Suryaa.co.in

Editorial

పాపం.. కేశినేని నాని!

– అప్పుడు బాబు పక్కనే స్థానం
– ఇప్పుడు విజయసాయి వెనుక నిలబడి..
– సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

విజయవాడ ఎంపి కేశినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్దిమందిలో ఆయన ఒక నాయకుడన్న భావన, మొన్నటి వరకూ ఉండేది. తనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన ఉండేది. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన తర్వాత , అది కాస్తా మాయం అయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన పాత-కొత్త ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంటే.. గంభీరంగా కనిపించే నానికి వైసీపీలో పెద్ద ప్రాధాన్యం లేదనిపించే ఫొటోలు వెలుగుచూశాయన్నమాట.

కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించేవారు. సీఎంఓ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడినా, తాను నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానని చెప్పేవారు. బాబు దగ్గర ఉండే సీనియర్లను కూడా ఖాతరు చేసేవారు కాదు. తనది చంద్రబాబు స్థాయి అని ఫీలయ్యేవారు. దానితో చాలామంది సీనియర్లు ఆయనతో మాట్లాడేందుకే భయపడేవారు.

ఇప్పుడు సీన్‌ కట్‌ చేస్తే.. అదే కేశినేని నాని వైసీపీలో చేరారు. విజయవాడ ఎంపీగా తనతోపాటు.. మరో ఐదుగురు నేతలకు, అసెంబ్లీ సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారట. అయితే అందులో తిరువూరు తప్ప, మరో సీటు ఇచ్చేందుకు వైసీపీ బాసులు ఒప్పుకోవడం లేదట. అది వేరే విషయం.

ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేశినేని నాని హాజరయ్యారు. మామూలుగా అయితే, ఆయన ‘అనుకునే’రేంజ్‌కి నానికి పెద్దపీట వేయాలి. ముందు వరసలోనే స్థానం ఇవ్వాలి. గతంలో చంద్రబాబు కూడా అదే చేశారు. ఆయనను తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు. అయినా తృప్తి చెందలేదు. ఇప్పుడు పార్టీ మారిన తమ నాయకుడికి, అంతకంటే ఎక్కువ మర్యాద లభిస్తుందని ఆయన అనుచరులు భావించారు. కానీ.. జరిగింది అందుకు విరుద్ధం.

విజయసాయిరెడ్డి ముందు వరసలో ఉండి, మీడియాతో మాట్లాడితే… స్వతంత్ర భావాలుండి, ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేశినేని నాని మాత్రం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడటం, నాని అనుచరులను తెగ బాధించిందట. సరే నిలబడితే నిలబడ్డారు. కానీ ఆ ఫొటోలు మీడియాలో వచ్చి, సోషల్‌మీడియాలో ర్యాంగింగ్‌ అవుతుంటే వాటిని చూసి, నాని అనుచరులు బావురుమంటున్నారట.

అంతపెద్ద చంద్రబాబునాయుడు పక్కనే.. తమ నేత కుర్చీలో ధీమాగా కూర్చుంటే, ఇక్కడేమిటి ఎమ్మెల్యేల వెనుక నిలబడాల్సి వస్తుంది? ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే, ఇక భవిష్యత్తులో ‘ఇంకెంత గౌరవం’ ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారట.

అయితే వైసీపీ నేతలు మాత్రం.. మా పార్టీ స్కూలు సిలబస్‌ వేరు. మీరు వచ్చిన టీడీపీ పార్టీ సిలబస్‌ వేరు. ఎవరైనా సరే మా సిలబస్‌ ఫాలో కావాల్సిందే. ఆ పార్టీలో మాదిరిగా, సొంత సిలబస్‌ను ఫాలో అవుతామంటే కుదరదు. ప్రాధాన్యం ఇచ్చేవరకూ వెయిట్‌ చేయాల్సిందే. అంతేగానీ ఆ పార్టీలో మాదిరిగా, ప్రాధాన్యం కోసం బెదిరిస్తే మా జగనన్న అస్సలు ఒప్పుకోరు. ఇక్కడ ఎంతపెద్ద మొనగాళ్లయినా జగన్‌ మాట వినాల్సిందే. ఇతర పార్టీల్లో ఎంత హీరోలైనా, మా పార్టీలోకి వస్తే ఎవరైనా జీరోలే.

మేమంతా మా రెడ్డిగార్లు చెప్పింది వినాల్సిందే. వాళ్లే మాకు జగన్‌తో సమానం. వాళ్లను కలిస్తే జగనన్నను కలసినట్లు లెక్క. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చారు కాబట్టి.. ముందు ఒకసారి మా సిలబస్‌ మొత్తం చదివితే, మా పార్టీ ఏమిటో పూర్తిగా అర్ధమవుతుంది. అసలు పెద్ద పెద్దవాళ్లకే మా సిలబస్‌ అర్ధం కాక మధ్యలోనే వెళ్లిపోతున్నారు. కాబట్టి ముందు మమ్మల్ని అర్ధం చేసుకుంటే.. మీకే అన్నీ ఆటోమేటిక్‌గా అర్ధమయిపోతాయని, అన్నీ అర్ధమయ్యేలా చిన్నపాటి క్లాసు తీసుకుని ఊరడిస్తున్నారట. అది విన్న నాని అనుచరులు.. ‘ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయామ’ని, ఎన్టీఆర్‌ పాట పాడుకుంటున్నారట.

LEAVE A RESPONSE