– సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
– వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం
– రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక
– 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్
– మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
– హైడ్రా… హైదరాబాద్ ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ
– స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గాంధీజీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం.ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో… పదేళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం.
వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం మన ముందున్న కర్తవ్యం. ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. 2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం.
ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు. అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా.
ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. మా ఆలోచనలో స్పష్టత ఉంది. అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేం ఎంచుకున్నాం.
పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన. దీనికి చరిత్రే సాక్ష్యం. 70 ఏళ్లుగా PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది.
13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా. భావోద్వేగం.
ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పాడుబడి, మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇది మేం తెచ్చిన మార్పు.
తెలంగాణ రైతుకు 2022, మే 6న వరంగల్ వేదికగారూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం మాట ఇచ్చాం. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా, రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం.
“ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం.
7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి.
మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం. అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం.
రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నాం. 50 రోజుల పాటు సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టాం. దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.
రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించాం. గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించాం.
మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం.
మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది.
యువత తెలంగాణ శక్తికి ప్రతీక. గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిశితంగా నిఘా పెట్టింది. డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’.
2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.
మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను. స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం.
హైదరాబాద్ ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ.
బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. ఆ దుస్థితి హైదరాబాద్ కు రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం. ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశాం.
ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను అక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పని చేస్తోంది. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది.హైడ్రా… హైదరాబాద్ ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకుందామని నేను మీ అందరికి పిలుపునిస్తున్నా.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ రెండు నాకు రెండు కళ్లు. తెలంగాణ భవిష్యత్ ను తీర్చిదిద్డడంలో ఈ వ్యవస్థలు అద్వితీయ పాత్ర పోషిస్తుంది. మన పిల్లల భవితకు ఇవి కేరాఫ్ అడ్రస్ గా నిలవబోతున్నాయి. దేశ క్రీడా చరిత్రలో తెలంగాణకు ప్రత్యేక చాప్టర్ ఉంది. తెలంగాణను దేశ క్రీడా మైదానంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకున్నాం. మేటి క్రీడా కారులను తయారు చేసి, ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాల సాధనే లక్ష్యంగా ఇటీవలే నూతన క్రీడా పాలసీని ఆవిష్కరించాం.
‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ తెలంగాణ (YIPESU)’ని నెలకొల్పాలని నిర్ణయించాం. ఈ వర్సిటీ నిర్వహణ కోసం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. అదే సమయంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా స్కూళ్లు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో సర్వ హంగులతో సకల వర్గాల విద్యార్థులు చదువుకునేలా యంగ్ ఇండియా స్కూళ్లు సిద్ధం అవుతున్నాయి. ఇవి భారతదేశ విద్య రంగంలో గేమ్ ఛేంజర్లు కావడం ఖాయం. ఇప్పటికే ఈ దిశగా 15,600 కోట్ల రూపాయల వ్యయంతో 78 పాఠశాలల నిర్మాణం జరుగుతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య రంగం అభివృద్ధికి రూ.39 వేల 575 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. ఈ మొత్తాన్ని మేం ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నాం.
శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోనే ది బెస్ట్ అని తెలంగాణ పోలీసులకు పేరుంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 ప్రకారం కోటికంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటిస్థానంలో నిలవడం మనకు గర్వకారణం.
138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమిట్’ (డబ్ల్యూపీఎస్) 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకాణం. డ్రగ్స్ పై పోరు కోసం ఈగల్ గొప్పగా పని చేస్తోంది.
మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా రూ.8 లక్షల 21 వేల 651 కోట్ల రూపాయలను అప్పులు బకాయిలుగా మిగిల్చి వెళ్లారు. దీనిలో రూ.6 లక్షల 71 వేల 757 కోట్ల రూపాయల అప్పులు, ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.40 వేల 154 కోట్లు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1 లక్ష 9 వేల 740 కోట్లు.
వారు చేసిన అప్పును సర్వీస్ చేయడానికి ఇప్పటి దాకా అసలు రూపేణా రూ.1 లక్ష 32 వేల 498 కోట్లు. వడ్డీలకు రూ.88 వేల 178 కోట్లను మొత్తం కలిపి 2 లక్షల 20 వేల 676 కోట్ల రూపాయలను డెట్ సర్వీసింగ్ చేశాం. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాలవైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేం కృషి చేస్తున్నాం.
మాకు విల్ ఉంది. విజన్ ఉంది. తెలంగాణ రైజింగ్ – 2047 మా విజన్. ఆ విజన్ ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం. ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టడమే మా విజన్. ఇందుకు మీ అందరి సహకారం, ఆశీర్వాదం అవసరం.