Suryaa.co.in

Editorial

ఏబీకి ఒక రూలు.. సునీల్‌కు మరో రూలా?

    • నాడు ఏబీని రెండుసార్లు సస్పెండ్ చేసిన జగన్ సర్కార్

    • పార్టీ కోసం బలైపోయిన ఏబీ

    • ఇప్పుడూ అవే కారణాలతో సునీల్‌ను ఎందుకు సస్పెండ్ చేయరు?

    • సునీల్‌పై సస్పెన్షన్‌కు భయమెందుకు?

    • ఆ వర్గం వారు దూరమవుతారన్న భయమా?

    • సస్పెన్షన్‌కు మోకాలడ్డుతున్నది ఎవరు?

    • ప్రభావతి కాంప్లెక్ కట్టడంపై ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోని గుంటూరు కమినషర్

    • గుంటూరు ప్రభావతిని పారిపోయేలా చేసిందెవరు?

    • పోలీసు, టీడీపీ వర్గాల్లో విస్మయం

    • క్యాడర్‌కు ఏం సంకేతాలిస్తున్నారంటూ సోషల్‌మీడియా సైనికుల కన్నెర్ర

( మార్తి సుబ్రహ్మణ్యం)

సీఐడీ మాజీ బాస్ సునీల్‌కు సంబంధించి ‘మంచి ప్రభుత్వం’ తీసుకున్న నిర్ణయంపై పోలీసు, టీడీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌పై విచారణకు.. ఎంక్వైయిరీ అథారిటీగా ఆర్పీ శిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్‌కుమార్ గుప్తాను ప్రెజెంటింగ్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇదే శిసోడియాను విచారణాధికారిగా నియమించిన విషయం తెలిసిందే.

సునీల్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై విచారణ జరపాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు లేఖ రాసిన చాలాకామయింది. మధ్య మధ్యలో తన కేసు ఏమైందని రాజు తరచూ ప్రశ్నించడంతో.. ఆయన కేసును గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీకి అప్పగించారు. ఆ తర్వాత నిందితులు ఆయనను లెక్కచేయకపోవడంతో కేసును ఒంగోలు ఎస్పీకి అప్పగించారు.

ఆ కేసుకు సంబంధించి ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే రాము సన్నిహితుడైన తులసిబాబును, అంతకుముందే రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిద్దరూ సబ్ జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా గుడివాడ నుంచి వచ్చిన తులసిబాబు అనుచరులు.. చంద్రబాబునాయుడు-తులసిబాబు ఫొటోలు, పార్టీ జెండాలతో భారీ సంఖ్యలో ఒంగోలు ఎస్పీ ఆఫీసుకు వచ్చి నానా హంగామా సృష్టించారు. అడ్డుకున్న పోలీసునుద్దేశించి గుడివాడ రండి చూసుకుందాం అని ర భస చేసిన వైనం, అటు పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

తర్వాత గుడివాడ ఎమ్మెల్యే రాము స్వయంగా కోర్టు వద్దకు వచ్చి, డిప్యూటీ స్పీకర్ రాజు గుండెలపై కూర్చున్నారనే ఆరోపణలు ఉన్న తులసిబాబును పరామర్శించారు. దీనిపై టీడీపీ సోషల్‌మీడియా సైనికులు శివమెత్తారు. ‘‘అసలు టీడీపీ ఎటు పోతోంది? మేనేజ్‌మెంట్ కోటా టికెట్లు ఇస్తే ఇంతే ఉంటుంది. రాజును హింసించిన నిందితుడికి పార్టీ ఎమ్మెల్యే వచ్చి మద్దతునిస్తే పార్టీ ఇంకా ఎందుకు మౌనంగా ఉంది? ఆ ఎమ్మెల్యేకు కనీసం షోకాజ్ నోటీసు ఇచ్చే ధైర్యం పార్టీకి లేదా? పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందా? ఉఃటే అది పనిచేస్తోందా? పార్టీ మౌనం క్యాడర్‌కు ఏం సందేశం పంపిస్తుంది? ఇందుకేనా మేం జగన్‌ను గద్దెదిగాలని ప్రాణాలు పణంగా పెట్టి, కేసులు ఎదుర్కొని పోరాటాలు చేసింది’’ అంటూ శివాలెత్తారు.

ఈ క్రమంలో తనను హతమార్చేందుకు ప్రయత్నించిన సునీల్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు.. ఆమేరకు ఆయన ఇచ్చిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా సునీల్‌పై విచారణ కమిటీ వేసింది. అయితే ఈ నిర్ణయంపై టీడీపీ, పోలీసు వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సస్పెండ్ చేయకుండా కేవలం విచారణ కమిటీ వేస్తే, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారన్న ముందుచూపు ప్రభుత్వానికి లేకపోవడంపై పోలీసువర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

సునీల్‌ను గత ఏడాది అక్టోబర్‌ను ప్రభుత్వం వివరణ కోరగా, ఆయన నవ
ంబరులో వాటికి సమాధానం ఇచ్చారు. అసలు అప్పుడే సస్పెండ్ చేయకుండా మంచి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింద ంటూ, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు విరుచుకుపడ్డారు. సునీల్‌ను సస్పెండ్ చేయకుండా అడ్డుపడుతున్న శక్తులెవరంటూ విమర్శల వర్షం కురిపించారు. జగన్ ప్రభుత్వం నాటి డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఒకే కారణంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, రెండుసార్లు సస్పెండ్ చేసిన వైనాన్ని సోషల్‌మీడియా సైనికులు గుర్తు చేశారు.

నిజానికి సునీల్‌పై క్రిమినల్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉన్నందున.. ఆయనను రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉందని, అటు పోలీసు వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును కూడా ఇలాగే రెండుసార్లు సస్పెండ్ చేసినప్పుడు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పార్టీ అగ్రనేతలను, చివరకు సోషల్‌మీడియా సైనికులను వేధించి అక్రమకేసులు పెట్టించిన సునీల్‌ను, ఇప్పటివరకూ సస్పెండ్ చేయకపోవడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

‘‘పార్టీకోసం పనిచేశారన్న కక్షతో జగన్ చర్యలకు బలైపోయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఒక రూలు. పార్టీ నేతలను వేధించిన సునీల్‌కు మరో రూలా? అంటే కులాలకు భయపడి రూల్సు మారుస్తారా? దీనివల్ల మనం క్యాడర్‌కు ఏం సందేశం పంపిస్తున్నాం’’ అని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. సునీల్‌ను సస్పెండ్ చేస్తే ఆయన సామాజికవర్గం, ఆ వర్గానికి చెందిన టీడీపీ నేతలు దూరమవుతారన్న భయంతోనే ప్రభుత్వం సునీల్‌పై చర్యలకు భయపడుతోందన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా కనిపిస్తోంది.

చివరకు ఆసుపత్రిలో రాజుపై తప్పుడు నివేదికలు ఇచ్చిన నాటి గుంటూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ ప్రభావతిని కూడా.. అరెస్టు చేయకుండా తప్పించుకునే చేశారంటూ, సోషల్‌మీడియా సైనికులు మండిపడుతున్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పుడే ప్రభావతిని అరెస్టు చేయాల్సిందని, అయితే పోలీసులు మీనమేషాల వల్ల ఆమె తప్పించుకుపోయిందన్న విమర్శలు టీడీపీ సోషల్‌మీడియా గ్రూపుల్లో వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు అమరావతి రోడ్‌లో ప్రభావతి నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ అక్రమ కట్టడమని మీడియా సాక్షాధారాలతో సహా ఘోషించినా, గుంటూరు మున్సిపల్ కమిషనర్ కూడా ప్రేక్షకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందా? కూటమి పాలన ఉందా అన్న అనుమానం వస్తోందని, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు పోస్టింగులు పెట్టిన విషయం తెలిసిందే.

గతంలో జగన్ ప్రభుత్వం తాను లక్ష్యంగా ఎంచుకున్న నాయకులను, ఎక్కడున్నా వెతికివెంటాడి పట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్న టీడీపీ సోషల్‌మీడియా సైనికులు.. ఆ పని ఇప్పుడు పోలీసులు ఎందుకు చేయలేకపోతున్నారు? మనది మంచి ప్రభుత్వం. ఎవరిపైనా కక్ష సాధించదు అన్న పేరు కోసం, పార్టీని వేధించిన నిందితులను వదిలేస్తే.. పార్టీ కోసం ప్రాణాలొడ్డి పనిచేసిన క్యాడర్‌కు ఏం సంకేతాలు ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సర్కారు తీరుపై రాజు అసంతృప్తి

కాగా తనను హతమార్చేందుకు ప్రయత్నించిన సీఐడీ మాజీ బాస్ సునీల్‌ను సస్పెండ్ చేయకుండా, ఆయనపై విచారణ కమిటీ వేయడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తన సహచరుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సునీల్‌ను సస్పెండ్ చేయాలని తాను ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని, తీరా ఇప్పుడు విచారణ కమిటీ వేశారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ‘‘సునీల్ ఇప్పుడు పోస్టింగు లేకపోయినా ఇంకా డీజీ హోదాలోనే ఉన్నారు. అంటే ఆయన సాక్షులను ప్రభావితం చేసే హోదాలోనే ఉన్నట్లు లెక్క. ఆయన ఆ హోదాలో ఉంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఎందుకు సాక్ష్యం చెబుతారు? అదే సస్పెండ్ చేస్తే సాక్షులు నిర్భయంగా ముందుకు వస్తారు కదా’’ అని పార్టీ సహచరులతో రాజు అసంతృప్తి వ్యక్తం చేసిన ట్లు సమాచారం.

‘‘డాక్టర్ ప్రభావతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తాను మొదటి నుంచి పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడామె పరారయిపోయింది. మరి ఇప్పుడు ఎవరి పరువు పోయింది’’ అని, వారి వద్ద ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధానంగా.. తనపై హత్యాయత్నం చేసిన నిందితుడు తులసిని, గుడివాడ ఎమ్మెల్యే రాము వెంటబెట్టుకుని వచ్చి, తులసికి జిందాబాదులు కొట్టినా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటంపై, రాజు తన సహచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘ఒకేపార్టీలో నిందితుడు-బాధితుడు ఉండటం ఏమిటి? తులసిని సస్పెండ్ చేసి, ఎమ్మెల్యే రామును మందలించకుండా వదిలేస్తే, రేపు వైసీపీ వాళ్లంతా పార్టీలో చేరి తులసిని ఫాలో అయితే క్యాడర్ ఏం ఫీలవుతుంద’’ని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు సమాచారం.

LEAVE A RESPONSE