Suryaa.co.in

Telangana

పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

– ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నాగర్ కర్నూలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూలు: ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ కు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రేపటి సాయంత్రం లోగా స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జె పాటిల్ కు అందజేయాలని కలెక్టర్లకు ఆదేశం ఇచ్చాం.

గతంలో వెనుకబడ్డ పేరున్న, వలసలకు పేరున్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో, సాగునీటి ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నాం.

గత ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఖర్చు చేసి కొత్తగా ఒక ఎకరానికి నీళ్లవ్వలేదు. పదేండ్లలో జిల్లా సాగునీటి ప్రాజెక్ట్స్ ను ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి.రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రంగా పనులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. అన్ని సమస్యలను పరిష్కరించి ప్రాజెక్ట్ లను పూర్తి చేసి తీరుతాం. బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ మంత్రి వారి హయాంలో 90 శాతం పనులు పూర్తి వేశామని చెప్పారు.ఇది పూర్తిగా అవాస్తవం, సత్యదూరం.

పాలమూరు జిల్లాలో కుర్చీ వేసుకుని కూర్చొని సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని ఆనాడు కేసీఆర్ చెప్పారు. 20 శాతం పనులను కూడా పూర్తి చేయలేదు. ఆదరాబాదరగా ఉమ్మడి పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. కాలువలు పూర్తి కాకుండా ఆయకట్టుకు నీళ్ళు ఎలా ఇస్తారు?అదనంగా ఒక ఎకరానికి కూడా నీళ్లివ్వలేకపోయారు.

మరి ఎందుకు కోయిలాసాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో ఇంకా అర్థం కాలేదా? 14 సీట్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే మీకు ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టు లను పూర్తి చేయాలంటే.. ఇంకా రూ. 50 నుంచి 60 వేల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ హయాంలో 20 శాతం పనుల కూడా పూర్తి కాలేదు
సమీక్ష సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,, వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE