ఏమని చెప్పమంటావు సామీ! ఇయ్యాల మన భోగాపురం గడ్డ మీద, ఆ ఆకాశం నుంచి లోహ విహంగం దిగుతుంటే.. గుండె సెమర్చింది, ఒళ్లు పులకరించింది సామీ! అది ఉత్త విమానం కాదురా బాబూ.. మన ఉత్తరాంధ్ర కుర్రోళ్ల భవిష్యత్తు, మన తలరాతను మార్చే వెలుగు రేఖ!
రన్‌వే మీద ఆ విమానం టైర్లు తగిలి ‘చుయ్’ అని శబ్దం వస్తుంటే, ఆ శబ్దం ఎక్కడికో వెళ్ళిపోయిన మన ఉత్తరాంధ్ర గౌరవాన్ని మళ్ళీ ఆకాశానికి ఎత్తుతున్నట్టు అనిపించింది.
ఇది ఇయ్యాల్టి ముచ్చట కాదు సామీ. 1997లోనే మన చంద్రబాబు నాయుడు “వైజాగ్‌కి గెడ్డ విమానాశ్రయం రావాలి” అని ప్లాన్ గీశారు. 2014లో విభజన కష్టాల్లో ఉన్నా, కంకణం కట్టుకొని పనులు తెచ్చి, 2019 ఫిబ్రవరి 14న ఆయనే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
కానీ ఏమైంది? మధ్యలో వచ్చిన ప్రభుత్వం టెండర్లని, కోర్టులని, భూములు కట్ చేస్తామని.. మన కలను ఐదేళ్లు మూలన పడేశారు. మన గడ్డకు రావాల్సిన అభివృద్ధిని ఆపేసినప్పుడు కడుపు రగిలిపోయింది నాయనా! కానీ మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం రావడం, బాబు గారు వెంటనే సీన్లోకి దిగి మన రామ్మోహన్ నాయుడుతో కలిసి రివ్యూలు చేసి “జూన్ 2026 కల్లా విమానం ఎగరాల్సిందే” అని హుకుం జారీ చేశారు.
ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పాలి. ఈ ఎయిర్పోర్ట్ ఇంత గొప్పగా వస్తుందంటే దానికి పునాది మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఆయనేదో అధికారం కోసం చూసే రకం కాదు. మన బిడ్డలు పైలెట్లు కావాలని, ఇక్కడ చదువులు పెరగాలని మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఏకంగా 136 ఎకరాల అమూల్యమైన భూమిని చిరునవ్వుతో ఇచ్చేశారు. వేల కోట్ల విలువైన ఆ నేలని మన కోసం ధారపోసిన ఆ ‘రాజసం’ ఈ రన్‌వే ఉన్నంత కాలం చరిత్రలో నిలిచిపోద్ది.
అశోక్ గజపతిరాజు గారు ఇచ్చిన ఆ 136 ఎకరాల్లోనే GMR గ్రూప్ వారు ఇండియాలోనే అతిపెద్ద “ఏవియేషన్ ఎడ్యు సిటీ” (Aero University) కడుతున్నారు.
మన శ్రీకాకుళం, విజయనగరం కుర్రోళ్లు పైలట్ చదువుల కోసం ఎక్కడో అమెరికా, బెంగళూరు వెళ్లక్కర్లేదు.
మన భోగాపురంలోనే విమానం ఇంజిన్ రిపేర్లు (MRO), పైలట్ ట్రైనింగ్ అన్నీ వస్తాయి. దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు మనోళ్లకే వస్తాయని బాబు గారు ధీమాగా చెప్పారు.
ఇయ్యాల చరిత్ర సృష్టించబడింది సామీ! ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్‌వే మీద విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. మన బిడ్డ రామ్మోహన్ నాయుడు, అధికారులు ఆ విమానం దిగి నవ్వుతుంటే.. “ఔనురా, ఉత్తరాంధ్రోడి పౌరుషం ఆకాశమంత” అనిపించింది.
ప్రస్తుతం 97 శాతం పనైపోయింది. బాబు గారు చెప్పినట్టే 2026 జూన్ కల్లా పూర్తి స్థాయిలో విమానాలు తిరుగుతాయి. ఇంక మీరంతా సూట్ కేసులు సర్దుకోండి.. మన ఊరి నుంచే ఫారిన్ వెళ్ళిపోదాం!