– చంద్రబాబు నాయుడు దూరదృష్టికి దక్కిన అద్భుత గౌరవం
– సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి భారత పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నాయకులు నల్లెల్ల కిషోర్ మరియు పి.బాలరాజ్ గౌడ్ లు హర్షం వ్యక్తం చేశారు. మన జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్ర రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు రాజీలేని పోరాటానికి, అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గొప్ప గౌరవంగా వారు అభివర్ణించారు. సందర్బంగా స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే స్ఫూర్తితో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక అద్భుతమైన రాజధాని ఉండాలనే సంకల్పంతో అమరావతిని ఎంచుకున్నారు. నేడు పార్లమెంట్ సాక్షిగా ఆ నిర్ణయానికి చట్టబద్ధత లభించడం చంద్రబాబు దూరదృష్టికి, విజన్ కి నిదర్శనం అని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో “సైబరాబాద్”ను నిర్మించిన మా నాయకుడు, నేడు అమరావతి నగరంతో మరో మైలురాయి సాధించారు.
పార్లమెంట్ చరిత్రలో అరుదైన చారిత్రాత్మక ఘట్టమని, రాజ్యసభలో 149 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత, మెజారిటీ పార్టీల మద్దతుతో ముజువాణి ఓటు ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకం. రాజధానిపై ఇక ఎలాంటి సందిగ్ధత లేకుండా, భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వం కూడా మార్చడానికి వీలులేని విధంగా చట్టబద్ధమైన రక్షణ లభించడం శుభ పరిణామం అని అన్నారు.
రైతుల త్యాగం మరియు 1630 రోజులు ప్రజలు పోరాడి సాధించుకున్న విజయం అని కొనియాడారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన అమరావతి రైతుల త్యాగం వృధా పోలేదు. ఐదేళ్ల పాటు ఎన్నో అణచివేతలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ రైతులు, మహిళలు చేసిన పోరాటం నేడు ఫలించింది. అమరావతికి దక్కిన ఈ గౌరవం ఆ రైతు బిడ్డలకే అంకితం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును ప్రవేశపెట్టి, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ కి, హోంమంత్రి అమిత్ షా కి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు తెలంగాణ టీడీపీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మా నాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయం తెలుగు ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదన్న ఆయన ఆకాంక్ష నేడు నెరవేరింది. త్వరలోనే అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా వెలుగొందుతుందని మేము ఆశిస్తున్నామని సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జి.అనిల్ కురుమ, తడక వినోద్, పరుశురామ్, భాను ప్రకాష్, సుక్రవేది, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.