Suryaa.co.in

Telangana

రైతుల జీవితాల‌తోనూ విప‌క్షాల రాజ‌కీయాలా?

-మామూలు ధాన్యం ధ‌ర‌కే త‌డిసిన ధాన్యాన్ని కొంటాం
-మాట ఇచ్చిన మ‌న సీఎం మ‌న‌సున్న మ‌హారాజు
-రైతులు ధైర్యంగా ఉండాలి
-వ‌ర్షాలు ఆగిన త‌ర్వాతే పంట న‌ష్టాల అంచ‌నాలు
-రైతుల‌ను రెచ్చ‌గొడుతున్న ప్ర‌తిప‌క్షాలు… వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు?
-మీడియాతో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వ‌రంగ‌ల్, మే 3ః ఆకాల వ‌ర్షాలు రైతాంగాన్ని ఆపార న‌ష్టాల్లోకి నెడుతున్నాయి. మొన్న‌టి దాకా పంట న‌ష్టాలు, ఇప్పుడు వాటితోపాటు ధాన్యం త‌డిసి మోపెడు అవుతున్న‌ది. అందుకే మ‌నసున్న మ‌న సీఎం కెసిఆర్ గారు త‌డిసిన ధాన్యాన్ని మామూలు ధ‌ర‌కే కొంటామ‌ని ప్ర‌క‌టించార‌ని, రైతులు ధైర్యంగా ఉండాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అయితే, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయ‌ని, కానీ వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో, దేశంలో ఎక్క‌డైనా స‌రే, ఈ విధంగా చేస్తున్నారా? రైతుల‌ను ఆదుకుంటున్నారా? ఇక్క‌డ మాత్రం రైతుల‌ను ఎందుకు రెచ్చ‌గొడుతున్నారు? రైతులు ప్ర‌తిప‌క్షాల కుటిల నీతిని గుర్తించాల‌ని, సంయ‌మ‌నం పాటించాల‌ని ఆయ‌న కోరారు. బుధ‌వారం హ‌న్మ‌కొండ‌లోని అతిథి గృహంలో మంత్రిని కొంద‌రు మీడియా వ్య‌క్తులు ఆకాల వ‌ర్షాలు, పంట‌ల న‌ష్టాల‌పై ప్ర‌శ్నించ‌గా, మంత్రి ఈ విధంగా స్పందించారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల పంట‌ల‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్ర‌మే. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతుల పంటల న‌ష్టాల‌కు ఎక‌రాకు రూ.10వేలు ప్ర‌క‌టించింది. కౌలు రైతుల‌కు కూడా న‌ష్టాల ప‌రిహారం అందేలాచేస్తున్న‌ది. ఇంత‌గా చేస్తున్న ప్ర‌భుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేద‌ని మంత్రి అన్నారు.

అయితే ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఈ స‌మ‌యంలో అకాల వ‌ర్షాలు ధాన్యాన్ని న‌ష్ట ప‌రిచాయ‌న్నారు. ఈ ద‌శ‌లోనూ మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు గారు త‌డిసిన ధాన్యాన్ని కూడా మామూలు ధాన్యం ధ‌ర‌కే కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆయ‌న విశాల హృద‌యానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అయితే, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్న ప్ర‌తిప‌క్షాలు లేనిపోని డిమాండ్లు పెట్టి, రైతుల‌ను ఆగం ప‌ట్టిస్తున్నాయ‌ని అన్నారు.

వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ త‌హార రైతుల‌కు ప్రోత్సాహ‌కాలు, ప‌రిహారాలు ఇచ్చి మాట్లాడాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి డిమాండ్ చేశారు. రైతులు ఓపిక‌గా ఉండి, ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేసే వర‌కు ఆగాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు

LEAVE A RESPONSE