Suryaa.co.in

National Telangana

ధూమ్‌ ధామ్‌గా దిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీసు ప్రారంభం

– హస్తినలో బీఆర్‌ఎస్‌ సందడి
– దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. మొదట బిఆర్ఎస్ భవన్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్ ఆ తర్వాత వైదిక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం 1 గంట. 5 నిమిషాలకు రిబ్బన్‌ కట్‌ చేసి బిఆర్ఎస్ భవన్ ను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ చధుని తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ భవన ప్రారంభోత్సవం అనంతరం మొదటి అంతస్తులోని పార్టీ అధ్యక్ష కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని వసంత్‌విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించే సమయంలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెంట శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీ రామారావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోతోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ భవన్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె. చంద్రశేఖర్ రావు కి స్వాగతం పలుకుతూ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ ఆవరణలో యాగం, స్తోత్ర పారాయణాలతో శుభకరమైన వాతావరణం నెలకొంది.

ఉదయం నుంచే కార్యాలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బారులు తీరారు. దీంతో బిఆర్ఎస్ భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని, పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర తెలంగాణ పోలీసులతో పాటు, ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వసంత విహార్ మెట్రో స్టేషన్ నుండి బిఆర్ఎస్ భవన్ వరకు భద్రత కట్టుదిట్టం చేయబడింది. సాధారణ వాహనాల రాకపోకలు కాసేపు నిలువరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది.

వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా బిఆర్ఎస్ భవన్ కార్యాలయం రూపుదిద్దుకున్నది. బిఆర్ఎస్ మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుని కార్యాలయం ఉంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిండెంట్ లకు ప్రత్యేక ఛాంబర్లు కేటాయించడం జరిగింది. వీటితో ఇతర అవసరాల కోసం మొత్తం పద్దెనిమిది గదులు భవన్ లో ఉన్నాయి. పార్టీ సమావేశాల కోసం భవన్ లో విశాలమైన సమావేశ మందిరాన్ని కేటాయించారు. దేశ రాజధాని కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కావడంతో పార్టీ విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి.

LEAVE A RESPONSE