే నమోదు చేయకుండా, ఏబీ ఎవరిని ప్రభావితం చేస్తున్నారన్న నిర్ణయానికి ప్రభుత్వం ఎలా వస్తుంది? ఇదంతా కాలహననం కోసం వేసే ఎత్తుగడ. ఈ కేసులేవీ నిలవవు. కాకపోతే కేసు పూర్తయ్యేవరకూ బాధితుడికి, మానసికవేదన మిగులుతుందన్నది న్యాయవాదుల ఉవాచ.

అయితే..రెండేళ్ల నుంచి అనేకమంది బ్యూరోక్రాట్ల మాదిరిగా, పోస్టింగుల కోసం పాలకుల పాదాక్రాంతం కాకుండా, వేధింపులు తట్టుకుని… నిటారున నిలబడి న్యాయపోరాటం చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు అనే అధికారి ఆత్మస్థైర్యం, అలాంటి మానసిక వేదన స్థాయి దాటిపోయినట్లే కనిపిస్తోంది.

LEAVE A RESPONSE