Suryaa.co.in

Telangana

మన్మోహన్ సింగ్ ని దేశ రాజకీయాలకు పరిచయం చేసింది మన పీవీ

– శాసనసభలో మాజీ మంత్రి హరీశ్ రావు

హైద‌రాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కి సంతాపం తెలిపేందుకు సభా నాయకులు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నం. వారు పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేశారు. ఈరోజు మన పెద్దల సభ శాసనమండలిలో కూడా వారికి నివాళులర్పిస్తే మరింత బాగుండేది. ఎందుకు మండలిలో పెట్టలేదని చాలా మంది అడుగుతున్నారు.

మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోయినా, వారి సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయి. సామాన్య కుటుంబంలో పుట్టి, వీధి దీపాల మధ్య, లాంతర్లు పెట్టుకొని, స్కాలర్ షిప్ మీద ఆధారపడి చదువుకొని అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. ఆర్థిక శాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా, దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే, వారి క్రమశిక్షణ గలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనే పట్టుదలే కారణం.

విదేశాల్లో కూడా వారికెన్నో గొప్ప అవకాశాలొచ్చాయి. విదేశాల్లో పెద్ద ఉద్యోగాలను తిరస్కరించి, ఈ దేశం నాకు ముఖ్యం అని మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు వారు. వారేనాడూ పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు, పదవులే ఆయన దగ్గరకు వచ్చాయి.

యూజీసీ చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థికశాఖ ముఖ్య సలహా దారుగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ కమిషన్ సభ్యుడిగా,దేశ ఆర్థిక మంత్రిగా,ప్రధానిగా ఎన్నో గొప్ప పదవుల్ని అంకితభావంతో నిర్వహించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ . మన్మోహన్ సింగ్ ని దేశ రాజకీయాలకు పరిచయం చేసింది మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావు .

పీవీ తన కేబినెట్లో మన్మోహన్ సింగ్ ని ఆర్థికశాఖ మంత్రిగా తీసుకున్నారు. పీవీ ఏ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థికరంగానికి తనదైన శైలిలో దశ దిశను చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. పారిశ్రామిక విధానాలను మార్చి పీవీ గొప్ప పేరు తెచ్చుకుంటే, ఆర్థిక విధానాలను సవరించి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు.

దేశాన్ని దివాళా పరిస్థితుల నుంచి గట్టెక్కించిన పీవీ కి మన్మోహన్ సింగ్ ఒక చోదకశక్తిగా పనిచేశారు. మన్మోహన్ మిక్స్ అనే స్థాయికి దేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేశారు. మన్మోహన్ సింగ్ మచ్చలేని నాయకుడు, అత్యంత ఉన్నతంగా సాధాసీదా జీవితం గడిపిన మహనీయులు. యూపీఏ -2లో చాలా కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

అయినా మన్మోహన్ సింగ్ కి ఒక చిన్న మచ్చకూడా రాలేదంటే వారి గొప్పతనమే. అకడమిషియన్ గా, అడ్మినిస్ట్రేటర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ దేశంపై తనదైన ముద్ర వేశారు. ఆర్బీఐ గవర్నర్ గా కరెన్సీ నోట్లపై సంతకం చేసిన మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశంపై చెరగని సంతకం చేశారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఆయన జీవితం దేశ సేవలో ధన్యమైంది.

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణ మద్దతిస్తుంది. మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడానికి మేం మద్దతు పలుకుతున్నం. కారణాలేమోగానీ పీవీ మరణించిన రోజు పట్టించుకోలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పీవీ ఘాట్ ను ఏర్పాటు చేశారు. పీవీ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేసి, పీవీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరును పెట్టి, వారి జయంతి, వర్థంతులను అధికారికంగా జరిపించారు.

పీవీశతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపి, మన పీవీ, మన ఠీవి అని వారి ఖ్యాతిని చాటారు బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కోరుతున్నాను. మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని ఈ రోజు సభలో పెట్టిన తీర్మానాన్ని మేం సమర్థిస్తున్నం. ఇదే సభలో కేసీఆర్ పీవీకి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, వారికి భారత రత్న ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ లాయలిస్టు. వారికి ఎన్నో చేదు అనుభవాలు జరిగాయి. వారిని మౌన ముని అన్నారు. గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఐదేండ్ల మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు పీవీ, మన్మోహన్. ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చింది.

దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే కంట తడి పెట్టారే తప్ప, తనను తప్పుపట్టారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు మన్మోహన్. అందుకే ఆయన్ను లాయలిస్టు అన్నారు. ఆనాడు మన్మోహన్ కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగింది. మరో సందర్భంలో యూపీఏ భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ కి 2 ఏండ్ల జైలు శిక్ష పడితే, వారిని రక్షించేందుకు ఒక ఆర్డినెన్స్ తెచ్చారు.

అపుడు మన్మోహన్ ప్రధానిగా ఉన్నారు. తమ నిర్ణయం సరైందేనని చెప్పాలని ఏఐసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడికి రాహుల్ గాంధీ వచ్చి ఆర్డినెన్స్ కాపీలను చింపివేశారు. ఒక ప్రధానిగా మన్మోహన్ సింగ్, వారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అయినా, మన్మోహన్ మౌన మునిలాగానే ఉన్నారు తప్ప, నోరు తెరవని లాయలిస్టు, గొప్ప వ్యక్తి.

ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా కాంగ్రెస్ పార్టీ పట్ల మన్మోహన్ సింగ్ లాయలిటీ గొప్పది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నపుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరీంనగర్ సభలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అపుడు మన్మోహన్ సింగ్ పిలిచి, కేంద్ర క్యాబినెట్లో చేరండి అని కేసీఆర్ ని అడిగారు.

అపుడు కేసీఆర్ తాము మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే వచ్చామని బదులిచ్చారు. అపుడు మేం తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాం అని సోనియా, మన్మోహన్ హామీ ఇవ్వగా, కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చాలని కోరిన తర్వాతే కేబినెట్లో చేరేందుకు అంగీకరించారు. కేంద్ర నౌకాయాన మంత్రిగా కేసీఆర్ కిస్తే, డీఎంకే పార్టీ కోసం ఆ శాఖను తిరిగి ఇచ్చేశారు కేసీఆర్ .

ఆ సమయంలో 6 నెలల పాటు ఏశాఖ లేని కేంద్రమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసమే శాఖలేని మంత్రిగా ఉండాల్సి వచ్చింది. ఆరోజు కేసీఆర్ ని మన్మోహన్ సింగ్ ప్రశంసించారు.

LEAVE A RESPONSE