-ఆర్ ఓ బి కోసం ఇళ్లు కోల్పోయిన వారికి పూర్తి స్థాయి పరిహారం ఇవ్వండి
– హిందూ, ముస్లిం స్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించండి
– పెద్దకోట్ల గ్రామస్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
– అన్ని సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్న ఆర్డీఓ మహేష్
ధర్మవరం: నియోజకవర్గంలో పలు సమస్యల్ని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్.. ఆర్డీఓ మహేష్ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండు మూడు రోజులుగా పలు సమస్యలపై ప్రజలు పరిటాల శ్రీరామ్ కు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యల్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ప్రధానంగా కదిరి రైల్వే గేట్ వద్ద (ROB) రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద నిర్మాణం కోసం ఇళ్లు కోల్పోయిన బాధితులకు సరైన పరిహారం అందలేదు.
గతంలో ఈ అంశంలో బాధితుల పక్షాన శ్రీరామ్ పోరాడారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులు ప్రారంభం కావడంతో బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో బాధితులతో కలిసి శ్రీరామ్ ఆర్డీఓని కలిసి సమస్యను వివరించారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నేటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ధర్మవరంలోని హిందూ స్మశాన వాటిక, ముస్లింలకు చెందిన ఖబరస్తాన్ సమస్యల్ని కూడా ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఖబరస్తాన్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో పాటు వర్షపు నీరు లోపలికి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. హిందూ స్మశాన వాటిలో కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. స్థలం కూడా చాలా తక్కువగా ఉందని వివరించారు. పట్టణ సమీప ప్రాంతంలో హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని శ్రీరామ్ ఆర్టీవోను కోరారు.
వీటిన్నింటిపై తహసీల్దార్ ను పిలిపించి ఆర్డీఓ చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. మరోవైపు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపుకు గురైన తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామస్థులకు సరైన పరిహారం దక్కలేదన్న విషయాన్ని కూడా ఆర్డీఓకు వివరించారు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన పరిహారంలో తమకు అన్యాయం జరిగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆర్డీఓ మహేష్… పరిటాల శ్రీరామ్ కి హామీ ఇచ్చారు.