Suryaa.co.in

Editorial

ఎన్డీఏ భేటీకి పవన్‌కు ఆహ్వానం

– 18న ఎన్డీఏ భాగస్వాముల భేటీ
– భేటీకి వెళ్లనున్న పవన్‌
– నాదెండ్లకు అందని ఆహ్వానం?
– ఆయనకూ ఆహ్వానం పంపాలని కోరిన పవన్‌?
– టీడీపీ, అన్నాడిఎంకె సెల్వంకు అందని ఆహ్వానం
– దూరమైన అకాలీదళ్‌కూ పిలుపు
– మహారాష్ట్రలో చీలికవర్గాలకూ ఆహ్వానం
– బీజేపీకి తెలుగు రాష్ర్టాల్లో జనసేన ఒక్కటే మిత్రపక్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి బలపడే దిశగా అడుగు లేస్తోంది. అందులో వివిధ కారణాలతో, తనకు దూరమైన పాత మిత్రులతో మళ్లీ జతకట్టేపనిలో ఉంది. అయితే ఆయా రాష్ర్టాల్లో పార్టీపరంగా ఉన్న అనిశ్చితి, ఇతర పార్టీలతో ఉన్న మొహమాటాల కారణంగా, కొందరు పాతమిత్రులను దూరంగా ఉంచింది. అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం పంపించగా, పాత మిత్రపక్షమైన టీడీపీకి మాత్రం ఇప్పటిదాకా ఆహ్వానం అందనట్లు సమాచారం.

ఈనెల 18న జరగనున్న ఎన్డీఏ భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తనకు దూరమైన అకాలీదళ్‌ను, తాజా ఎన్డీఏ భేటీకి ఆహ్వానించింది. ఇక తమిళనాడులోని అన్నాడిఎంకెలోని రెండు చీలిక వర్గాల్లో, మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం నాయకత్వం వహించే చీలిక వర్గానికి ఆహ్వానం పంపలేదు. మహారాష్ట్రలో ఇటీవల ఎన్‌సిపి నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏ మంత్రివర్గంలో చేరిన అజిత్‌పవార్‌, శివసేన నుంచి బయటకు వచ్చిన సీఎం షిండేకు ఆహ్వానం పంపించారు.

ఇక ఏపీలో తొలి నుంచీ తనతో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పంపింది. అయితే ఆయన వెన్నంటి ఉండే పార్టీ కీలక నేత, నాదెండ్ల మనోహర్‌కు మాత్రం ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. దానితో మనోహర్‌కూ ఆహ్వానం పంపాలని పవన్‌ బీజేపీ నాయకత్వాన్ని కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఎన్డీఏ పాతమిత్రుడైన టీడీపీకి మాత్రం ఇప్పటిదాకా ఆహ్వానం పంపలేదు. తెలంగాణ, కర్నాటక నుంచి కూడా ఎవరినీ ఆహ్వానించలేదు. దీని ప్రకారం ఎన్డీఏకు జనసేన మాత్రమే ఏకైక మిత్రపక్షమన్న సంకేతాన్ని బీజేపీ పంపించినట్లయింది. ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భేటీ అయిన క్రమంలో, టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. అదంతా ఉత్తిదేనని స్పష్టమయింది.

LEAVE A RESPONSE