-పడిన చోటనే తిరిగి నిలబడిన బాబు
-వికృతానందం పొందిన చోటనే జగన్ విషాదం
-బూతులు తిట్టించిన నోటితోనే బ్రతిమిలాడుకున్న దౌర్భాగ్యం
-జగన్ వినతిని పెద్దనమనసుతో మన్నించిన చంద్రబాబు
-ఒక్కరోజుకు జగన్ వాహనానికి అనుమతి
-మంత్రుల తర్వాత ప్రమాణానికి బాబు అంగీకారం
-వెనుక గేటు నుంచి జగన్ వీరోచిత ప్రవేశం
-ఒక అవమానం.. మరో అహంకారానికి సాక్షిగా నిలచిన సభ
( మార్తి సుబ్రహ్మణ్యం)
మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. లేకపోతే కాలమే కాలస్పమై కాటేస్తుంది. నిలువెల్లా అహంకారం-నియంతృత్వాన్ని పులుముకున్న ఒకనాటి పాలకుడు జగన్‌కు ఈ సూత్రం సరిగ్గా సూటవుతుంది. అందుకు తాజా అసెంబ్లీ సమావేశమే సాక్షి. నెలక్రితంవరకూ రాజకీయ ప్రత్యర్ధులను శత్రువుల మాదిరిగా వెంటాడిన వేటాడిన జగన్మోహన్‌రెడ్డి తాజా దయనీయం.. తనను గత పాలకుడు జైల్లో పెట్టి వేధించినా, చివరకు సభలో తన భార్యను కౌరవసభ్యులు అవమానించినా హుందాగా ఆ పాత చేదు జ్ఞాపకాలను మరిచిపోయి.. తనను అవమానించిన అదే జగన్మోహన్‌రెడ్డి వేడికోలును దొడ్డమనసుతో క్షమించిన చంద్రబాబు. ఇవే.. తాజా ఏపీ శాసనసభలో చిరస్థాయిగా నిలిచిపోయే దృశ్యాలు.
నిండుసభలో తన భార్యను అవమానించి.. ఆనక తనతో జీవితంలో తొలిసారి కన్నీరు పెట్టించిన జగన్నాటక సూత్రధారి జగన్మోహన్‌రెడ్డి అభ్యర్ధనను ముఖ్యమంత్రి, సభానాయకుడు చంద్రబాబునాయుడు పెద్దమనసుతో క్షమించారు. మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత.. తొలివరసలో తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న జగన్‌రెడ్డి అభ్యర్ధనను చంద్రబాబు మన్నించారు. దానితో జగన్ మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
నిజానికి జగన్‌కు ఈ సభలో ఎలాంటి ప్రత్యేకతలు, సౌకర్యాలు, ప్రొటోకాల్ ఏమీ లేవు. ఎందుకంటే ఆయన సాధారణ ఎమ్మెల్యేనే కాబట్టి. ఆయన వైసీపీ ఫ్లోర్‌లీడర్ మాత్రమే. సాధారణ ఎమ్మెల్యే మాదిరిగానే జగన్ వాహనాలు కూడా అసెంబ్లీ బయటే ఉంచాలి. కానీ జగన్ అభ్యర్ధన మేరకు తొలిరోజు మాత్రమే లోపలికి అనుమతించారు. దానికోసం జగన్ చాలా పెద్ద పైరవీనే చేసేవారట. ఇది చంద్రబాబు నాయుడు పెద్దరికానికి.. జగన్‌రెడ్డి చిల్లరతనానికి నిలువెత్తు నిదర్శనం.
కొత్తగా కొలువుతీరిన సభలో మరో విశేషం. అది చంద్రన్న శపథం! తన భార్యను నిండుసభలో కౌరవులతో తట్టిపోస్తుంటే.. మందలించాల్సింది పోయి.. వారి బూతులను ఆనందిస్తూ వికటాట్టహాసం చేసి, వికృతానందనం పొందిన జగన్‌రెడ్డి శాడిజంపై శివమెత్తిన చంద్రబాబు.. తాను మళ్లీ సీఎంగానే ఈ సభకు వస్తానని ప్రతిన చేసి, సభను బహిష్కరించారు.
దానిని కూడా ఎద్దేవా చేసిన వైసీపీ కౌరవ సభ్యులు, ఇక చంద్రబాబు జన్మలో సీఎం కాదు కదా.. కుప్పం ఎమ్మెల్యేగా కూడా గెలవడని అవహేళన చేసిన దురహంకారం అందరికీ గుర్తుండే తీరాలి. ఇప్పుడా దుశ్శాశనులెవరూ సభలోకి అడుగుపెట్టలేదు.
సీన్ కట్ చేస్తే.. చాణక్యశపథం చేసిన ఆ చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా రాష్ట్రం చుట్టి, అధికారంలోకి వచ్చి.. మళ్లీ అదే సభలో శాసనసభాపక్ష నేతగా గెలిచి నిలిచారు. అలా.. ‘పట్టువదిలిన’ విక్రమార్కుడిలా చంద్రబాబు చిద్విలాసం చిందిస్తూ, ముకుళిత హస్తాలతో సభ్యులకు నమస్కరిస్తూ లోపలికి అడుగుపెట్టారు.
అదే చంద్రబాబును అవ హేళన చేయించిన జగన్‌రెడ్డి స్థానం, ఇప్పుడు ఎక్కడో తెలియని దురవస్థ. మంత్రుల తర్వాత తనను ప్రమాణ స్వీకారం చేయించమని దేబిరించే దుస్థితి. ఒక్కరోజుకు తన కారును లోపలికి అనుమతించండి… ప్లీజ్ అని, దీనంగా వేడుకునే దయనీయం. ప్రమాణస్వీకారం కూడా తడబడుతూ.. చివరకు తన పేరు చివర రెడ్డిని కూడా మరిచి, మళ్లీ తత్తరపడి సర్దుకున్న వైచిత్రి. ఇంతకాలం బతికి ఇంటివెనక.. ఏదో అన్నట్లు.. ఐదేళ్లు సగర్వంగా అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి వెళ్లిన జగన్.. ఇప్పుడు వెనుక నుంచి వెళ్లడం మరో విషాదం.
కాలం ఎల్లకాలం ఎవరి పక్షాన ఉండదు. విజయలక్ష్మి పర్మినెంట్‌గా ఎవరి భుజాలపై భేతాళుడిలా ఫెవికాల్ మాదిరిగా ఉండిపోదు. అధికారం ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటేనే లోకం హర్షిస్తుంది. మనిషిలో మంచి-మర్యాద-మానవత్వం ఉన్న వారిని సమాజం గౌరవిస్తుంది. సదరు వ్యక్తి కష్టకాలంలో ఉంటే సానుభూతి ప్రదర్శిస్తుంది.
అందుకు భిన్నంగా.. ఎదుటివారిని అనాగరికంగా-అమానుషంగా-అరాచకంగా వేటాడి వేధించి.. వికృత-పైశాచికానందం పొందితే, తదనంతర పరిస్థితులు జగన్ ఎదుర్కొనే విషాద ంగానే ఉంటుంది. ఇది అధికారంలో ఉండేవారందరికీ ఒక గుణపాఠం. అందుకు ఎవరూ మినహాయింపు కాదు.