– కాకినాడ్ సెజ్ లో రైతుల భూములను తిరిగి ఇచ్చిన ఘనత వైయస్.జగన్ దే
– 2021 జూలైలో జీవో నెంబరు 158 ద్వారా రైతుల భూములు అప్పగింత
– మా జీవో అమలుకై మెమో జారీ చేసిన కూటమి ప్రభుత్వం
– చిత్తశుద్ధి ఉంటే రైతులకు మిగిలిన కేసులను ఎత్తివేయండి
– మా ప్రభుత్వంలో చట్టం చేసిన స్థానికులకు 75 శాతం కోటా అమలు చేయండి
– కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ నేతలు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత
కాకినాడ:రాష్ట్రంలో ఎవరు మంచి చేసినా అది నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాటిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత మండిపడ్డారు.
కాకినాడలో కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కాకినాడ సెజ్ భూములపై మీడియాతో మాట్లాడుతూ… కాకినాడ్ సెజ్ భూములను రైతుల వెనక్కి ఇస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబరు 158 ద్వారా నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. అదే జీవోను అమలు చేయడానికి కేవలం మెమో మాత్రమే జారీ చేసిన కూటమి ప్రభుత్వం… ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తశుద్ధి ఉంటే ఇంకా అక్కడక్కడా రైతులపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవడంతో పాటు వైయస్. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం కోటా ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును మించి ఆయన తనయుడు లోకేష్ తండ్రి కంటే పచ్చి అబద్దాలు ఆడుతున్నారు.
కాకినాడ సెజ్ విషయంలో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్దాన్ని వండి వార్చుతుంది. వారికి వంత పాడుతూ దాన్నే నిజమని నమ్మించడానికి ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీ ప్రయత్నిస్తోంది. ఎస్ ఈ జెడ్ భూములు రైతులకు తిరిగి ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు వైయస్.జగన్ పిఠాపురం సభలో ఎక్విజేషన్ కాని భూములన్నింటినీ రైతులకు తిరిగి అప్పగిస్తామని మాట ఇచ్చారు. దీనికోసం ఆయన కేబినెట్ లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న నన్ను చైర్మన్ గా ఒక కమిటీని కూడా నియమించారు.
ఆ కమిటీ పలు దఫాలు సమావేశమై రైతులు, సంస్దలు, అధికారులు, కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంతో పాటు రాజమండ్రి, కాకినాడలో సమావేశమయింది. పలు దఫాల సమావేశాల అనంతరం జూలై 6 2012న జీవో నెంబరు 158 విడుదల చేసాం. దీని ప్రకారం 2180 ఎకరాల భూమిని రిజిష్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా వెనక్కి ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా తామే పిఠాపురం, తుని నియోజకవర్గాలకు సంబంధించిన ఈ భూములను తానే వెనక్కి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోంది.
14-10-2025 నాడు ఈ ప్రభుత్వం ఒక మెమో జారీ చేస్తూ… అందులో జూలై 6, 2021 న ఇచ్చిన జీవో నెంబరు 158 అంటే వైయస్.జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రైతులకు కాకినాడ ఎస్ ఈ జెడ్ భూములను తిరిగి అప్పగిస్తూ ఇచ్చిన జీవోనే.. అమలు చేయండని కేవలం మెమో మాత్రమే ఇచ్చింది. అంతే తప్ప కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకోలేదు.
గడిచిన నెల రోజులుగా కాకినాడ జిల్లాలో డైవర్షన్ సమావేశాలు, కూటమి నేతల హడావుడి చూస్తున్నాం. కాకినాడ సెజ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంద రోజుల గడువు కావాలని అడిగారు. నిజానికి ఈ సమస్య వారం రోజుల్లో పరిష్కారమయ్యే ఒప్పందాన్ని గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఆయా కంపెనీలతో చేసుకున్నారు. పనులు కూడా మొదలయ్యాయి.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుని…వైయస్.జగన్ హయాంలో చట్టం చేశాం. కూటమి ప్రభుత్వం ముందు దాన్ని అమలు చేయాలి.
సెజ్ కు సంబంధించిన చంద్రబాబు హయాంలో పెట్టిన కేసులన్నీ వైయస్.జగన్ హయాంలో కేసులు ఎత్తేశాం. ఇంకా కొన్ని చోట్ల సాంకేతిక పరమైన కారణాల వల్ల సెజ్ పోరాట నేతల మీద కేసులు ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిని తొలగించండి. వందలాది హేచరీస్ ఉన్నాయి.. వాటిని కాపాడ్డంతో పాటు సముద్రంలో పొల్యూషన్ కలవకుండా ఉండడానికి అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశాం . అక్కడే ఏర్పాటు అవుతున్న దివీస్ సంస్థ కాలుష్యాన్ని నియంత్రించాలి.
సముద్రంలో వ్యర్ధాలు వదిలితే మత్స్యకారులకు నష్టం కలుగుతుంది, హేచరీస్ కు కూడా నష్టం కలుగుతుందని.. వ్యర్ధాలను ప్రాసెస్ చేసి, ప్యూరిఫై చేసి దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టాలని ఆదేశించాం. ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం. అంతేకాకుండా దివీస్ సంస్థ తీసుకున్న అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.3 లక్షలు చెల్లిస్తుంటే… రూ.10 లక్షలు చెల్లించాలని వైస్.జగన్ ఆదేశించారు. ఇది నిజం కాదా?
ఇటీవల పోరాట కమిటీ నాయకులతో కూడా ప్రెస్ మీట్ పెట్టాం. జిమ్మార్, కేవీరావులకు చంద్రబాబు నాయుడు సహకరించడమే ఈ మొత్తం దుర్మార్గాలకు కారణమని స్పష్టం చేశాం. భూములు రైతుల వద్ద ఉండగానే ఆ రికార్డులను ఐసీఐసీఐలోనూ, ఎల్ ఐ సీలోనూ దఖలు పెట్టి జిమ్మార్ కంపెనీ రూ. 2,500 కోట్లు రుణాలు తీసుకున్నారు.
రైతులకు ఎకరాకు రూ.3 లక్షలిచ్చి, వారి భూమి దఖలు పడకుండానే అప్పు తెచ్చారు. కేవీ రావు కూడా బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ.6 వందల కోట్లు రైతుల భూముల మీద అఫ్పు తెచ్చారు. వాటి మీద ఎందుకు విచారణ చేయడం లేదు?