జగన్‌ సాయం.. ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి!

పాలాభిషేకాలకు సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటుంటారు. నేనెప్పుడూ ఉద్యోగుల పక్షమే. కాకపోతే ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తోంది’
– కొన్ని నెలల క్రితం ఆందోళన బాట పట్టిన ఏపీ ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న ఉద్యోగులతో, ఏపీ సీఎం జగనన్న చేసిన వ్యాఖ్య.

అవును. నిజమే. ఏపీ సీఎం జగనన్న చేతికి ఎముక ఉండదు. ఆయన ఇచ్చినన్ని పదవులు ఇప్పటివరకూ ఎవరూ ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు నామినేటెడ్‌ పదవులిచ్చారు. కానీ.. జగనన్న అలా కాదు. తాను ఇచ్చే పదవులకు సంబంధించి ఆఫీసులున్నాయా? లేవా? వాళ్లు కూర్చునేందుకు కుర్చీలున్నాయా? లేవా? వాటికి నిధులున్నాయా? లేవా? అవేమీ ఆలోచించలేదు. వారికి మేళ్లు చేయాలనుకున్నారు. చేసేశారంతే. సంకల్పం ఉండాలే గానీ, నిర్ణయం ఎంతసేపూ?!

అలాగే.. రెండేళ్ల కరోనా కరవు కాలంలో కూడా ఉద్యోగులకు బోలెడన్ని మేళ్లు చేశారు. ఠంచనుగా ఒకటో తారీఖున గంట కొట్టినట్లు ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు పడిపోతున్నాయి. కాంట్రాక్టర్లు ఏ పనిచేసినా వాటి తాలూకు బిల్లులు వాయువేగంతో వచ్చేస్తున్నాయి. వాటిని సకాలంలో తీసుకోని వాడే పాపాత్ముడు. కోర్టు తీర్పులతో పనిలేకుండా, ఎవరూ కోర్టుగడపకెక్కకుండా జగనన్న ప్రభుత్వమే ఆగమేఘాలమీద బిల్లులు క్లియర్‌ చేసి, కాంట్రాక్టర్ల పెదవులపై చిరునవ్వులు పూయిస్తోంది. అందుకే తెలంగాణలో మాదిరిగా, ఏ ఒక్క కాంట్రాక్టరూ బిల్లులు రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్న దాఖలాలు ఏపీలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కాకపోతే బిల్లులు రాక వైసీపీ కాంట్రాక్టర్లే ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఎల్లోమీడియా.. ఆత్మహత్య చేసుకున్న వారి ఫొటోలు, సూసైడ్‌నోట్లూ ప్రచురిస్తున్నాయి.

మరి ఇన్ని మేళ్లు చేస్తున్న జగనన్న ఆఫ్టరాల్‌ 12 లక్షల మంది ఉద్యోగుల పిల్లలకు రుణాలివ్వలేరనుకుంటున్నారా?..లక్షలమంది అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు మేళ్లు చేస్తున్న జగనన్న.. కేవలం 12 లక్షల మంది ఉద్యోగుల పిల్లల చదువు కోసం సాయం చేయరనుకుంటున్నారా?
యస్‌. నిజంగా అదే జరిగింది. ఏపీలోని 12 లక్షల మంది ఉద్యోగులు, తమ పిల్లల ఉన్నత చదువుల కోసం అందినకాడికి అప్పులు చేస్తున్నారు. అధిక వడ్డీలు తెచ్చి పిల్లలను పైచదువులు చదివిస్తున్నారు.

ఉద్యోగులు పడుతున్న ఈ కష్టాలు చూసి, చలించిపోయిన జగనన్న సర్కారు.. వారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుందట. తన పాలనలలో ఎవరూ కష్టాలు పడకూడదన్న లక్ష్యం-ఆశయం-చిత్తశుద్ధితో, జగనన్న సర్కారు విశ్వమే విస్తుపోయేలా తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో ఉద్యోగులు
ap-emp ఉక్కిరిబిక్కిరయి, మురిసిముక్కలయిపోతున్నారట. తాము కలలో కూడా ఊహించనివిధంగా తమకు మేలు చేసిన జగనన్న రుణం తీర్చుకునేందుకు.. వారంతా క్రమశిక్షణ గల సైనికుల మాదిరిగా కదిలి, క్యూలు కట్టి మరీ జగనన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించారట. ఆ మేరకు ఉద్యోగ సంఘ నాయకులు కూడా.. ప్రాంతాల వారీగా పర్యటనలు ప్రారంభించి, ఉద్యోగులకు తామే స్ఫూర్తిగా నిలవాలని నిర్ణయించారట. ‘జయహో జగనన్న’ ‘ థ్యాంక్యూ సీఎం సర్‌’ అంటూ ప్లకార్డులపై పెయింటింగ్‌ వేసే పనిలో ఉన్నారట.

అసలు జగనన్న వారికి చేసిన మేళ్లు ఏమిటన్నది తెలుసుకోవాలి కదా? ఆ ఘనత ప్రపంచానికీ తెలియాలి కదా? అందరు ముఖ్యమంత్రులూ ఆదర్శంగా తీసుకోవాలి కదా? అవును… ఏపీలో 12 లక్షల మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం రుణాలిస్తుంది. జగనన్న ప్రభుత్వం అందుకోసం బడ్జెట్‌లో 50 లక్షలు కేటాయించింది. అందులో భాగంగా ఇప్పుడు 12 లక్షల 50 వేల రూపాయలు విడుదల చేసింది. అంటే ఒక్కో ఉద్యోగికీ అక్షరాలా 100 పైసలు.. 10 పది పైసలు.. నాలుగు పావలాలు.. రెండు అర్ధరూపాయలు విడుదల చేసిందన్నమాట.

తాము ఊహించని విధంగా, అసలు తాము కోరుకోకుండానే జగనన్న చేసిన ఇంత భారీ సాయం చూసి ఉద్యోగులు నోరెళ్లబెడుతున్నారు. ఇన్ని డబ్బులు ఏం చేసుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? దొంగలకు
employees దొరక్కుండా ఎలా దాచిపెట్టాలి? బ్యాంకు లాకర్లలో ఇన్ని డబ్బులు పడతాయా? పోనీ జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం కోసం, ఒక్కో ఉద్యోగి ఒక్కో అమూల్‌ పాలట్యాంకర్‌ను తీసుకున్నా ఇంకా డబ్బులు మిగిలిపోతాయి. ఆ మిగిలిన డబ్బు ఏం చేయాలి? ఎలా ఖర్చు పెట్టాలి? అన్న గందరగోళంలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారట.

ఇదీ ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరికి అసలు కారణమట. అయితే.. ఈ ఇచ్చిన 100 పైసలనే ఏం చేసుకోవాలో అర్ధం కాక ఉద్యోగులు జుత్తు పీక్కుంటుంటే.. ఇంకా ఏపీజీఎల్‌ఐ, ఈపీఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, లోన్‌ అడ్వాన్సుల రూపంలో 2200 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, డీఏ బకాయిలు ఇప్పటిదాకా తమ ఖాతాలో జమకాలేదన్న గోల ఒకటి. ‘ఈ దాచివేత బాధలు’ గ్రహించిన జగనన్న.. ఉద్యోగులు 58 ఏళ్లకు రిటైర్మెంట్‌ అయిన తర్వాత వచ్చే డబ్బును ఏం చేసుకోవాలో తెలియక కష్టాలు పడతారన్న ముందుచూపుతోనే.. మరో రెండేళ్లు పదవీవిరమణ పొడిగించి, వారి డబ్బును కాపాడారు. అది కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా?

ఇదిగో సిద్దప్పా.. మరీ ఆశ పనికిరాదప్పా. జగనన్న ఇప్పుడు 100 పైసలు ఏసిండుగా? ఆ దుడ్డు అయిపోనాక మిగిలిన ‘లెక్క’ ఇస్తార్లే. యాడికిపోతారూ.. ఏందీ? ఆ యప్ప కష్టపడేది మీకోసమేగా? ఇచ్చార్లేప్పా. దుడ్డు మీకాడుంటే ఒకటీ.. ఆ యప్ప కాడుంటే ఒకటా ఏందీ?

Leave a Reply