Suryaa.co.in

Andhra Pradesh

4 న విజయవాడలో పరవస్తు చిన్నయసూరి కాంస్య విగ్రహావిష్కరణ

•తెలుగు భాషా సదస్సు నిర్వహణ, భాషా వేత్తలకు, సాహితీ వేత్తలకు సత్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు
అమరావతి, ఆగస్టు 2: బాల వ్యాకరణము, నీతి చంద్రిక వంటి ప్రసిద్ద గ్రంధాలను రచించిన గొప్ప రచయిత, సాహితీ వేత్త అయిన పరవస్తు చిన్నయ సూరి కాంస్య విగ్రహాన్ని విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ నెల 4 న ఆవిష్కరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాక్ ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగు ప్రామాణిక బాల వ్యాకరణమునకు శ్రీకారం చుట్టి తెలుగు భాషకు ఒక శాశ్వతత్త్వాన్ని కల్పించిన గొప్ప పండితుడు, రచయిత అయిన చిన్నయ సూరి విగ్రహం ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేకపోవడం ఎంతో దురదృష్టకరమై విషయం అన్నారు.

ఈ లోటును భర్తీ చేస్తూ చిన్నయ సూరి విగ్రహ ఆవిష్కరణకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం సంయుక్తంగా పూనుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ మున్సిఫల్ కార్పొరేషన్ తీర్మానముల ద్వారా ఈ విగ్రహ ఆవిష్కరణకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ నెల 4 వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల నుండి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాతృభాష ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ తెలుగు భాషా సదస్సును కూడా నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుప్రసిద్ద సాహితీ వేత్తలు, కవులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రసిద్ద భాషా వేత్తలను, సాహితీ వేత్తలను ఈ సందర్బంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ సమావేశంలో పద్య పఠనం చేస్తారని, వారందరికీ పరవస్తు చిన్నయ సూరి కవితలు, పద్యాలు, రచనలతో కూడిన పుస్తకాలను బహూకరించ నున్నట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా తెలుగు వాడుక భాషా ఉధ్యమ పితామహుడు అయిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29 న తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా 28 వ తేదీన రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో మంచి రచయితలు, కళాకారుల ను గుర్తించి వారిని సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు.

పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం అద్యక్షులు టి.శోభనాద్రి మాట్లాడుతూ తెలుగు భాషకు శాశ్వతత్త్వాన్ని కల్పించడంలో చిన్నయ సూరి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన రచించిన బాల వ్యాకరణాన్నే ప్రాథమిక స్థాయి నుండి పి.జి. స్థాయి వరకూ నేటికినీ వినియోగించడం జరుగుచున్నదన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలకు ప్రథమ ఆంధ్ర ఉపాద్యాయులుగా నియమించ బడిన పరవస్తు చిన్నయ సూరి పాండిత్యాన్ని గుర్తించిన ఆల్బర్టు నట్ అనే ఆంగ్ల దొర పరవస్తు చిన్నయకు “సూరి” అనే బిరుదును ఇచ్చి గౌరవించారన్నారు.

ఈ సమావేశంలో భాగంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆవిష్కరించ నున్న పరవస్తు చిన్నయ సూరి విగ్రహ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం అద్యక్షులు టి.శోభనాద్రి తదితరులు ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు గాజులపల్లి రామచంద్రా రెడ్డి, విద్యావేత్త ఎన్.వి.రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE