Suryaa.co.in

Political News

‘అతి’పక్షంగా మారిన ప్రతిపక్ష బిఆర్ఎస్!

తెలంగాణాలో కీలక రాజకీయ పార్టీల పాత్రలు మారి ఏడాది పూర్తి అయింది. కాంగ్రెస్ అధికార పార్టీగా మారితే..బిఆర్ఎస్ ప్రతిపక్షం అయింది. విచిత్రం ఏమిటి అంటే అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా కూడా బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాత్రం ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి అనే డిమాండ్ అధికార పార్టీ నుంచి పదే పదే రావటం కూడా, తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిణామంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణలో దగ్గర దగ్గర పదేళ్ల పాటు అధికారం చెలాయించిన బిఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలో వచ్చేటప్పటికి అసలు రంగు చూపించటం మొదలు పెట్టింది. అధికారంలో ఉన్నంత కాలం ప్రజలు మాకు ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చారు. మేము చెప్పిన హామీలు ఐదేళ్లలో ఎప్పుడో ఒక సారి అమలు చేస్తాం అంటూ అసెంబ్లీ వేదికగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు మార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాము ప్రజలకు తప్ప ప్రతిపక్షానికి జవాబుదారీ కాదని, అధికారంలో ఉన్నప్పుడు అంతా తమ ఇష్టం అన్నట్లు వ్యవహరించారు. కానీ ఓటమి పాలు అయిన తర్వాత కొద్ది నెలలు కూడా ఆగకుండానే, కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి మొదలు పెట్టారు. ప్రతిపక్షం ప్రభుత్వం చేసే తప్పుల గురించి మాట్లాడం…ప్రజల పక్షాన నిలబడటం తప్పేమి కాదు. కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో లేదో బిఆర్ఎస్ నాయకులు వరస పెట్టి, ఈ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని ఒకరు…ఏడాది కూడా ఉండదు అని మరికొంత మంది ప్రకటనలు చేశారు.

ఇందులో తర్వాత కాలంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన కడియం శ్రీహరి కూడా ఉన్నారు. బిఆర్ఎస్ నేతల ప్రకటనలో…లేక ఇతర కారణం తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మోడల్ ను ఫాలో అయి, ఆ పార్టీ లో గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ఏ ప్రతిపక్ష పార్టీ ని లెక్క చేయని బిఆర్ఎస్ …ఓటమి పాలు అయిన తర్వాత మాత్రం ప్రభుత్వం అంతా, తాము చెప్పినట్లు చేయాలన్నట్లు వ్యవహరిస్తోంది.

హైడ్రా ..మూసి పునర్జీవ ప్రాజెక్ట్, పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసినా సరే బిఆర్ఎస్ ఒప్పుకోదు అన్నట్లు వ్యవహరించటం మొదలు పెట్టారు. ఇది చూసిన వాళ్ళు అంతా కూడా.. ప్రతిపక్షం కాస్తా అతి పక్షంగా మారింది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. బిఆర్ఎస్ చెపుతున్నట్లు నిజంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరస తప్పులు చేసుకుంటూ పోతే, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకే మళ్ళీ అధికారం వస్తుంది.

అలా కాకుండా ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శించటం…అడ్డుకోవటం చేస్తుంటే అది బిఆర్ఎస్ కు రాజకీయంగా మరింత నష్టం చేయటం ఖాయం. అధికార పార్టీ అయినా…ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటేనే, రాజకీయగా లబ్ధి పొందుతారు. అలా కాకుండా అధికారం పోయింది అనే కసితో వ్యవహరిస్తే, అది అంతిమంగా అలా చేసినా వాళ్ళకే నష్టం చేస్తుంది అనటంలో సందేహం లేదు.

ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు లు వ్యవహరిస్తున్న తీరు.. తమ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో బలవంతంగా లాక్కున్నది అన్నట్లు ఉంది తప్ప..ప్రజలు వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.

ఐదేళ్ల పాటు ఎంత రచ్చ చేసినా కూడా తిరిగి అధికారంలోకి రాలేం అనే విషయాన్ని గ్రహించకుండా, బిఆర్ఎస్ నేతలు తొందరపడి అతిగా చేస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా అతిపక్షంగా వ్యవహరిస్తున్న ఈ ప్రతిపక్షం దారి మార్చుకుంటుందో లేదో చూడాలి.

వాసిరెడ్డి శ్రీనివాస్,
సీనియర్ జర్నలిస్టు

 

LEAVE A RESPONSE