Suryaa.co.in

Andhra Pradesh

ఇ-ఫామ్ మార్కెట్ ద్వారా రైతుల పంటకు నేరుగా పొలం నుండే ఆన్ లైన్ అమ్మకం

-దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

విజయవాడ : రైతులు పండించిన పంటను పొలం నుండే నేరుగా ఆన్ లైన్ విక్రయాలను నిర్వహించుకుని గిట్టుబాటు ధర పొందేందుకు ఇ-ఫామ్ మార్కెట్ విధానం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ఫుడ్ ప్రోససింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఇ-విక్రయ కార్పొరేషన్ లిమిటెట్ (ఏపిఎస్ఇవిసిఎల్) ఆధ్వర్యంలో నగరంలోని నోవాటెల్ హోటల్లో శనివారం ఫార్మర్ ప్రొడ్యూసర్ అర్గనైజేషన్స్, అగ్రిగేటర్స్, అగ్రిప్రొన్యూర్స్, బయ్యర్స్, బ్యాంకర్స్ తో నిర్వహించిన వర్క్ షాపుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ఫుడ్ ప్రోససింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మార్కెట్ సౌకర్యం ద్వారా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అని రకాల సహయ సహకారాలను అందిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం మూడు ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ
చూపుతున్నారన్నారు. ఇందులో భాగంగా రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం, పంటకాలంలో పెట్టుబడుల నిమిత్తం బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలను అందించడం, వ్యవసాయ యంత్రీకరణ, పనిముట్లను సబ్బిడీపై అందించడంతో పాటు పండించిన పంటకు ఇ-ఫామ్ మార్కెట్ విధానం ద్వారా పంటపొలం నుండే నేరుగా విక్రయించేకునేలా చర్యలు తీసుకున్నారన్నారు.ఇ-ఫామ్ మార్కెట్ విధానం అమలు చేయడం వలన రైతులకు కొనుగోలు దారులకు మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించాలన్నదే ప్రభుత్వ విధానం అన్నారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మరో వైపు వినియోగదారులకు మంచి ధర అందుబాటులోకి తీసుకురావడానికి ఇ-ఫామ్ మార్కెట్ దోహదపడుతుందన్నారు.

ఇప్పటివరకు 17.06 కోట్ల రూపాయల రైతుల పంటలను ఇ-ఫామ్ మార్కెట్ విధానం ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. రైతు తాను పండించిన పంటను మన రాష్ట్రంలోనే కాక గిట్టుబాటు ధర లభించిన ఏ రాష్ట్రంలోనైనా విక్రయించుకునేందుకు ఇ-ఫామ్ మార్కెట్ అన్లైన్ విధానం వేదికగా నిలుస్తుందన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఇ-ఫామ్ మార్కెట్ విధానాన్ని రైతులు వినియోగించుకుని గిట్టుబాటు ధర పొందాలని మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి అన్నారు.

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ… ఇ-ఫామ్ మార్కెట్ రైతులు కొనుగోలుదారులు వ్యాపారులు మధ్య అనుసందానంగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాట్ఫామ్ రైతులను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులను కల్పడం ద్వారా అవాంతరం లేని పారదర్శకమైన వ్యాపారానికి వీలు కల్పిస్తుందన్నారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులకు ఇ-ఫామ్ మార్కెట్ సులభతరం చేస్తుందన్నారు.

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మస్ ఇ-విక్రయ కార్పొరేషన్ లిమిటెట్ చైర్మన్ పిఎస్ పద్యుమ్న మాట్లాడుతూ రైతులకు కొనుగోలుదారులకు మధ్య ఇ-ఫామ్ మార్కెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటను ఇ-ఫామ్ మార్కెట్ ద్వారా గిట్టుబాటు ధరకు విక్రయించుకోవచ్చునన్నారు. పంటను కొనుగోలు చేసిన వారు అదే రోజు రైతుకు చెల్లించాల్సిన సొమ్మును ఇ-ఫామ్ మార్కెట్ కి జమ చేయడం జరుగుతుందని అనంతరం ఇ-ఫామ్ మార్కెట్ నుండి రైతుల ఖాతాలోకి జమ చేసేలా లావాదేవీలు నిర్వహించడం వలన పారదర్శకమైన క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుందన్నారు. ఇ-ఫామ్ మార్కెట్ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకున్న వారు ఇ-ఫామ్ మార్కెట్ లో వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ అర్గనైజేషన్స్, అగ్రిగేటర్స్, అగ్రిప్రొన్యూర్స్, బయ్యర్స్ మరియు బ్యాంకర్స్ ఇ-ఫామ్ మార్కెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. వర్క్ షాపులో ప్రభుత్వ వ్యవసాయ సలహదారు అంబటి కృష్ణారెడ్డి, మార్కెటింగ్ సలహదారు బత్తుల బ్రహ్మనందరెడ్డి, మార్కెటింగ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ యం ఝన్సీరాణి, మార్కెటింగ్ డైరెక్టర్ డా.ఆర్ శ్రీనార్రెడ్డి, ఉద్యానశాఖ కమీషనర్ డా. ఎస్ఎస్ శ్రీధర్, యునియన్ బ్యాంక్ సిజియం కన్వీనర్ వి బ్రహ్మనందరెడ్డి, ఏపిఎస్ఇవిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, రైతు బజార్ల సిఇవో బి శ్రీనివాసరావు, రైతులు, ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు, వివిధ బ్యాంక్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE