– రహదారుల మరమ్మతులు పచ్చి అబద్ధం
– ఆ పేరుతో జనం సొమ్ము దోచుకుతిన్నది వాస్తవం
– గత సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని జోరుగా ప్రచారం
– అప్పుడు రూ.270కే యూరియా అందగా, ఇప్పుడు రూ.500 పెట్టినా అస్సలు దొరకడం లేదు
– మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
తుని: గత ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసును పదేపదే ప్రస్తావించి, ఆమె తల్లికి ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, తన మాట నిలబెట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. సుగాలి ప్రీతి కేసును ఫస్ట్ కేసుగా తీసుకుంటామన్న ఆయన, 15 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. చివరకు సుగాలి ప్రీతి తల్లి విజయవాడ వచ్చి, తన గోడు మీడియాకు చెప్పుకోవడంతో, నేరుగా సమాధానం చెప్పని పవన్‌కళ్యాణ్, విశాఖ పర్యటనలో ఉండి డ్రామా చేశారు.
రుషికొండ భవనాలు సందర్శించి, గత మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఏవో ప్రకటనలు చేశారు. పవన్‌కళ్యాణ్‌కు తన మాటలపై చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ కట్టిపెట్టి, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు.
గత వైయస్సార్సీపీ ప్రభుత్వంపై రోజూ దుష్ప్రచారాలు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని దాడిశెట్టి రాజా వెల్లడించారు.
గత ఏడాది అధికారంలోకి రాగానే, ఈ ఏడాది సంక్రాంతిలోగా అన్ని రోడ్లు మరమ్మతు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి, ఏకంగా రోడ్‌రోలర్ ఎక్కి పనులు ప్రారంభిస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన సీఎం చంద్రబాబు, వాస్తవంగా ఎక్కడా ఆ పనులు పక్కాగా చేయించలేదని ఆయన తెలిపారు. గత 15 నెలలుగా ఎలాంటి మరమ్మతులు లేక, అక్కడక్కడా చేసినా, అత్యంత నాసిరకం పనుల వల్ల రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా ఛిద్రమయ్యాయని దాడిశెట్టి రాజా చెప్పారు.
ఏజెన్సీ ఏరియాలతో పాటు, ఇటు పలు చోట్ల అత్యంత దారుణంగా రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. అవన్నీ కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వాటి కోసం ఖర్చు చేసిన వేల కోట్లు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?.
కేవలం 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం, తెచ్చిన డబ్బంతా ఏం చేస్తోంది? పథకాలు లేవు. సంక్షేమ కార్యక్రమాలు అంతకన్నా లేవు. రోడ్ల మరమ్మతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తే, అవి ఇంత దారుణంగా ఛిద్రమవుతాయా..అంటూ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఫోటోలు చూపారు
సీజన్ ప్రారంభమైనా యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన యూరియా అందేది. అప్పుడు రూ.270కే యూరియా అందగా, ఇప్పుడు రూ.500 పెట్టినా అస్సలు దొరకడం లేదు.