Suryaa.co.in

National

జమిలికి జై

– ‘ఒక దేశం ఒక ఎన్నికల’ బిల్లుకు ఆమోదం
– దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
– 1967 తర్వాత మళ్లీ జమిలి ఎన్నికలు
– జమిలి జరిగిన వంద రోజులకు దేశంలో అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు
– ఆమోదించిన కేంద్రమంత్రి వర్గం
– జమిలిపై నెరవేరనున్న అద్వానీ స్వప్నం
– గురువు కోరికను తీర్చనున్న శిష్యుడు మోదీ

ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలు జరగాలన్న బీజేపీ భీష్మాచార్యుడు లాల్ కృష్ణ అద్వానీ కోరికను ఆయన శిష్యుడు ప్రధాని మోదీ నెరవేర్చనున్నారు. ఆ మేరకు దేశంలో పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. జమిలి జరిగిన వంద రోజుల తర్వాత.. దేశంలోని అన్ని స్థానిక సంస్థలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిని పార్లమెంటులో పెట్టనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గం ‘ఒక దేశం ఒక ఎన్నికల’ బిల్లుకు ఆమోదం తెలిపింది. శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.

అంతకుముందు ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’పై కోవింద్ కమిటీ నివేదికను సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019లో 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనను ప్రధాని మోదీ తొలిసారిగా ప్రతిపాదించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఈ బిల్లు లక్ష్యం. ప్రస్తుతం ఐదేళ్ల వ్యవధిలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలో దీనిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం వేర్వేరు సమయాల్లో ముగుస్తుంది. దానికగుణంగా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు వీటిలో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలు జరగగా, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోనే హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి.

ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా ప్రతిసారీ ఎన్నికలు నిర్వహించకుండా.. దేశం మొత్తం ఒకే సారి ఎన్నికలు నిర్వహించడమే ఈ బిల్లు ఉద్దేశం.

ఏకకాల ఎన్నికల సిఫార్సులను రెండు దశల్లో అమలు చేస్తామని కమిటీ తన నివేదికలో పేర్కొంది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. రెండవ దశలో పంచాయత్ మరియు మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు నిర్వహించబడతాయి. దీని కింద అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను సిద్ధం చేస్తారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా విస్తృత చర్చకు శ్రీకారం చుట్టనున్నారు. ఇంప్లిమెంటేషన్ గ్రూప్ కూడా ఏర్పడుతుంది.

కోవింద్ కమిటీ సిఫార్సులు ఇవీ

1951 నుంచి 1967 మధ్య ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి

1999లో లా కమిషన్ 170వ నివేదిక ఐదేళ్లలోపు లోక్‌సభ, అన్ని శాసనసభలకు ఎన్నికలను సూచించింది.

2015లో పార్లమెంటరీ కమిటీ 79వ నివేదిక రెండు దశల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే మార్గాలను సూచించింది.

రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి కమిటీ రాజకీయ పార్టీలు, నిపుణులతో సహా వివిధ వాటాదారులతో విస్తృత సంప్రదింపులు జరిపింది.

దేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు విస్తృత మద్దతు లభిస్తున్నట్లు విస్తృతమైన అభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించింది.

నెరవేరనున్న అద్వానీ కల

నిజానికి దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు జరగాలని బీజేపీ భీష్మాచార్యుడు ఎల్‌కె అద్వానీ ఇరవై ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు. ప్రధానంగా వేసవిలో ఎన్నికలు జరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అద్వానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విడివిడిగా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన శిష్యుడు మోదీ గురువు అద్వానీ కల నెరవేర్చనున్నారన్నమాట.

LEAVE A RESPONSE