– జనసేన రెంటికీ చెడ్డ రేవడి అవుతుందా?
– పవన్ మూడు ఆప్షన్ల ఆలోచన ఎవరిది?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అటు ఇటు కానీ హృదయంతోనీ ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు కానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
పాటపాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వే వెందులకమ్మా
మనసున ఉన్నది చెప్పీ నవ్వమ్మా
– ఆచార్య ఆత్రేయ 1979లో వచ్చిన ‘ఇది కథ కాదు’ అనే సినిమాలో రాసిన పాట ఇది. ఆటబొమ్మను ఆటపట్టిస్తూ కమల్‌హసన్ విన్యాసమది.
సీన్ కట్ చేస్తే
2022…
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లకు ముందే ఎన్నికల పొత్తుపై ముందస్తు ముచ్చట్లకు తెరలేచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండే ఫార్ములాను, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సూచించారు. ఆ ప్రకారంగా ఆయన ముచ్చటగా మూడు ఆప్షన్లను తెరపైకి తెచ్చారు. అందులో ఒకటి జనసేన-బీజేపీ కలసి పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటుచేయడం. రెండోది జనసేన-బీజేపీ-టీడీపీ కలసి పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ముచ్చటగా మూడోది జనసేన సింగిల్‌గా పోటీ చేసి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయడం. ఇవీ.. కల్యాణ్‌బాబు వదిలిన పొత్తు బాణాలు. వీటిలో ఏది కావాలన్న ఆప్షన్ కూడా ఆయనే ఇచ్చారు కాబట్టి ఇక ఎలాంటి పేచీ లేదు.
కల్యాణ్‌బాబు ఆరకంగా మూడు ఆప్షన్లు ప్రకటించారు. బాగానే ఉంది. మరి ఆయన వదిలిన బాణం టీడీపీ, బీజేపీలకు తగలాలి కదా? అది తమనే గుచ్చుకుందని వాళ్లు ఫీలవ్వాలి కదా? ఆ తర్వాత కదా రియాక్షనేమిటన్నది తెలిసేది?! మరి దానికి కొంత సమయం పడుతుంది కదా? దానిపై టీవీల్లో నారదులు చర్చల పేరంటం పెట్టాలి కదా? అప్పుడే కదా ఎవరి మనసులో ఏముందో అర్ధమయ్యేది? కానీ ఈలోగా హరిప్రసాద్ అనే వీరజనసైనికుడు, తొందరపడి ముందే కూసేశారు. ఏమనంటే… ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కల్యాణ్‌బాబును రేపు సాయంత్రంలోగా ప్రకటించాలని! అదీ ఎప్పుడు? ‘పువ్వుపార్టీ’ బాసు నద్దాజీ ఆంధ్రాకు వచ్చే ముందురోజు. అంటే రాజమండ్రి వచ్చిన నద్దాసారు.. ఆ వేది పై నుంచే ‘వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే గిలిస్తే మా సీఎం క్యాండేటు కల్యాణ్‌బాబోచ్’ అని ప్రకటించాలన్న మాట. ఇదీ హరిప్రసాద్ అనే వీరజనసైనికుడి పేరిట బీజేపీపై పవనన్న వదిలిన (వదిలించిన) పొత్తు షరతుల బాణం.
జనసైన్యం ఎలాగూ డెడ్‌లైన్‌తో కండిషన్ పెట్టేసింది కాబట్టి, రాజమండ్రి సభలో నద్దాజీ జనసైనికుల కలలు పండించడమే తరువాయని అంతా అనుకుని.. పటాసులు కూడా సిద్ధం చేసుకున్నారు. ఫాఫం.. అక్క ఆర్భాటమే గానీ బావబతికుంది లేదన్నట్లు.. నద్దాభాయ్ అసలు ఆ ముచ్చటే తీయకపాయె. పైగా.. పుండుమీద కారం చల్లినట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమారేమో.. ‘‘అసలు ఏంటీ పిచ్చిచేష్టలు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైముంటే అప్పుడే ఈ గత్తరేంటి? ఈ గోలేందీ? అయినా బీజేపీలోని నేతలనే సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తాం. సీఎం అభ్యర్ధి అంశం పవన్, కేంద్రపార్టీ మాట్లాడుకోవాలి. గతంలో చంద్రబాబు మాదిరిగానే ఇప్పుడు పవన్ కూడా వైసీపీ ట్రాప్‌లో పడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే, వైసీపీ పొత్తుల చర్చను తెరపైకి తెచ్చింద’ని అరటిపండు వలిచినట్లు చెప్పేశారు. అంటే.. పవన్ బీజేపీలో చేరితే తప్ప, సీఎం కాలేడన్నది ఆయన కవి హృదయమన్నమాట.
అటు నద్దాసాబ్ కూడా.. ‘పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దు. బీజేపీ షరతులకు ఎప్పుడూ ఒప్పుకోదు. వైసీపీ ట్రాప్‌లో పడకండి. ముందు మీ బలం పెంచుకోండ’ని స్పష్టం చేశారట. అంటే రాంగా పోంగా మనకు అర్ధమయ్యేదేమిటంటే.. కల్యాణ్‌బాబు కలలు కన్న.. కల్యాణ్‌బాబు కోసం కలలు కంటున్న.. కల్యాణ్‌బాబు వల్ల కలలు కనే జనసైనికులు అండ్ అదర్స్ తెలుసుకోవలసిందేమిటంటే.. బీజేపీలో ఉన్న నాయకుడే సీఎం అభ్యర్ధి అవుతారు.
కానీ నాదెండ్ల మనోహరన్న మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. కల్యాణ్‌బాబు సీఎం అయేంతవరకూ మీరు విశ్రమించవద్దని ‘ప్రపంచ చిరంజీవి అభిమాన సంఘా’లకు పిలుపునిస్తున్నారు. రాజమండ్రి సభలో బీజేపీ బాసు నద్దాజీ.. ‘వైసీపీ పోవాలి బీజేపీ రావాలి’ అని అచ్చ తెలుగులో అన్నారే తప్ప, ‘వైసీపీ పోవాలి బీజేపీ-జనసేన రావాలి’ అని చెప్పలేదు. జనసైనికులూ.. ఇప్పుడు మీకు అర్ధమవుతోందా?
మరిప్పుడు ప్రజల్లో పలచన అయిందెవరన్నది ప్రశ్న. జనసైనికుడు హరిప్రసాద్ పెట్టిన డెడ్‌లైన్‌ను బీజేపీ పట్టించుకోలేదు. మాపార్టీ షరతులు అంగీకరించదని నద్దాజీ నిర్మొహమాటంగా చెప్పారు. పైగా బీజేపీ నాయకుడే సీఎం అభ్యర్ధి అవుతారని సత్యకుమార్ తెగేసి చెప్పేశారు. అటు చూస్తే పవన్ మూడు సూత్రాలపై టీడీపీ ఏమైనా స్పందిస్తుందా అనుకుంటే, అసలు ఆ పార్టీ లైట్ తీసుకుంది. బహుశా 40 శాతం ఓటు బలం ఉన్న తాను, ఆరేడు శాతం బలం ఉన్న పార్టీ నేతను సీఎంను చేయడమేమిటన్న కామెడీ కూడా, దానికి కారణమయి ఉండవచ్చు. ఆ ప్రకారంగా పవన్ సంధించిన మూడు ఆప్షన్ల బాణాలు, టర్ను తీసుకుని ఆయనకే తాకినట్లు లెక్క. దీన్ని బట్టి పవన్ పక్కన తలూపే అనుచరులు, జీతగాళ్లే తప్ప.. ఆయనకు సరైన రాజకీయ సలహాలిచ్చే తలకాయలు లేవన్నది సుస్పష్టం. ఇప్పుడు పవన్ రాజకీయంగా ఉభయ భ్రష్టత్వం చెందినట్లే కనిపిస్తోంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నది ఎయిర్‌టెల్ యాడ్ చెప్పిన మాట. కానీ పవన్‌కు మూడు ఆప్షన్ల ఐడియా ఇచ్చిన నాయకుడు మాత్రం.. పవన్ రాజకీయ జీవితాన్ని మార్చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న వ్యాఖ్య.
సో.. దీన్నిబట్టి పవన్‌ను పువ్వుపార్టీ పులుసులో ముక్కలా వాడుకుంటోందని, మెడ మీద తల ఉన్న ఎవరికయినా వీజీగా అర్ధమవుతుంది. మరి పవన్‌కు ఎందుకు అర్ధం కావడం లేదన్నదే ఆశ్చర్యం. రేపటి రాష్ట్రపతి ఎన్నికలో, కమలదళం అడగకపోయినా వైసీపేయులు బీజేపీ అభ్యర్ధికి ఓటేసి తీరతారు. టీడీపీ కూడా సేమ్ టు సేమ్. ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కమల కరుణాకటాక్ష వీక్షణాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నాయన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఎవరి భయాలు వారివి. ఎవరి కారణాలు వారివి. అందుకే ఏపీలో వైసీపీ-టీడీపీ ఇద్దరూ యుద్ధం చేసుకుంటారే తప్ప, ఒక్క బాణం కూడా పొరపాటున బీజేపీని తగలనివ్వరు. అదేదో సినిమాలో చెప్పినట్లు.. పవన్‌కు తిక్కమాత్రమే ఉంది. కానీ టీడీపీ-వైసీపీలకు రాజకీయాల్లో ఒక లెక్కుంది. దాన్నే ఫాలో అవుతాయి.
ఏపీలో సోము వీర్రాజు నుంచి విష్ణువర్దన్‌రెడ్డి వరకూ జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తారు. పోలీసులపై మీదపడి దూకుతుంటారు. మేం లేస్తే మనుషులం కాదంటారు. కానీ జగన్ మాత్రం బీజేపీపై పెదవి విప్పరు. అదే చంద్రబాబు, ఆయనకు మద్దతునిచ్చే మీడియాపై బహిరంగ వేదికలపైనే ఒంటికాలితో లేస్తారు. పక్కనే ఉన్న కేసీఆర్ మాత్రం కేంద్రంపై కత్తులు దూస్తారు. మళ్లీ అదే కేసీఆర్-జగన్ చెట్టపట్టాలేసుకుంటారు. జగన్ సర్కారు అప్పులతో ఆంధ్రాను అప్పుల అప్పారావును చేస్తోందని, నద్దా నుంచి పురందీశ్వరి వరకూ విమర్శల బాణాలు సంధిస్తుంటారు. కానీ మళ్లీ కేంద్రమే జగనన్న సర్కారు
కష్టాల్లో పడినప్పుడల్లా డబ్బులిచ్చి ఆదుకుంటుంది. మరి ఆంధ్రా అప్పులకు కారణమెవరు? ధర్మారెడ్డి, సమీర్‌శర్మ వంటి అధికారులకు, దేశచరిత్రలోనే తొలిసారిగా సర్వీసు పొడిగింపు ఇస్తుంది. రాజకీయాల్లో ఇదొక ఆట. కేంద్రంలోని బీజేపీ ఆడే ఈ ఆటలో పవన్ పాత్రేమిటో బహుశా ఆయనకే తెలిసి ఉండకపోవచ్చు. నిజంగా తెలిస్తే.. తాను యుద్ధం చేసే వైసీపీతో, తెరచాటు స్నేహం చేస్తున్న బీజేపీతో కలసి సాగుతారా? అన్నది బుద్ధిజీవుల సందేహం.
సోము కూడా ఫఫ్పులో కాలేశారు..
ఫాఫం.. ఫవన్‌కు రాజకీయాలు తెలీక మూడు ఆఫ్షన్లు ఇచ్చి ఫఫ్పులో కాలేశారు. కానీ బీజేపీ లెక్కలు తెలిసి కూడా ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఫఫ్పులో కాలేసి ఎట్లా నవ్వులపాలయ్యారో అర్ధం కావడం లేదన్నది కమలనాధుల ఉవాచ. ఫవన్ అలా ఆప్షన్లు ఇచ్చారో.. లేదో.. వెంటనే ఈర్రాజు గోరు, లేడిపిల్లలా చెంగున స్పందించి.. ‘మేం పవన్ ఇచ్చిన ఒకటో ఆప్షన్‌ను ఎంచుకుంటామ’ని చిన్నపిల్లాడిలా స్టేట్‌మెంటిచ్చేయడమే పువ్వుపార్టీ నేతల నవ్వులాటకు కారణం. బీజేపీ అలా షరతులు అంగీకరించదని నద్దా సాబ్.. అసలు ఇతర పార్టీ వారిని సీఎం చేసే అలవాటు లేదని సత్యభాయ్ చెప్పిన తర్వాత… ఈర్రాజన్న ముఖచిత్రం ఎలా ఉందో ఎవరూ చూసిఉండరేమో?!