• పర్యావరణ హిత పెట్టుబడులకు పెద్దపీట..
• వచ్చే ఏడాది కల్లా దేశంలోనే టూరిజంలో మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..
• లేపాక్షి గ్రామానికి కేంద్ర ప్రభుత్వ టూరిజం అవార్డు అందుకోవటం అభినందనీయం
• రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు
– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా
విజయవాడ : మన నేచర్ మన టూరిజానికి ప్యూచర్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖా మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం-2023 సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో ప్రపంచ పర్యాటక దినోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే పర్యాటక రంగాభివృద్ధికి విశేష కృషి చేసిన వివిధ వ్యక్తులు, సంస్థలకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ ను మంత్రి రోజా అవార్డు గ్రహీతలకు అందచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా హజరైన మంత్రి రోజా మాట్లాడుతూ టూరిజం అండ్ పర్యావరణ హితమైన ఇన్వెస్ట్మెంట్స్ అనే థీమ్ తో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లేపాక్షి గ్రామం 2023లో భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామం లో ఒకటిగా సిల్వర్ కేటగిరీలో ఎంపిక కావటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. గతేడాది మన రాష్ట్రం పర్యాటక ర్యాంకింగ్ లో మూడవ స్థానం సాధించటం అభినందనీయమన్నారు. మచ్చే ఏడాది మొదటి స్థానం సాధించటానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మంత్రి పేర్కోన్నారు.
పర్యాటక రంగంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా పెట్టుబడులను, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో పర్యాటక శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి రోజా తెలిపారు.
మన రాష్ట్రానికి ఘనమైన చరిత్ర, ప్రశాంతమైన బీచ్ లు, వన్యప్రాణుల అభయారణ్యాలు, హిల్ స్టేషన్లు, చారిత్రాత్మక ప్రదేశాలు కలిగియున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక పరంగా ఆణిముత్యమని మంత్రి రోజా అన్నారు. బంగాళాఖాతం వెంబడి 972 కిలోమీటర్ల సముద్రతీరాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో వైజాగ్ మరియు రుషికొండ వంటి బీచ్ లతో పాటు ఎన్నో పర్యాటక బీచ్ లు ఉన్నాయి, ఇక్కడ ప్రకృతి సౌందర్యం, సీ ఫుడ్స్, నీటి క్రీడా కార్యకలాపాలు పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటున్నాయన్నారు.
కొత్త టూరిజం పాలసీ 2020-25 లో భాగంగా ఇన్వెస్టర్లకు మార్గనిర్దేశం చేయటానికి ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్ (ఐఎఫ్ సి) ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మక ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వంటి పెట్టుబడిదారులు ముందుకు వచ్చి మన రాష్ట్రంలో ఐదు ప్రదేశాల్లో 7-స్టార్ హోటల్ సదుపాయాలతో లగ్జరీ హోటల్స్ ను ఏర్పాటు చేయటం సంతోషమన్నారు. ఇటీవలే గండికోట, విశాఖపట్నం, తిరుపతి లో మూడు చోట్ల సీఎం . వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయటం జరిగిందన్నారు.
ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ద్వారా 117 టూరిజం ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు రూ. 19,514.86 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయని, దీంతో 50,133 మందికి ఉపాధి కల్పన జరిగనుందని మంత్రి రోజా వివరించారు. ఏపీటీడీసీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 163.25 కోట్ల అధిక టర్నోవర్ సాధించిందని, ఇది గతేడాది తో పోలిస్తే 10.82 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని తెలిపారు.
దేవాదాయ శాఖ, టిటిడీల సమన్యవయంతో రాష్ట్రంలో టెంపుల్ టూరిజంకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. బ్రాండింగ్ ను ప్రోత్సహించటానికి విజిబిలిటీని పెంచటానికి ఉపాధి అవకాశాలను సృష్టించటానికి అమృత్ కియోస్క్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించటం జరిగిందన్నారు. అలాగే స్వదేశ్ దర్శన్ పథకం లో భాగంగా గండికోట, అరకు-లంబసింగి తదితర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు.
రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం టెంపుల్ టౌన్ లను ప్రశాద్ పథకం కింద అభివృద్ధి కి ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. అలాగే రోప్ వేస్, సీప్లేన్, వెల్ నెస్ రిసార్ట్స్ వంటి పలు ప్రాజెక్ట్ లను పీపీపీ పద్దతిలో చేపట్టెందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ కోసం టూర్స్, ట్రావెల్స్, హోటల్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగంలోని భాగస్వాములందరితో “ఏపీ టూరిజం ఫోరం” ను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి చెప్పారు.
అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరంను సంస్థాగతం చేయాలని ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని కేవలం పర్యాటక కేంద్రంగా కాకుండా, మన పర్యావరణానికి, మన సమాజానికి మరియు మన దేశానికి ప్రయోజనం చేకూర్చే బాధ్యతాయుతమైన పర్యాటకానికి చిహ్నంగా మార్చటానికి అందరి సహకారం అవసరమని మంత్రి రోజా కోరారు.
రాష్ట్ర ప్రణాళికాసంఘ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ దేశంలోనే టూరిజానికి మన రాష్ట్రం కేంద్రబిందువుగా ఉండటానికి అందరూ కృషి చేయాలన్నారు. మన రాష్ట్ర నైసర్గిక స్వరూపం మనకు వరమన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధించటంతో పాటు ఉద్యోగ కల్పనకు మార్గం సుగమం అవుతుందన్నారు. టూరిజం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజిత్ భార్గవ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ పర్యాటక విధానంగా మన రాష్ట్రం పర్యాటక పాలసీని రూపొందించటంతో పాటు భూమి కేటాయింపులు, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ మెంట్, విద్యుత్ ఖర్చు రీయింబర్స్ మెంట్ వంటి ప్రోత్సహకాలను అందిస్తున్నామన్నారు.
రాష్ట్ర టూరిజం ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. కన్నబాబు మాట్లాడుతూ ఇప్పటికే ప్రతి పది మందిలో ఒకరు టూరిజంపై ఆధారపడి జీవినం సాగిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇది ఉద్యోగ కల్పనకు అధిక అవకాశాలు కల్పించబడతాయన్నారు. ఇన్వెస్టర్లను ప్రోత్సహించే విధంగా రాష్ట్రం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ముందుగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్, టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పద్మావతి, ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి. స్వామి తదితరులు పాల్గొన్నారు.