Suryaa.co.in

Andhra Pradesh

ప్లీనరీ జరిపింది జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికేనా?

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

రెండు రోజులపాటు జరిగిన వైఎస్ఆర్సిపి ప్లీనరీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడానికి సరిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు.

వైఎస్ఆర్సిపి ప్లీనరీ జరుపుకోవటం సంతోషకరమే. కాని ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి తనని తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లున్నది. ఇంకా నయం ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకోలేదు. పైగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 సంస్థలపై దుమెత్తిపోవడం దుర్మార్గం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే పత్రిక, మీడియా సంస్థలను తిట్టడం, బెదిరించడం ఇకనైనా మానుకోవాలి.

రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి అటకెక్కింది. ఏపీ అప్పులు 8 లక్షల కోట్లకి చేరాయి. కేవలం లక్షా 60 వేల కోట్లు ప్రజా సంక్షేమానికి వెచ్చించామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. మిగిలిన అప్పు 4 లక్షల కోట్లతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వెల్లడించాలి. 31 మంది వైసీపీ ఎంపీలున్నా కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా హామీ ఏమైంది? ఏపీలో కొత్తగా ఒక్క పరిశ్రమనైనా రాబట్టారా? కేంద్రం చేసే ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మద్దతు ఇవ్వడం తప్ప, కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా మేలు చేకూర్చగలిగారా? రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం ఏపీకి చేసిన ద్రోహాలపై ప్లీనరీలో కనీస చర్చ జరిపారా? అని ప్రశ్నిస్తున్నాం. మొత్తం వైఎస్ఆర్సిపి ప్లీనరీ అంతా జగన్మోహన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తుకోవడానికి, తను తాను వైసీపీకి శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకోవటానికే తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.

LEAVE A RESPONSE