– జగనన్న కాలనీల నిర్మాణాలు చూడండి
– కుప్పం తో సహా ఎక్కడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధం
– చంద్రబాబు ఎవరిని కలుపుకొని వచ్చినా 175 సీట్లు మావే
– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
ఏలూరు, : రాష్ట్రంలోని ప్రతీ పేద గడపకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం జగనన్న ఇళ్ల ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూరాష్ట్రంలో జగనన్న ఇళ్ళు జగనన్న ఊళ్లను తలపిస్తున్నాయన్నారు. వాటిని చూడడానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలన్నారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 5 జగనన్న కాలనీలలో 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలంతోపాటు ఇల్లు నిర్మించే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంపై బురద జల్లుతూ ఇళ్ల స్థలాలపై కోర్టులలో కేసులు వేస్తున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించిన రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక యజ్ఞంలా చేపట్టారని, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో నిర్దేశించిన సమయంలోగా జగనన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధిపై, కుప్పం తో సహా ఎక్కడైనా జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ విజిటింగ్ వేసిన మీద ఆంధ్రకు వస్తుంటారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో సహా ఎంతమంది కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి వచ్చినా రాష్ట్రంలోని 175 స్థానాలు వైయస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
జగనన్న కాలనీలలో ఎక్కడా చిన్నపాటి లోపాలు లేకుండా రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించి, జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. జగనన్న ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను ఈ నెలలో చెల్లిస్తామన్నారు. జగనన్న ఇళ్ల పథకంపై అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమగ్రంగా చర్చించామని, వారు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. . జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్ట్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జోగి రమేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు, వి ఆర్ ఎలిజా, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.