– దర్యాప్తు వేగవంతానికి రైల్వే ఎస్పీకి లేఖ
అమరావతి: గురజాల రైల్వే హాల్ట్ లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసేందుకు కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వేపోలీసులను ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి కమిషన్ తరఫున లేఖను పంపారు.
కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసుశాఖాపరంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు.
సభ్యసమాజం సిగ్గుపడాల్సిన ఇటువంటి సంఘటనలను ప్రతీ ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. బాధితురాలు ఆరోగ్యం కుదుటపడి స్వస్థలానికి వెళ్లేవరకు ఆమెను, తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను స్థానిక మహిళా శిశుసంక్షేమశాఖ చూసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.