Suryaa.co.in

Andhra Pradesh

ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రీడాప్ర‌తిభ‌కు అవ‌కాశాలు

– హోంమంత్రి తానేటి వనిత

క్రీడాకారుల్లో దాగియున్న ప్ర‌తిభ‌ను వెలికితీసి జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేంకు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఈ క్రీడా పోటీలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో డిసెంబ‌ర్ 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేది వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ఉన్న క్రీడా ప్ర‌తిభ‌ను వెలికితీసి అంత‌ర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్ర‌భుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. యువత అంతా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని, శరీర ధృడత్వం పెంచుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల జీవనశైలి లో మార్పులు వస్తాయన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా మైదానాల్లో క్రికెట్‌, వాలీబీల్‌, క‌బ‌డ్డీ, ఖోఖో, బ్యాడ్మింట‌న్ వంటి ప్ర‌ముఖ క్రీడ‌ల‌తో పాటు స్థానిక ప్రాధాన్య‌మున్న క్రీడల‌కు సంబంధించిన పోటీలు జరుగుతాయన్నారు.

15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. అధిక సంఖ్య‌లో క్రీడాకారులు పాల్గొని త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించేందుకు క్రీడాకారుల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌న్నారు. ప్ర‌తి గ్రామం నుంచి ఏదో ఒక క్రీడ‌లో క్రీడాకారులు త‌ప్ప‌నిస‌రిగా పోటీలో పాల్గొనెలా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులు 1902 నంబ‌ర్‌కు కాల్‌చేసి లేదా త‌మ సమీపంలోని స‌చివాల‌యం నందు రిజిస్ట్రేష‌న్ చేసుకుని పాల్గొనవచ్చని తెలిపారు.

క్రీడాపోటీల‌ను విజ‌య‌వంతం చేయ‌డంతో పాటు ఆడుదాం ఆంధ్రాలో కొవ్వూరు నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకొచ్చేవిధంగా క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని కొవ్వూరు ఎమ్మెల్యేగా ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ బాగా ఆడి.. తమ సత్తాను చాటి చెప్పాలని, ధైర్యంగా ఆడి విజేతలు కావాలని రాష్ట్ర యువత అంతటికీ హోంమంత్రి తానేటి వనిత ‘ఆల్ ది బెస్ట్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE