Suryaa.co.in

Andhra Pradesh

పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం: సుచరిత

గుంటూరు : టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కోవిడ్‌ సమయంలో సీఎం తీసుకున్న నిర్ణయాలకు ప్రశంసలు వచ్చాయన్నారు. కుట్ర ప్రకారం ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారన్నారు.
‘‘డ్రగ్స్‌ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అసత్యాలను వండివార్చి టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వారు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని’’ మంత్రి సుచరిత అన్నారు. ‘‘టీడీపీ నేత నక్కా ఆనందబాబు తప్పుడు ప్రకటనలపై నోటీసులిచ్చాం. పదేపదే బురద జల్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. టీడీపీ వ్యవహార శైలి అనుమానం కలిగిస్తోంది. మీ కార్యకర్తలతోనే మీరు దాడులు చేయించుకున్నారేమోనని అనుమానం ఉంది. విధానపరంగా ప్రశ్నించకుండా.. కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు డైరెక‌్షన్‌లోనే ఇదంతా జరుగుతుంది. మీరే రెచ్చగొట్టి మీరే దాడులు చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. పట్టాభి వ్యాఖ్యలను సభ్య సమాజం హర్షించదు. చంద్రబాబు ఫిర్యాదుపై డీజీపీ స్పందించలేదనడం అవాస్తవం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని’’ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు.

LEAVE A RESPONSE