Suryaa.co.in

Features Political News

సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్

– హిందూ సనాతన ధర్మం’ అంటూ ఏమీ లేదు
– ధర్మం అంటే నియమం.. మతం కాదు
– హిందు అనబడేది భౌగోళిక గుర్తింపు
– సనాతన ధర్మం ప్రతి జీవికీ వర్తిస్తుంది
– వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థగా మార్చి సనాతన ధర్మం గొప్పతనాన్ని నాశనం చేశారు
(టి.వి.గోవిందరావు)

నేడు దక్షిణ భారతంలో ప్రతీ వారి నోటా వినిపిస్తున్న పదం సనాతన ధర్మం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుణ్యమా అని, తిరుపతి లడ్డూలలో కల్తీ నేతితో ఈ సనాతన ధర్మం వెలుగులోకి వచ్చింది.

సనాతన ధర్మం భారత దేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సంస్కృతి. ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతులలో కెల్లా అతి పురాతన, ప్రాచీనమైన సంస్కృతి. సనాతనం అంటే శాశ్వతమైనది, ధర్మం అనగా ఆచరణీయ కార్యం. సనాతన ధర్మం అంటే మతం కాదు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక జీవన విధానం. ఈ జీవన విధానం ఏ వ్యక్తి, వ్యక్తుల ఆలోచనల చేతనో ఏర్పడలేదు లేదా స్థాపించబడలేదు.

ఈ ధర్మానికి మూలం సృష్టికర్త అని భావించారు, ఎందుకంటే సనాతన ధర్మ మూలాలు వేద కాలపురికతకు సంబంధించినవి. వేదాలలో రహస్య ఆత్మ జ్ఞానాన్ని సృష్టి ప్రారంభంలో దేవతలకు, జనులకు పంచారు. వేదాలలో ప్రస్తావించబడిన సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక మూలాలు స్వర్గంలో, భూమిపై విస్తరించి ఉన్నాయి.

ప్రాచీన కాలంలో పర్షియా రాజ్య సరిహద్దులు దాటి భారత దేశములో ఉత్తర భూభాగాన ప్రవహిస్తున్న ‘సింధు నది’ ఒడ్డును చేరుకున్న పర్శిలు ఇక్కడి ప్రజలు ‘హిందువులు’ అని, భారత ఉపఖండాన్ని ‘హిందుస్తాన్’ అని పిలిచేవారు. ఎందుకంటే పర్శి భాషలో ‘స’ అనే అక్షరం లేదు దానికి బదులుగా ‘హ’ అనే అక్షరం వారు ఉపయోగించేవారు.

భారత దేశ భూభాగంలో దేవతలను ఆరాధించే విధానములు, ఆచార వ్యవహారములు, వైదిక కర్మలు పరిశీలించి, వేదాలను అనుసరించి దైనందిక జీవన విధానం, మనిషి మనుగడ సాగించేది కాబట్టి సనాతన ధర్మాన్ని ‘మతం’ అనే అభిప్రాయంతో ఉండేవారు. ఆ కారణం చేతనే సనాతన ధర్మం హిందూ మతంగా పరిగణలోకి వచ్చింది.

సనాతన ధర్మాన్ని జీవన శైలి అనే స్థాయి నుండి కేవలం ఒక మతం అనే స్థాయికి పరిమితం చేసి, భారత దేశ అస్తిత్వానికి మూల ఆత్మ అయిన సనాతన ధర్మం అనే ప్రత్యేకమైన సంస్కృతికి నష్టం చేకూర్చారు. అందువల్ల భారత దేశంలో ప్రతి ఒక్కరినీ హిందువుగా గుర్తించేవారు. కానీ ఇప్పుడు వేదాల ఆధారంగా జీవన విధానాన్ని ఆచరించే వారిని మాత్రమే, హిందువు అని పిలుస్తున్నారు.

సనాతన ధర్మ వేద సంపద అమూల్యమైనది. వేదం అనే పదం, సంస్కృత పదం ‘విద్’ అనే ధాతువుకు ‘తెలియుట’ అన్న అర్థం పుట్టింది. వేదములు సృష్టికి ముందు నుండే ఉండి, కాలక్రమేణా భగవంతుని ద్వారా మహర్షులకు వారి ధ్యాన, తపో బలముల వలన ‘తెలుపబడినవి’ అని, అవి ఏ మానవుల చేతనూ రచింపబడలేదు అని విశ్వాసము.

కనుకనే వేదాలను ‘అపౌరుషేయములు’ అని కూడా అంటారు. అంటే మానవ మాత్రుడు చెప్పింది కాదు అని అర్థం. వేదములను తెలుసుకున్న ఋషులను, ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.

సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం, వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని అంటారు. ఈ వేదాలు – వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి.

వర్ణ ఆశ్రమ ధర్మం –
వేదాలను అనుసరించి సంప్రదాయ సనాతన సమాజం నాలుగు వర్ణాలుగా విభజించబడింది. అవి:
* బ్రాహ్మణ
* క్షత్రియ
* వైశ్య
* శూద్ర

– భగవద్గీత బోధన అప్పుడు కూడా శ్రీ కృష్ణుడు “చాతుర్వర్ణ్యం” అని పలికాడు. జన్మతః / పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రులు అంటే సామాన్యులు. వారివారి గుణ గణాలను బట్టి వర్ణం వర్తిస్తుంది.
– సంస్కారం లేదా అభ్యాసం వల్ల ద్విజులు అంటే వృత్తిదారులు. వృత్తి ద్వారా వ్యాపారాలు సాగించేవారు కాబట్టి వైశ్యులు అవుతారు.
– విద్య వల్ల విప్రులు అంటే విద్వాంసులు. రాజ్య పాలన చేయు నైపుణ్యం సంపాదించుట వలన క్షత్రియులు. భుజ బలంతో, క్షత్ర వీర్యంలో రాజ్య పాలన చేయగలరు నాలుగు వర్ణాలలో ఎవరికి పుట్టినా సరే క్షత్రియుడే అవుతాడు.
– బ్రహ్మ జ్ఞానం వల్ల బ్రాహ్మణులు. బృహత్వం అంటే బ్రహ్మ విద్య నేర్చిన వాడు మరియు అనునిత్యం వేద ధర్మాలను పాటిస్తూ బ్రహ్మ (వేద) కర్మలను చేయువాడు. అలాంటి వారు మాత్రమే బ్రాహ్మణులు

అన్న వివరణతో మనుషుల్లోని నాలుగు విభాగాల్ని సూచించే మాట “చాతుర్వర్ణ్యం”. విభజించేందుకు ఉపయోగించే నాలుగు విభాగాలను సూచించే పదం వర్ణం. ఈ వర్ణక్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను తెలియచేస్తుంది.
ఆశ్రమం అంటే నివసించే ప్రదేశం లేదా నిలయం. ఆశ్రమ ధర్మం అనేది మనిషి జీవితంలోని నాలుగు దశలను తెలియకుండా చేస్తుంది.
అవి:
– బ్రహ్మచర్యం – ఇంద్రియ నిగ్రహము ఆచరించి, పెద్దల పట్ల గౌరవము, గురువుల యందు భక్తి, శ్రద్ధలతో విద్య నేర్చుకొను దశ.
– గృహస్తం – తల్లి, తండ్రి సేవ చేస్తూ ఏకపత్ని వ్రతుడుగా ధర్మ సంతానము కలిగి, అతిధి మర్యాదలు పాటిస్తూ ఆచార వ్యవహారములు నడిపించు దశ.
– వానప్రస్తం – వయో భారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మల యందు వాంఛ వీడి సంతానమునకు వ్యవహారములు అప్పగించే దశ.
– సన్యాసం – మోక్ష ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ అధ్యాత్మిక చింతనతో భగవంతుడిని స్మరించుకుంటూ జీవనం సాగించే దశ.
మనిషి ఎప్పుడు, ఏమి చేయాలి అనేది కేవలం మనిషి ఆత్మస్థితిని బట్టి కాకుండా దేహ వయోస్థితి మీద కూడా ఆధార పడి ఉంటుంది. అందుకే వర్ణ ఆశ్రమ ధర్మం అని పిలుస్తారు.

కులం అంటే వంశం
ఉదాహరణకు: ఇక్ష్వాకు కుల తిలక – అంటే : ఇక్ష్వాకు వంశోద్ధారకా అని అర్ధం.

తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాల పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరగా కొనసాగేవి. వంశపార పర్యంతం పాటించబడే ఒక సామాజిక ఆచారం. నిజానికి గోత్ర నామాలే ఇంటి పేర్లు. అదే ఒక వ్యక్తి వంశాన్ని తెలియచేస్తుంది. ఇప్పుడు అమలో ఉన్న ఇంటి పేర్లు అనేవి ఊరు పేరు లేదా వివిధ కారణాల చేత సృష్టించబడినవి మాత్రమే.

ఒక వ్యక్తి చేసే పని ఆధారం చేసుకొని, అతనికి ఒక వర్ణం కేటాయించబడింది. అలా అలాంటి పనే చేసే వాళ్ళని అందరిని కలిపి వర్గీకరించారు. ఆ వర్గం ఆ పనిలో నిష్ణాతులు కాబట్టి ఆ వర్గంలోని వారు తమ పిల్లలకు అదే పని నేర్పడానికి కారణం, వారికి ఉపాధిని కలిగించే విద్య నేర్పించాలి. అంటే విద్య నేర్పిన గురువుకు ధనం రుసుముగా చెల్లించాలి.

కావున ఆర్థిక స్థోమత లేకపోవడం చేత తాము నిష్ణాతులైన వారికి కనీసం ఆ పనిని నేర్పించండి. కానీ ఆ పని చేసి బ్రతుకుతారు అని కాదు. కొంతమంది తమ స్వార్థ స్వప్రయోజనాల కోసం వర్ణ వ్యవస్థను కాస్త ఈ రోజు భారత దేశ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థగా మార్చి సనాతన ధర్మం గొప్పతనాన్ని నాశనం చేశారు.

ఒక మనిషి పుట్టుక కాదు. అతని గుణ, గణాలు నిర్ణయిస్తాయి. అతను ఏ వర్ణ వ్యవస్థకి చెందుతాడో. ఒక మనిషికి పుట్టిన అంత మాత్రాన రాజు, బ్రాహ్మణుడికి పుట్టిన అంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు. దానికి “పండిత పుత్ర పరమ శుంఠ హ !” అనే నానుడి ఒక గొప్ప ఉదాహరణ.
వర్ణ వ్యవస్థ మనిషి చేసే పనిని, కుల వ్యవస్థ మనిషి పుట్టుక(వంశం) తెలియకుండా చేస్తుంది.

హిందూ సనాతన ధర్మం’ అంటూ ఏమీ లేదు. అది ‘సనాతన ధర్మం’ అంతే. ‘సనాతన’ అంటే, శాశ్వతమైనదని అర్ధం. శాశ్వతం అంటే ఎప్పటికీ ఉండే సత్యం అని అర్ధం.

ఈ ఉనికికే ఆధారమైన సనాతన ధర్మం అనేది, జీవితంలోని ఎప్పటికీ మారని పార్శ్వానికి సంబంధించింది. ఒక వానపాము, కీటకం, పక్షి లేదా ఒక మొక్క, ఏదైనా సరే, అన్నిటికీ ఈ ఉనికికి వర్తించే ప్రాథమిక నియమాలే వర్తిస్తాయి. అదే సనాతన ధర్మం.

మనిషిపై మనిషి నియంత్రణ కోసమో, సమానత్వం కోసమో సంఘంలో పెట్టుకున్న శిక్షాస్మృతులు కావు ఇవి. ఎందుకంటే, ఆ లావాదేవి చట్టాలు తరతరానికీ మారిపోవాల్సి ఉంటుంది. అది వేరే విషయం. మనం మాట్లాడేది లావాదేవిచట్టం గురించి కాదు. మనం మాట్లాడేది ఎప్పటికీ నిలిచి ఉండే ధర్మం గురించి. మీరెక్కడున్నా భారతీయుడైనా, హిందువైనా కాకున్నా సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది.

ముందుగా మనం ధర్మం అనే పదాన్ని అర్ధం చేసుకుందాం. ధర్మం అంటే, నియమం. ధర్మం అంటే, మతం కాదు. ఈ సంస్కృతిలో మనకి మతం అంటే ఏమిటోటో తెలియదు. మనకి తెలిసిందల్లా, మన జీవితం ఉత్తమంగా నడవటానికి, అంతర్లీనంగా ఉన్న నియమాలు మాత్రమే.

ఎందుకంటే, ఆ నియమాలకి కట్టుబడి ఉండకపోతే, మన జీవితం సరిగ్గా సాగదని మనం అర్థంచేసుకున్నాము.ఈనియమాలు మన మీద ఆపాదించినవి కావు. అవి మన ఉనికికి ఒక పునాది, ఒక ఆధారం. మీరు వీటిని సరిగా అర్ధం చేసుకుంటే, జీవితం హాయిగా సాగిపోతుంది. ఎందుకంటే, మీకు ఎలా ఉండాలో తెలిసింది కనుక.. దానికి మీరు కట్టుబడి ఉంటారు కనుక. మీకు అది తెలియకపోతే మాత్రం, అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు.

సనాతన ధర్మం హిందువులకి సంబంధించిందా? భారతీయులకి సంబంధించిందా? లేదా ఇంకొకరికి సంబంధించిందా? – అది కాదు అసలు విషయం. మీరు ఎక్కడున్నా, మీరు భారతీయులైనా, హిందువులైనా, వేరేమతస్తులైనా, మీరుఇంకేదైనా, సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ నియమాలు మన ప్రాథమిక జీవ ప్రక్రియకుమార్గదర్శకాలు.

ఏ సంస్కృతీ కూడా దీనివైపు, మనం చూసినంత లోతుగా చూడలేదు. అందుకే మనం, గొప్పగా, ఇది ‘హిందూ సనాతన ధర్మం’ అని అంటూ ఉంటాము. కానీ మనం ఈ రోజున ‘హిందు’ అనే పదం వాడి, సనాతన ధర్మం యొక్క విస్తృతిని తగ్గిస్తున్నాము.

హిందు అనబడేది భౌగోళిక గుర్తింపు. హిందుమహాసముద్రానికీ- హిమాలయాలకీ మధ్య ఉన్న భూభాగమే ‘హిందు’. సనాతన ధర్మం ప్రతి జీవికీ వర్తిస్తుంది. సనాతన ధర్మం జీవితంలో వివిధ అంశాలను, పుట్టబోయేవారిని, పుట్టినవారిని, ఎదిగినవారిని, జీవితంలో వివిధ దశల్ని, చివరికి చనిపోయిన తర్వాత కూడా ఎలా నిర్వహించుకో వాలో తెలుపుతుంది.

LEAVE A RESPONSE