-రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారు
-30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించాలని కన్సెషన్ అగ్రిమెంట్లో ఉంది
-కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా తేల్చాలి
-బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు
-రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. “రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు తెగనమ్మారు. ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైంది. ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహరంలో కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీ పాల్పడింది. ఇందులో కేసీఆర్, కేటీఆర్ లబ్దిదారులైతే.. సూత్రాధారులు, పాత్రధారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. గతంలో ఇదే అంశంపై..టెండర్ దక్కిన సంస్థకు అనుకూలంగా నిబంధనలు మార్చడం, బేస్ ప్రైస్ లేకుండా టెండర్లను పిలవడం, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుంది ఈ నేపథ్యంలో 30 ఏళ్లకు లీజుకు ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి అంత సుదీర్ఘ కాలం కాకుండా టెండర్ వ్యవధి ఉండాలని, అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెడంర్ అయిన 15 – 20 ఏళ్లకు మించి ఇవ్వలేదు అని ఎన్ హెచ్ఏఐ సూచించిన పట్టించుకోకుండా టెండర్ ప్రక్రియను చేపట్టిన విధానాన్ని ప్రస్తావించాను.
నాకున్న సమాచారం మేరకు టెండర్ దక్కించుకున్న సంస్థ టెండర్ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లోగా, మిగతా 90 శాతాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి నిబంధనలు లేవని బీఆరెస్ ఎమ్మెల్యేలు నిన్న మీడియా సమావేశంలో బుకాయించారు.
కానీ డబ్బు చెల్లింపుకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయి. “అగ్రిమెంట్ లోని 20, 21 పేజీలో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేను చెప్పింది 10 శాతమే.. కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలి. మిగతా 75 శాతాన్ని 120 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. ఆ మార్చిన నిబంధనలు ఏమిటో బయటపెట్టాలి. ఈ రోజు నేను బయట పెట్టిన కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించి ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ రోజుతో 30 రోజుల గడువు ముగిసింది. అయితే రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి IRB సంస్థ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ఐఆర్బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. ఒక వేళ చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు IRB సంస్థ టెండర్ ను రద్దు చేయాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలి..ఆయన విదేశీ పర్యటనలో బీజీగా ఉంటే అరవింద్ కుమార్ స్పందించాలి. దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్ పై ఉంది. ఇందుతో ఏమీ తేడా జరిగిన అరవింద్ కుమార్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఒక వేళ టెండర్ నిబంధనలు మారిస్తే ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం తరహా స్కాం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించినప్పుడు మొదట్లో నిబంధనలు కఠినతరంగా ఉంటే..బీఆర్ఎస్ నాయకురాలు కవిత వెళ్లి లాబీయింగ్ చేసి సౌత్ గ్రూపునకు అనుకూలంగా నిబంధనలు మార్చేలా చేశారు. ఆ వ్యవహారంలో 100 కోట్ల రూపాయాలను లంచంగా ఇచ్చారు అనేది ప్రధాన అభియోగం. దాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అరెస్ట్ లు చేసింది.
ఓఆర్ఆర్ అంతకంటే పెద్ద స్కాం. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను రూ. 7 వేల కోట్లకే అప్పగించారు. దీని మీద బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సీఎం కేజ్రీవాల్ తు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు.
అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని.. అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని….ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదు అని నిలదీశారు.
కిషన్ రెడ్డి మొన్న 2 లక్షల కోట్ల ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందన్నారు. మరీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి విచారణకు ఆదేశమివ్వని కిషన్ రెడ్డి ఎందుకు కోరడం లేదు దీని వెనక గూడుపుఠానీ ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రఘునందన్ ఓఆర్ఆర్ టెండర్ పై సీబీఐ కి పిర్యాదు చేశారు. సొంత ఎమ్మెల్యే ఫిర్యాదును బండి, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా లేదా స్పష్టం చేయాలి. అని రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారాన్ని అంత తొందరగా వదిలిపెట్టబోమని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలు
బీఆర్ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు, కర్ణాటక ఇంచార్జిగా ఉండి ఇప్పుడు మధ్యప్రదేశ్ కు ఇంచార్జిగా ఉన్న నాయకుడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.
“తెలంగాణలో బీజేపీది మూడో స్థానమే అని వాళ్ల జాతీయ నాయకులే చెబుతున్నారు. గట్టి నాయకులు 40 మంది లేకుండా ఎలా గెలుస్తామని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ను గెలవకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని…ఈ ప్రక్రియలో బీఆరెస్ గెలుస్తుందని స్పష్టంగా చెప్పారు. మేం ముందు నుంచి చెబుతున్నట్లు బీజేపీ, బీఆరెస్ ఒక్కటే…కేసీఆర్, మోదీ అవిభక్త కవలలు. కర్ణాటకలో ఇదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ నాటకామామడి జేడీఎస్ గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలని చూశారు. కానీ అక్కడి ప్రజలు తిరస్కరించారు. అక్కడ బీజేపీ పోషించిన పాత్రను ఇక్కడ బీఆర్ఎస్, జేడీఎస్ పాత్రను బీజేపీ పోషిస్తుంది. ఇప్పటికైనా ప్రజులు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఓడించేది కాంగ్రెస్ పార్టీ మాత్రేమే” అని రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉంది. కొందరు ఆవేశంలో బీజేపీలో చేరారు.. ఆ తరువాత అసలు సంగతి తెలుసుకున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది. బీఆరెస్ ను ఓడించడం కాంగ్రెస్ తోనే సాధ్యం. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని నేను అందుకే చెప్పా.. ఇప్పటికైనా భ్రమలు వీడి బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరవుతున్న నేతలు కలిసి రావాలి. ఆలోచన చేసి మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకోండి అని రేవంత్ వ్యాఖ్యానించారు.
“ అదే సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని నేను ప్రశ్నిస్తున్నా…మీ ప్రచారంతో మైనార్టీలు బీఆఱ్ఎస్ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. గెలిచిన తర్వాత బీఆరెస్ ఆ మైనారిటీ ఓట్లను మోదీకి తాకట్టు పెడుతుంది. దీన్ని మీరు ఎలా సమర్దించుకుంటారు? ఇప్పటికైనా ఈ విషయాన్ని మీకు విషయం అర్ధమైందా? అర్థం కాకపోతే అర్ధం చేసుకోండి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఏ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించారు?
ఏ హామీలు అమలు చేశారని, ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని హరీష్ తమ పాలనను సమర్దించుకుంటారు అని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినందుకు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కాకుండా నివారించినందుకు, ఉద్యోగాలు భర్తీ చేయనందుకు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయనందుకా ఏ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తాను స్వాతిముత్యం.. మామ ఆణిముత్యం అని అనుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. అన్ని మంచిగా చేస్తే సెక్యూరిటీ లేకుండా హరీష్, కేటీఆర్ ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలి. క్షేమంగా తిరిగివస్తే వాళ్లు చెప్పింది నిజమని ఒప్పుకుంటాం. తెలంగాణ ఏర్పడినప్పుడు మొదటి శాసనసభలో కేసీఆర్ 1.7లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి మరో 40-50 వేల ఖాళీలుగా యాడ్ అవుతాయని చెప్పారు.
తెలంగాణలో నెలకు సగటున వేయి మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. ఆలెక్కన చూస్తే 110 నెలల్లో లక్ష 10 వేల మంది పదవీ విరమణ చేశారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గవర్నర్ ఇచ్చిన నివేదికలో 37 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే బిశ్వాల్ కమిటీ పేర్కొన్న విధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటాయి. హరీష్.. పొడుగు ఉంటే సరిపోదు.. మెదడు కూడా ఉండాలి… అది మోకాళ్ళలోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదు అని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.