గోదావరి జిల్లాలో వారాహి యాత్ర నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ సత్యదేవుని దర్శించుకొన్న అనంతరం భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు.
జనసేన వారాహి విజయ యాత్ర ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్వామి వారి దర్శనంతో యాత్రకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ దేవుని దర్శనం కోసం వస్తున్నారని తెలుసుకుని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అశేషంగా కొండ వద్ద బారులు తీరారు.
ఈ యాత్రకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అన్నవరంలోని ఆలయానికి ఉదయం 10 గంటలకు రత్నగిరి శ్రీ సత్యదేవుని సన్నిధికి పవన్ కల్యాణ్ చేరుకొన్నారు. తొలుత సత్యదేవుని సన్నిధిలోని త్రిమూర్తులకు, ఆ తర్వాత సత్యదేవుడి పాదాల చెంత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి తన మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ధ్వజస్తంభం సమీపంలో ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు వేదాశీర్వచనాలు అందచేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యదేవుని పటం అందించారు.