Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలోకి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు

– టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించిన పల్లవిరాజు
– పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు పల్లవి స్వయానా చెల్లెలు
– టీడీపీలో చేరిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానన్న పల్లవి

విజయనగరం : ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఇంట్లో రాజకీయ పోరు చర్చనీయాంశంగా మారింది. పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, ఆయన కుమార్తె పల్లవి రాజు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, మన్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే పార్టీ మార్పుకు కారణమని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు తెలిపారు.

కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకకపోవడం బాధించిందన్నారు. గౌరవం లేని పార్టీలో ఇక కొనసాగలేమని… అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విజయనగరం జిల్లాలో
పార్వతీ పురం రామానంద నగర్ లోని బెలగాంలో తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

పల్లవి రాజు మాట్లాడుతూ.. లాబేసు-పూర్ణపాడు వంతెన, నాగావళి వంతెన కురుపాం గిరిజనుల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ వంతెనలు నిర్మాణం కాలేదని.. వర్షాకాలంలో కురుపాం నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో పాము కాటుకు గురై విద్యార్థి మరణిస్తే కనీసం ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌లో పాస్ అవలేదన్నారు. ఇలా చాలా అంశాల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే అమరావతైనా, గిరిజన ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు.కురుపాం నియోజకవర్గం అభివృద్ధే తన ధ్యేయమని పల్లవి రాజు తెలిపారు

LEAVE A RESPONSE