– ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శ
మంగళగిరి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి మూడు గంటల పాటు పెట్టిన ప్రెస్ మీట్, టీడీపీని విమర్శించడం కంటే ఎక్కువగా హిందూ భక్తులను, ఆచారాలను కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడటంపై ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా ఆయన వెంకటేశ్వర స్వామిని, స్వామివారి భక్తులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. హిందూ ధర్మానికి చెందిన విధానాలను చులకనగా మాట్లాడే హక్కు ఆయనకు లేదని, ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల ఆలయంలోని పరకామణి (స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించే చోటు)లో దొంగతనం చేసిన రవికుమార్‌ను జగన్ మోహన్ రెడ్డి సమర్థించడంపై తీవ్రంగా విమర్శించారు.
దొంగతనం చేసిన వ్యక్తి డబ్బు తిరిగి ఇచ్చేస్తానన్నాడు కదా, వాడిని ఎందుకు పట్టుకున్నారని జగన్ ప్రశ్నించడం అంటే, దేవుడి సొమ్ము దొంగిలించడం తప్పు కాదనే సంకేతం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి చోరీ చాలా చిన్న విషయమని జగన్ మాట్లాడటం, భక్తులు కొంగుబంగారం సమర్పించుకునే స్వామివారి హుండీ దోచుకోవడం చిన్న ఇష్యూనా అని ప్రశ్నించారు. కేవలం కొన్ని డాలర్లు దొంగిలిస్తే, రవికుమార్ చేత రూ. 14.5 కోట్లు విలువైన మూడు ప్లాట్లు టీటీడీకి రాయించి, కేసును మాఫీ చేయించడానికి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఎవరు? ఇది వారి తాత జాగీరు కాదని, దేవుడి సొమ్మును దోచుకున్న వ్యక్తితో టీటీడీ రాజీ పడడాన్ని ప్రశ్నించారు.
భక్తులను గురించి వెకిలిగా మాట్లాడటం దారుణమని విమర్శించారు. దొంగను సమర్థించడం, దొంగతనాన్ని మాఫీ చేయడం మరింత పెద్ద నేరమన్నారు. శ్రీవారి లడ్డూ పవిత్రతను కించపరుస్తూ పులివెందుల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి “అదేదో లడ్డూ అంటా” అని వ్యంగ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. లడ్డూ తయారీ కోసం కొనుగోలు చేసిన నెయ్యి కల్తీ స్కామ్‌ను జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని అబద్ధం చెప్పడంపై విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు నెయ్యి నాణ్యత, నిల్వ ఉండకపోవడం గురించి పత్రికల్లో, పోటు కార్మికుల నుంచి వందల ఫిర్యాదులు వచ్చినా, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి దృష్టికి రాలేదంటే వారు అమాయకులా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.
లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ చేయమని ఆదేశించిందని, కూటమి ప్రభుత్వం కాదని గుర్తుచేశారు.
బోలే బాబా డైరీ వంటి కంపెనీలు సరఫరా చేసిన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి విక్రయించారని, దీనిపై సీబీఐ రిపోర్టు కూడా ఉందని తెలిపారు. గత ఐదేళ్లలో నెయ్యి కోసం రూ. 560 కోట్లు ఖర్చు పెడితే, అందులో రూ. 254 కోట్ల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని, ఇది రూ. 350 కోట్ల స్కామ్ అని, దీంట్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్లపై నమ్మకం లేకపోగా, కనీసం చట్టం మీద, కోర్టుల మీద కూడా గౌరవం లేదని స్పష్టమైంది.
సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగిన వ్యక్తికి తగదని విమర్శించారు. పరకామణి కేసులో హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించినా, ఆ కోర్టునే దిక్కరిస్తున్నారని, అలాగే కల్తీ నెయ్యి విచారణకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐ సిట్ ఏర్పాటు చేసింది. కోర్టు తీర్పులను కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
సిట్ వంటి దర్యాప్తు సంస్థల అధికారులను ఉద్దేశించి “వాడు… వీడు” వంటి అగౌరవ పదజాలంతో మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా చిన్న, పెద్ద తేడా లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మీ సంస్కారం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ, సంయమనం కోల్పోయి ఇటువంటి భాషను ఉపయోగించడం తప్పుఅని విమర్శించారు.
మిమ్మల్నీ కూడా వెంకటేశ్వర స్వామి గుడికి ఆహ్వనిస్తున్నాం.. ఆయన కృపకటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటున్నాం.. దయచేసి మా హిందూ దేవుళ్లను చులకనగా చూడటం మానేయండి. ఒక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడిగా దేవుడి పవిత్రత, హిందు నమ్మకాలపై ఎగతాళిగా మాట్లాడటం తప్పు అని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.