– హోం మంత్రి సుచరిత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక స్థిరమైన విధానంతో లేరని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖలో పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షపై స్పందించారు. బీజేపీతో జతకట్టిన నేతగా పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో దీక్షలెందుకు చేస్తున్నారనేది అర్ధం కావట్లేదన్నారు. మిత్రపక్షంగా కేంద్రంతో మాట్లాడి ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ప్రతిపాదనను నిలిపివేయవచ్చు కదా అని మంత్రి ప్రశ్నించారు.
బీజేపీతో జనసేన మిత్రుత్వమా శత్రుత్వ విధానమా..తెలియజెప్పాలని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో సమప్రాధాన్యతకే అమరావతి, విశాఖపట్నం, కర్నూలు వంటి నగరాల్లో మూడు రాజధానులు ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా కాకుండా పూర్తిగా తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడా చెప్పలేదన్నారు. ఇక్కడ కూడా ఒక రాజధాని ఉంటుందని చెప్పినప్పటికీ కొందరు పెట్టుబడిదారులు ఉద్యమిస్తున్నారని మంత్రి అన్నారు.
చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమనే బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదంతోనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. రాజకీయ లబ్ధితోనే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. అమ్మవడి, ఆసరా, చేయీత, చేదోడు, రైతుభరోసా వంటి ప్రజాప్రయోజనకర సంక్షేమ పథకాలను రాజకీయ, కులమతాలకతీతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో ఇంట్లో ఐదారు సంక్షేమపథకాలు పొందుతున్నని లబ్ధిదారులే చెప్పడం గర్వంగా ఉందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ప్రజలు చీకటి రోజులు అనుభవించారని… కరువు, ఆయన కవల పిల్లలని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పాలనకు తపన పడుతూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంలో అంతరార్థం ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందన్నారు. వ్యవసాయం దండగన్న బాబు…ఈరోజు రైతుల కోసం మొసలికన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి గా డాక్టర్ వైఎస్ఆర్ రైతుల గుండెల్లో దేవుడుగా నిలిచిపోయారని గుర్తుచేశారు. నేడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో రైతులు పండగ చేస్తున్నారని అన్నారు.