Suryaa.co.in

Andhra Pradesh

దేశభక్తి… దైవభక్తితో ప్రకృతిలో మమేకం కావాలి

• ప్లాస్టిక్ రహితంగా.. పర్యావరణహితంగా పర్వ దినాలు జరుపుకొందాం
• రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి: ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం.. పచ్చదనంలో భగవంతుడిని ఆరాధించడం భారతీయ సంప్రదాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వినాయక చవితి, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. వినాయక చవితి, స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను (సీడ్ ఫ్లాగ్స్) ఆయనకు అందచేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “దైవభక్తి, దేశభక్తిని మిళితం చేస్తూ పర్యావరణహితంగా ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ చేసిన ఆలోచన చాలా బాగుంది. ఈ ఆలోచన సమాజహితంగా ఉంది. పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్లాస్టిక్ జెండాలు వాడవద్దు. పర్యావరణహితమైన జెండాలు మాత్రమే వినియోగించాలి” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్ గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు, ప్లాన్ ఏ ప్లాంట్ ప్రతినిధులు గణేష్ అమర్నాథ్, దివ్య అంజని, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE