Suryaa.co.in

Editorial

కేసీఆర్‌కు షాక్

– కాంగ్రెస్ గూటిలో పోచారం
– రేవంత్‌ను ఆకాశానికెత్తిన పోచారం
– మరో 20 మంది కాంగ్రెస్ వైపు?
– మరికొందరు టీడీపీ వైపు?
– టీడీపీలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు
– బీఆర్‌ఎస్ శాసనాసభపక్షం కాంగ్రెస్‌లో విలీనం?
– బీఆర్‌ఎస్‌లో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లానేనా?
– శరవేగంగా మారుతున్న పరిణామాలు
– ‘కారు’ బేజారు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాలం కర్మం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుంది. అందుకు ఎవరూ మినహాయింపుకాదు.పదేళ్లు తెలంగాణను ఒక సామ్రాజ్యంగా మార్చిన కేసీఆర్, ఇప్పుడు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి కాంగ్రెస్‌కు జైకొట్టారు. అటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిదీ అదే దారి. అసలు బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం మొత్తం కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రమాదం. అందులో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా ‘కారు’లో కల్లోలం.

ప్రధాని రేసులో తానూ ఉన్నానని సగర్వంగా చాటుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేతి నుంచి, కారు స్టీరింగ్ జారిపోతున్న పరిస్థితి. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటుకూ దిక్కులేని విషాద పరిస్థితిలో ఉన్న బీఆర్‌ఎస్‌కు.. సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఝలక్ ఇచ్చారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికెళ్లి కాంగ్రెస్ కండువా కప్పేశారు. తనయుల సహా కాంగ్రెస్ తీర్ధం తీసుకున్న పోచారం కూడా.. తాను సొంతింటికి వెళ్లానని సగర్వంగా చెప్పారు. ఆయన ప్రయతాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆందోళనలు ఏమీ ఫలించలేదు.

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన, పోచారం లాంటి నాయకుడే జంప్‌జిలానీ లిస్టులో జాయినయిన తర్వాత.. బీఆర్‌ఎస్ నావ మునిగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి సమాచారం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు కారు దిగి, కాంగ్రెస్‌కు జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. మిగిలిన వారు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారట.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఎక్కువమంది టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరు బీజేపీ కంటే, టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారట. మాజీ ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధమై, చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ అడిగినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో కాంగ్రె స్ కేసీఆర్ దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉండగా కాంగ్రెస్, టీడీపీ శాసనసభాపక్షాన్ని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సుమారు 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో, కాంగ్రెస్ దూతల మాట ముచ్చట పూర్తయిందంటున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఫిరాయింపుల పర్వం పూర్తయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

అయితే మరికొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటం, టీడీపీ బలంపైనే కేంద్రంలో బీజేపీ సర్కారు మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో.. టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం హైదరాబాద్, రంగారెడ్డి బీఆర్‌ఎస్ నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక మాజీ ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం, ఇప్పటికే సంకేతాలు పంపించినట్లు సమాచారం.

బీజేపీలో చేరటం ఇష్టం లేని ఈ ఎమ్మెల్యేలంతా, టీడీపీలో చేరడమే ఉత్తమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బుధవారం సదరు మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తాజా సమాచారం. కేసీఆర్ సర్కారులో మంత్రిగా పనిచేసిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన అల్లుడు ఈపాటికే చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.

ఆయన తనను టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే, తెలంగాణ పార్టీ వ్యవహారాలు తానే చూసుకుంటానని బాబుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఏపీలో అధికారుల బదిలీలపై దృష్టి సారించినందున, ఈవారంలో తెలంగాణపై దృష్టి సారిస్తారంటున్నారు.

ప్రస్తుత పరిణామాలు పరిశీలిస్తే.. శాసనసభలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మినహా ఎవరూ బీఆర్‌ఎస్‌లో మిగిలే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్తానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే, బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఎంపి బండి సంజయ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE