Suryaa.co.in

Andhra Pradesh

వెల్లివిరిసిన మానవత్వం

– చిన్నారి కోసం యంత్రాంగాన్ని పరుగులు తీయించిన చంద్రబాబు
– టైఫాయిడ్ బాధిత బాలుడి కోసం వైద్యబృందాన్ని ఇంటికే పంపిన ముఖ్యమంత్రి
– అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసీ
– మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాన్నే కదిలించిన అరుదైన ఘటన
– పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకబు చేసిన సీఎంఆర్ఎఫ్ విభాగ అధికారులు

విజయవాడ: ప్రజలకు సేవ చేయాలంటే అధికారంతోపాటు మనసు కూడా ఉండాలని నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడటం కోసం ప్రభుత్వాన్నే కదిలించిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.

వైద్య బృందం చిన్నారి ఇంటికే వెళ్లి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి అరుదైన సంఘటన విజయవాడలో నిజమైంది. విజయవాడలోని పాతరాజేశ్వరిపేటకు చెందిన లోకేష్ అనే వ్యక్తికి దేవాన్ష్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు గత కొన్ని రోజులపాటు టైపాయిడ్ బారిన పడ్డాడు.

పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. జ్వరం తీవ్రత ఎక్కకావడంతో 14 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4 శాతానికి పడిపోయింది. దీంతో దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా మారింది. కొడుకు దక్కుతాడో, లేదోనన్న పుట్టెడు దు:ఖంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఏంచేయాలో పాలుపోని స్థితిలో విషయం సీఎం పేషీలో హెల్త్ డిపార్ట్ మెంట్ చూసే అధికారులకు చేరింది.

బాలుడి పరిస్థితిని సీఎంకు తెలియజేయడంతో చలించిన చంద్రబాబు…ఎలాగైనా సరే దేవాన్ష్ ప్రాణాలను కాపాడాలని సీఎంఓలోని అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆగమేఘాలపై వెంటనే మెడికల్ టీంను నేరుగా ఇంటికి పంపి అవసరమైన టెస్టులు చేయించారు. తర్వాత మెరుగైన చికిత్సకోసం యుద్ధప్రాతిపదికన ఎల్ఓసి ఇచ్చి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

విజయవాడ ఏలూరు రోడ్డులోని రెయిన్ బో ఆసుపత్రిలో ఆగస్టు 31న చేర్పించి దాదాపు 11 రోజులపాటు దేవాన్ష్ కు చికిత్స అందించారు. దీంతో ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా దేవాన్ష్ బయటపడ్డాడు. చికిత్స అందుతున్న 11 రోజుల పాటు దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎంఆర్ఎఫ్ విభాగ సిబ్బంది ఆసుపత్రి యాజమాన్యంతో సంప్రదించి ఎప్పటికప్పుడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని సీఎంకు తెలియజేసింది.

దేవాన్ష్ మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడై తల్లిదండ్రుల ముఖంలో నవ్వులు చిందిస్తున్నాడు. తమ బిడ్డకు పునర్జన్మ నిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, చొరవ తీసుకుని ఫాలో అప్ చేసిన సీఎంఆర్ఎఫ్ విభాగ అధికారులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE