– ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదు
– కూటమి నాయకులు రాజకీయాలను ఈవెంట్లుగా మార్చేశారు
– ప్రజల దృష్టి మరల్చడానికి అడుగడుగునా డైవర్షన్ పాలిటిక్స్
– వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, పార్టీ ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్‌రెడ్డి
తాడేపల్లి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ఉనికి కోసం, చంద్రబాబు ప్రాపకం కోసమే పాకులాడుతున్నారు తప్పించి ఓటేసి అధికారం చేతికిచ్చిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, పార్టీ ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు నిత్యం మీడియాలో కనిపించాలన్న తపనతో రాజకీయాలను కూడా ఈవెంట్లుగా మార్చేశారని, అందుకోసం ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా ఇప్పటం గ్రామంలో అభివృద్ధిలో భాగంగా జరిగిన కూల్చివేతలను రాజకీయం చేసి మైలేజ్ పొందిన పవన్ కళ్యాణ్ దాన్నొక నేరంగా చిత్రీకరించారని, అది నిజంగా తప్పే అయితే అందుకు కారణమైన ఏ ఒక్క అధికారిపైన అయినా చర్య తీసుకున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల విజయవాడ నగరం నడిబొడ్డున జోజి నగర్లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి మరీ 42 ఇళ్లు కూల్చివేసి ఆ కుటుంబాలను రోడ్డున పడేస్తే వారిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తన దత్తత తండ్రి చంద్రబాబు ఆదేశాలతో వైయస్సార్సీపీ నాయకులను సమయం సందర్భం లేకుండా బూతులతో తిట్టి పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని అవుతు శ్రీధర్ ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు చూసే మెడికల్ కాలేజీలను దక్కించుకోవడానికి ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకురావడం లేదని చెప్పారు.
కేవలం అధికార కాంక్షతోనే నాడు వైయస్సార్సీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కదానినీ నిరూపించలేదని స్పష్టం చేశారు. వైయస్సార్సీపీ హయాంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక వాటిపై కనీసం విచారణ కోరారా అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులంతా కలిసి నాడు అప్పులపై చేసిన దుష్ర్పచారాన్ని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వివరించారు.
ఏడాదిన్నరలోనే రూ. 2.81 లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని అన్నారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం తప్పించి ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సహా పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ఏ ఒక్క ప్రశ్నకైనా పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయడం మాని ఎన్నికల హామీల మీద దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్‌కి అవుతు శ్రీధర్ హితవు పలికారు.