Suryaa.co.in

Political News

పవన్‌ ప్రస్థానం .. సినీ హీరో టు పొలిటికల్ విలన్

( డీవీవీఎస్‌ వర్మ )

పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో అనేక హీరో పాత్రలు పోషించారు. రాజకీయాలలోనూ ఆయన బహుపాత్రధారి కావడం ఆశ్చర్యాన్ని కలిగించదు. రాజకీయ ఆరంగేట్రం చేసినప్పుడు ‘చే గువేరా’ బొమ్మతో అలరించారు.

తర్వాత భగత్‌సింగ్‌ తన ఆదర్శంగా ప్రకటించారు.ఇప్పుడు తాజాగా “సనాతన ధర్మం హీరో “ పాత్రధారణ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి తో అపవిత్రమైన ప్రసాదం అంశం పై పవన్ పాప పరిహార దీక్షతో ఇది ప్రారంభమౌతుంది. పూజలు, ప్రాయశ్చిత్తాలు, దుర్గ గుడి మెట్ల కడుగుడు ఘట్టాలు పూర్తి అయ్యాయి.

నడక మార్గంలో తిరుమల మెట్ల అధిరోహణం చేసి దైవ దర్శనం అనంతరం తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మం పై తన ట్రయిలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇక ఇంటర్ వెల్ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగి క్లైమాక్స్ కు చేరుకుంటుందో మనం ఊహించుకోవలసిందే.

పవన్ కు ఇదొక్కటే పని కాదు. యథావిధిగా ఆయన చేయాల్సిన ఇతర సినిమాల షూటింగులు వున్నాయి. ఉప ముఖ్యమంత్రి గానే కాకుండా నిర్వహిచాల్సిన పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలను నిర్వహించే బాధ్యతలు ఉన్నాయి. వారాహి సభ ప్రసంగాన్ని చూస్తే ఈ బాధ్యతలకు ఇచ్చే కాల్‌షీట్స్‌ కంటే సనాతన ధర్మానికి ఎక్కువ ఇచ్చేలా కనిపిస్తుంది.

సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని ఈ సభలో ప్రకటిస్తూ అలాంటి వారికి సహాయ నిరాకరణ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సనాతన పరిరక్షణకు చట్టం తేవాలని సనాతన ధర్మాన్ని కించపరిచే వారిపై చర్యలు తీసుకునే విధంగా దానిని రూపొందించాలని వారాహి డిక్లరేషన్ లో కోరారు.

తన సనాతన ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందనే పైపై డైలాగులు తప్పిస్తే నిర్దిష్టంగా సనాతన ధర్మం ఏమిటన్న స్పష్టత ఇవ్వలేదు. ఆయన సనాతన ధర్మాన్ని వేద ప్రమాణంగా భావించివుంటే రుగ్వేదంలోని పురుష సూక్తం వుంది. మనుషుల పుట్టుకలోనే వున్న వివక్షను అది నొక్కి చెప్పింది. “ ఆ పురుషుని నోటినుండి బ్రాహ్మణులు,చేతుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు , పాదాలనుండి శూద్రులు జన్మించారని పేర్కొంది.పవన్ సనాతన ధర్మం వేద ప్రమాణమే అయితే పుట్టుకతో వివక్షను సమర్ధించడమే అవుతుంది.

సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన ‘మనుస్మృతి’ కుల వ్యవస్థను, కులాల చట్రంలో వృత్తులను నిర్దేశించింది. స్త్రీలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించింది. శూద్రులందరికీ చదువును నిరాకరించింది.ఇలాంటి సనాతన ధర్మాన్నే పవన్‌ కోరుకుంటున్నారా ?

అలాగే భగవద్గీత కూడా మరో సనాతన ధర్మాన్ని ప్రబోధించే గ్రంధమే. అందులో నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని శ్రీ కృష్ణ పరమాత్మ ప్రకటించడాన్ని సనాతన ధర్మంగానే పవన్‌ భావిస్తున్నారా ?

వీటిని నిరాకరిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటిస్తే అది “సనాతన ధర్మం” కాకుండా పోతుంది.సనాతన ధర్మాన్ని 21 సంవత్సరాల వయస్సు నుండి పాటిస్తున్నానని పవన్ చేసిన ప్రకటన సినిమాలో హీరోలు చేసే నకిలీ స్టంటు గానే మిగిలి పోతుంది.

పవన్‌ కల్యాణ్‌ తన దీక్ష సందర్భంగా కాషాయ వస్త్రం ధరించారు. ఇది సనాతన ధర్మానికి చెందిన రంగు కాదు. బౌద్ధుల నుంచి హిందూ మతాచార్యులు కాషాయాన్ని తస్కరించారు. వాస్తవానికి బౌద్ధం సనాతన ధర్మం మీద తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు దారుల కాషాయ రంగును కప్పుకుని సనాతనధర్మ పునరుద్ధరణ కు పూనుకోవడం విడ్డూరం కాక మరేమిటి?

వివాహ బంధంలో విడాకులు అన్నది ఆధునిక కాలానికి చెందిన భావన. కాని, సనాతన ధర్మంలో విడాకులు అన్న పదమే లేదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. సంస్కృతంలో విడాకులు అన్న పదమే లేదని పండితులు చెబుతున్నారు.

కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలను సనాతన ధర్మం నిషేధించింది. సనాతన ధర్మం పేరుతో పవన్‌ వీటిని సమర్థిస్తారా ?
మన భారతీయ సమాజం అనేక దశలను దాటి ప్రజాస్వామ్యానికి చేరుకున్నది. తనదైన రాజ్యాంగాన్ని ఆమోదించుకుని రిపబ్లిక్ గా అవతరించింది.

ఇప్పుడు కుల వివక్షకీ, లింగ వివక్షకీ తావులేదు. చదువుకునే హక్కు అందరికీ వచ్చింది. కుల చట్రంలో వృత్తుల బిగింపు సడలిపోయింది. సనాతన ధర్మం ఆధారంగా జైళ్ళలో ఖైదీలకు కులాల ప్రాతిపదికగా
పనులు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఇవన్నీ సనాతన ధర్మాన్ని సంస్కరించడం ద్వారా సాధ్యమయ్యాయి. దీని కోసం సనాతన ధర్మంలోని అధర్మం మీద వివక్ష మీద ఉద్యమాలు, సంస్కరణలు విమర్శలు జరిగిన చరిత్ర మనకు వుంది.

తిరుపతి వారాహి సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారితో గొడవ పెట్టుకోవడానికే ఇక్కడకు వచ్చానని ప్రకటించారు. ఆయన ఎలాంటి వారితో గొడవ పెట్టుకోవాలనుకుంటే అలాంటి వారితో గొడవ పెట్టుకో వచ్చును. అది ఆయన ఇష్టం.

అంటే మను ధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా తగులపెట్టిన అంబేడ్కర్‌తో పవన్ గొడవ పెట్టు కోవాలి.. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని సనాతన ధర్మాన్ని ఎద్దేవా చేసిన గురజాడతో, సనాతనంపై తిరుగుబాటు చేసిన వీరేశలింగంతో, త్రిపురనేని రామస్వామి వగైరాలతో ఆయన గొడవకు దిగాలి.. పవన్‌ ఇలాంటి వారి మీద యుద్ధం మొదలు పెడితే “సనాతన ధర్మం హీరో “ బిరుదు వస్తే రావచ్చు.

రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి చిరకాల వాంఛగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడానికి మంచిమార్గాలు వున్నాయి. తనకు దక్కిన అవకాశం పరిధిలో పరిపాలనా దక్షతను ప్రదర్శించడం ద్వారా
లేదా ప్రజలకు స్వతంత్ర జీవితాన్ని అందించే ప్రత్యామ్నాయ విధానాలకు పోరాడే పార్టీగా ప్రజల విశ్వాసాన్ని పొందే మార్గాలను అనుసరించ వచ్చును. కాని పవన్ కల్యాణ్ ఒక వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు.

రాష్ట్రంలో రాజకీయ “హీరోగా” ఎదగడానికి సనాతనం ముసుగులో విద్వేష రాజకీయ విలన్ “పాత్ర పోషించే అడ్డదారిని ఎంచుకున్నారు. ఒక పక్క ఢిల్లీ పెద్దల తో మమేకం కావడం, మరోపక్క రాష్ట్రంలో పెద్దన్న పాత్రను పోషిస్తున్న తెలుగుదేశం పార్టీని వెనక్కి నెట్టడానికి ,ఒక్క దెబ్బతో రెండు పిట్టలను వశపరుచుకునే దుస్సాహసానికి పూనుకున్నారు.

దీనికోసం పవన్‌ తనకు సాధనంగా దొరికిన సనాతన ధర్మాన్ని వెతుకుతూ ఎంత వెనుకకు పోవాలనుకుంటే అంత వెనుకకు పోవచ్చును. ఆయనతో పాటే ప్రజలు కూడా వెనకకి నడుస్తారని ,వారు తన “సనాతన ధర్మ చిత్రం “బాక్సాఫీసులు బద్దలు కొడతారని అనుకోవడం మాత్రం కేవలం భ్రమే అవుతుంది.

ఎందుకంటే “ ఆదిత్య 360 సినిమా” లో లాగ సమాజం మాత్రం వెనక్కు నడవదు. దాని పరమ లక్ష్యం మరింత స్వేచ్ఛ కోసం, మరింత ప్రజాస్వామ్యం కోసం , వివక్ష లేని సమాజం కోసం ముందుకు సాగడమే . సమాజాన్ని వెనకకు నడిపించాలని తలపెట్టే వారిని నిర్ధాక్షింగా పక్కకు నెట్టేసి మరీ ముందుకు సాగుతుంది.

LEAVE A RESPONSE