Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు సాంఘిక నాటక వికాసానికి కృషి చేసిన తొలి తరం దిగ్గజం పామర్తి

– గ్రంథాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని

గుడివాడ, డిసెంబర్ 22: తెలుగు సాంఘిక నాటక వికాసానికి కృషి చేసిన తొలి తరం దిగ్గజం పామర్తి సుబ్బారావు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కొనియాడారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రాజబాపయ్యచౌక్ సెంటర్లో పామర్తి సుబ్బారావు జీవిత చరిత్రపై రూపొందించిన గ్రంథాన్ని మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నాటక రంగంలో పామర్తి సుబ్బారావు పాత్ర చారిత్రాత్మకమైనదని అన్నారు. నట ప్రయోక్తగా, దర్శకునిగా, రచయితగా, శ్రీప్రభాకర నాట్య మండలి వ్యవస్థాపక నిర్వాహకునిగా పామర్తి సుబ్బారావు చేసిన సేవలు అజరామరమని అన్నారు. కైకాల, జాలాది, రేడియో ఏకాంబరం వంటి దిగ్గజాలను రంగస్థలాన తీర్చిదిద్దిన గురువు పామర్తి సుబ్బారావు అని అన్నారు.

గుడివాడ ప్రాంత ప్రజలకు గర్వకారణమైన పామర్తి జీవిత చరిత్రను గ్రంథ రూపంలో వెలువరించడం అభినందనీయమన్నారు. సామాన్యుడిగా జన్మించి అసమాన్య రీతిలో ఎదిగిన పామర్తి జీవితాన్ని నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పామర్తి జీవితాన్ని గ్రంథ రూపంలో మలిచిన రచయిత మన్నె శ్రీనివాసరావును మంత్రి కొడాలి నాని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళారంగ ప్రముఖులు మట్టా రాజా, నరహరిశెట్టి ప్రసాద్, వంశీ, ఆర్వీఎల్ నరసింహారావు, ఎంఎస్వీ సత్యనారాయణబాబు, కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు బీ రామమోహనరెడ్డి, కోశాధికారి విన్నకోట సత్యనారాయణ (బుజ్జి), సభ్యులు లోయ రాధాకృష్ణ, అమ్ముల పార్వతి, సువర్ణ, డీ వరలక్ష్మి, ఎల్ ప్రకాష్, పీ శ్యామ్, టీ రత్నదాస్, టీఎస్ బాబు, బీవీ సత్యం, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE