Suryaa.co.in

Andhra Pradesh

భారతీయ గణిత వైభవ చిహ్నం ‘పంచాంగం’

– విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి

సనాతనమైన భారతీయ గణిత విజ్ఞానానికి పంచాంగం మూలస్తంభంగా నిలుస్తుందని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాంగ కర్తల సమాఖ్య ఆవిర్భావ సభ విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని శ్రీ షణ్ముఖ వేద విద్యాలయంలో జరిగింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ వ్యక్తి జీవితంలోని ప్రతి ఘట్టం పంచాంగంతో ముడిపడి ఉంటుందన్నారు. వరాహమిహిర, ఆర్యభట్ట వంటి ప్రాచీనులైన రుషులు ఎన్నో ఖగోళ పరిశోధనలు చేసి, సమున్నతమైన పంచాంగ విజ్ఞానాన్ని ఆవిష్కరించారన్నారు. ఇది మనకు వారసత్వ సంపద అని, దీన్ని భావితరాలకు అందించేలా నేటితరం పంచాంగకర్తలు కృషి చెయ్యాలన్నారు.

పంచాంగరచనలో ఉన్న భిన్న సిద్ధాంతాలన్నిటినీ పండితులు పరిష్కరించుకుని ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.
‘సమాఖ్య’ను ప్రారంభించిన ప్రముఖ ప్రవచన కర్త సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో పంచాంగం కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలోని పంచాంగకర్తలందరూ ఏకతాటి మీదకు రావటం శుభసూచకమన్నారు. పంచాంగరచనకు సంబంధించిన పరిశోధనలు విస్తృతంగా జరగాలన్నారు. రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాంగకర్తలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.

పంచాంగం తోడులేనిదే మనిషి జీవితం సుగమం కాదన్నారు. తెలుగు సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తమ అకాడమి పక్షాన పంచాంగ కర్తల సదస్సు నిర్వహిస్తామన్నారు. పంచాంగ పరిశోధన గ్రంథాలను ముద్రించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
‘సమాఖ్య’ అధ్యక్షుడు, శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ మాట్లాడుతూ ఉగాది అంటే పంచాంగమని, పంచాంగం చెబితేనే ఉగాది నిర్ణయం అవుతుందని, కానీ పంచాంగ రచయితలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం సహకరిస్తే పంచాంగభవనాన్ని నిర్మించి, రేపటి తరానికి పంచాంగ రచనలో శిక్షణ ఇస్తామన్నారు.

‘సమాఖ్య’ ప్రధాన కార్యదర్శి, సింహాచలం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస సిద్ధాంతి మాట్లాడుతూ పంచాంగ రచనలో అనేకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, పండుగల విషయంలో ఏకరూపత సాధించేందుకు కృషి చేస్తామన్నారు. షణ్ముఖవేదవిద్యాలయ వ్యవస్థాపకులు కప్పగంతు లక్ష్మీనారాయణ దంపతులను స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సువర్ణకంకణంతో సత్కరించారు. మొత్తం కార్యక్రమాన్ని ‘సమాఖ్య’ సంయుక్త కార్యదర్శి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నిర్వహించారు.

LEAVE A RESPONSE