– భూసేకరణ చేయకుండా సూడో మేధావులతో అడ్డుకున్నారు
– పాలమూరు బిడ్డ, పాలమూరు అల్లుడి చేతిలో ప్రాజెక్టులు ఆగం
– పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేశాం
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: పాలమూరులో ఏడు వేల కోట్ల పనులు కాదు తట్టెడు మన్ను కూడా ఎత్తలేదు. గత రెండేళ్లలో ఏం పనులు చేశారో వెల్లడించాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులకు బిల్లులు మాత్రమే చెల్లించారు. కనీసం రూ.500 కోట్ల పనులు చేసి ఉంటే చూపించాలి. ఆరునెలలు పనులు చేపడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీళ్లు అందేది
2023 సెప్టెంబరులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అటవీ అనుమతులు వచ్చాయి. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ 17.03,2023లో అనుమతులు ఇచ్చింది. సెంట్రల్ సాయిల్ మరియు మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ 2023 జూన్ లో అనుమతులు ఇచ్చింది. కేంద్ర గిరిజన శాఖ 17.7.2023న, కేంద్ర భూగర్భ జలబోర్డు 28.07.2023న, కేంద్ర పర్యావరణ కమిటీ 10.08.2023న పర్యావరణ అనుమతులు జారీ చేయాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆ అనుమతి వస్తే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం జరుగుతుంది.
ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఒక్క పనీ చేపట్టలేదు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కేంద్రం మీద వత్తిడి తెచ్చి డీపీఆర్ వెనక్కి పంపించారు. డీపీఆర్ వెనక్కి రావడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీల నీటికి ఒప్పుకోవడం దుర్మార్గం. బీఆర్ఎస్ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్తగారి ఊర్లో దుందుభి నది మీద చెక్ డ్యామ్ నిర్మించాం. బీఆర్ఎస్ హయాంలో చెక్ డ్యాంల నిర్మాణంతో దుందుభి సస్యశ్యామలం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల వద్ద నిర్మించాలని చెప్పడం కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం. జూరాలలో 6.5 టీఎంసీల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూరాలకు 25 నుండి 30 రోజులు మాత్రమే వరద వస్తుంది. జూరాల మీద కుడి, ఎడమ కాలువల కింద లక్ష 10 వేల ఎకరాలు, భీమా ఫేజ్ 1, 2 కలిపి 2.3 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ 46 వేల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. జూరాల కింద నీళ్లు ఇచ్చే పరిస్థితి లేక క్రాప్ హాలిడే ప్రకటించారు.
అక్కడ పాలమూరు ఎత్తిపోతల చేపడితే 46 గ్రామాలు ముంపుకు గురికావడమే కాకుండా, 77 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఒకసారి చదవాలి. శ్రీశైలం కింద క్రిష్ణాతో పాటు, తుంగభద్ర ద్వారా 400 టీఎంసీల నీళ్లు వస్తాయని కేంద్ర జలసంఘం వెల్లడించింది. శ్రీశైలం వద్ద పాలమూరు వద్దనడం కాంగ్రెస్ నేతల అవగాహన రాహిత్యానికి నిదర్శనం.
ఆధారాలు లేకుండా కేసీఆర్ ఒక టీఎంసీకే పరిమితం చేశారు అని ఆరోపించడం అవివేకం. పనులు మొదలుపెట్టడమే 2 టీఎంసీలుగా నిర్ణయించి పనులు చేపట్టడం జరిగింది. దశలవారీగా పంపులు ఏర్పాటు చేయడం జరిగింది. రెండు టీఎంసీల కోసమే పనులు పూర్తి చేయడం జరిగింది. ఆంధ్రా అధికారులను తీసుకువచ్చి తెలంగాణలో కీలకస్థానాల్లో నియమించడం వెనక అంతర్యం ఏమిటి ? వీరు పాలమూరు హక్కులను కాపాడతారా ? కాంగ్రెస్ నిర్లక్ష్యానికి శ్రీశైలం సొరంగంలో వెలికితీయని ఆరుగురు కార్మికుల శవాలే సాక్ష్యం.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కమలం పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా పాలమూరు బహిరంగసభకు వచ్చిన నరేంద్రమోడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కనీసం పన్నెండేళ్లలో తెలంగాణ నీటి వాటాను తేల్చాలని ఒక్క బీజేపీ నేత అయినా అడిగాడా ? ఒక్కరోజయినా నరేంద్రమోడీని బీజేపీ ఎంపీలు 12 ఏళ్లలో అడిగారా ?
కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేసిన వెదిరె శ్రీరాం కేంద్రానికి సలహా ఇచ్చి సెక్షన్ 3 కింద నీటి వాటా తేల్చే పని ఎందుకు చేయలేదు ? ఆయన మహారాష్ట్రకు సలహాదారువా ? కాంగ్రెస్ పార్టీకి సలహాదారువా ? సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమావేశాల్లో ఈ బీజేపీ నేత ఎలా పాల్గొంటారు ? బీజేపీలో ఉండి కాంగ్రెస్ పాత్ర ఎందుకు పోషించాలి ? కాంగ్రెస్ పార్టీలో చేరితే సరిపోతుంది కదా. బీజేపీ నేత వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొంటారా ?
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఇలాంటి వారిని కూర్చోబెట్టుకుని ఎలా మాట్లాడతారు ? వారి అసలు కుట్ర ఏందో తెలుసుకోవాలి. పాలమూరుకు బీజేపీ పైసా సాయం చేయకుండా అడ్డుకుంటూ అనేక కుట్రలు చేశారు. కృష్ణాలో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పడం అవివేకం.
కేంద్రం నీటివాటా తేల్చని నేపథ్యంలో అడ్ హాక్ అరెంజ్ మెంట్ కింద కేటాయించడం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ, ఆంధ్రా, తెలంగాణ అధికారుల సమావేశంలో జూన్ 2015న మినిట్స్ లో పేర్కొన్నది మాత్రమే. కనీసం రికార్డులు చూసి అయినా తెలుసుకోకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తప్పు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదిత్యానాథ్ దాస్ తో చెప్పిస్తారా ? కాంగ్రెస్ కు రక్షణ కవచంగా కొందరు బీజేపీ నేతలు పనిచేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రూ.3 వేల కోట్లతో కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తిచేశాం. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి కింద కేవలం 13 వేల ఎకరాలకే సాగునీరు ఇచ్చారు. బీఆర్ఎస్ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది. నెట్టెంపాడు కింద కాంగ్రెస్ హయాంలో 2300 ఎకరాలకు, భీమా ఫేజ్1,2 కింద ఇచ్చింది 12 వేల ఎకరాలకు మాత్రమే, కోయిల్ సాగర్ కింద నీళ్లే ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలనలో 27 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం
జూరాల నీళ్లు కృష్ణాలో కలవకుండా సింగోటం, గోపల్ దిన్నెలింకు కెనాల్ ద్వారా రూ.150 కోట్ల పనులు చేపట్టాం. దాని మీద కూడా జిల్లా మంత్రి ఒక్కసారి సమీక్ష లేదు. ఆ పనుల కాంట్రాక్టర్ రెవెన్యూ మంత్రి దానిని ఆయన పూర్తి చేయడం లేదు. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం .. ప్రజలను చైతన్యం చేసి ఉద్యమిస్తాం. త్వరలోనే కేసీఆర్ కార్యాచరణ ప్రకటిస్తారు. కాంగ్రెస్ అక్కసు, వివక్షతో 145 మెగావాట్ల పాలమూరు రంగారెడ్డి పనులను అడ్డుకుంటున్నారు. రైతులకు, పాలమూరు ప్రజలకు మేలు జరగాలన్న ఆకాంక్ష కాంగ్రెస్ నేతలకు లేదు.
తెలంగాణ భవన్ లో నిర్వహిాంచిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.