Suryaa.co.in

Political News

ఎంత నిజం.. పవనిజం..!

*ఆయన టాప్ హీరో..*
*ఆరడుగుల బుల్లెట్టుగా,*
*ధైర్యం విడిచిన రాకెట్టుగా*
*అభిమానులు కొనియాడిన*
*పవర్ స్టార్..*

మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్ముడిగా సినిమారంగ ప్రవేశం చేసినా
స్వయంకృషితో ఖుషీగా
అతి తక్కువ కాలంలోనే పెద్ద నటుడి స్థాయికి ఎదిగిన గబ్బర్ సింగ్..తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఉర్రూతలూగిపోయేంత క్రేజ్..
రాజకీయ వేదికలైనా..
సినిమా ఫంక్షన్లైనా
గంటల పాటు ప్రసంగిస్తూ
అభిమానులనే కాదు ఇతర జనాలను కూడా కట్టిపడేసేంత వాక్పటిమ..
సమ్మోహన శక్తి కలిగిన హీరో..
అలాంటి ఓ వ్యక్తి..పవన్ కళ్యాణ్..ఉరఫ్ పవర్ స్టార్ రాజకీయ పార్టీ స్థాపించి మొదటి ప్రయత్నంలో దారుణంగా విఫలమయ్యాడు..

నిజానికి ఈ తరహా వైఫల్యం మెగా కుటుంబానికి కొత్త కాదు..సినిమా రంగంలో అన్నదమ్ములిద్దరూ ఎంత ఉవ్వెత్తున ఎగసినా రాజకీయాల్లో అనూహ్య వైఫల్యాన్ని చవిచూడ్డం మింగుడుపడని పరిణామమే.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం బ్యానర్ పై రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన చిరంజీవి 1983 లో నందమూరి తారక రామారావులా సంచలనం సృష్టిస్తాడని అభిమానులే కాదు రాజకీయ పండితులు కూడా విశ్లేషణలు చేసినా అన్ని అంచనాలను తల్లకిందులు చేస్తూ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. అప్పటికి రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల(అంటే రాజశేఖర రెడ్డి మాంచి ఊపు మీదున్న తరుణం…)కారణంగా వైఎస్సార్ ప్రభంజనాన్ని ఎదుర్కోలేక చిరంజీవి చతికిల పడ్డారు. అంతేగాక చిరంజీవి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం..టికెట్ల కేటాయింపు వ్యవహారంలో జరిగిన లోటుపాట్లు..ఆ విషయంలో వెల్లువెత్తిన విమర్శలు..వాటిని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం..అన్నిటి కంటే ప్రధానంగా పటిష్టమైన పార్టీ యంత్రాంగం లేకపోవడం…పార్టీపై కులం ముద్ర..చిరంజీవి దూకుడు ప్రదర్శించలేకపోవడం.. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలు..రాంగ్ టైమింగ్ ఇంకా కీలక కారణం..అదే గనక చిరంజీవి 2004 లో తెరపైకి వచ్చి ఉంటే కథ వేరేగా ఉండేదేమో. అప్పటికి ప్రజలు చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనపై ఒకరకమైన నిరసనతో ఉన్నా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఆలోచనలో పూర్తిగా లేరు. ఇక ప్రత్యామ్నాయం లేకపోవడమే గాక అంతకు ముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి తనకంటూ ఒక ఇమేజ్ సాధించుకోవడం 2004 ఎన్నికల్లో అత్యంత కీలకంగా ప్రభావం చూపి కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది.

ఆ ఎన్నికల తర్వాత చిరంజీవి మరో ఘోరమైన తప్పు చేశారు.తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇంచుమించు తన రాజకీయ భవితను చేతులారా భూస్థాపితం చేసుకున్నారు.అదే గనక చిరంజీవి తన పార్టీ ఉనికిని కాపాడుకుని ఉంటే 2014 ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపి ఉండేవారేమో.?

పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో అన్నను మించి పరాభవం ఎదుర్కొన్నా పార్టీని కొనసాగిస్తూ ప్రజాసమస్యలపై ఎక్కడో ఒక దగ్గర జగన్ సర్కారును నిలదీస్తూ..ప్రశ్నిస్తూ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడమే గాక తాను ప్రజల్లో తిరుగుతూ వారితో మమేకం అవుతూ వస్తున్నారు.పనిలో పనిగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను కూడా నిలబెట్టుకుంటున్నారు.

ఇలాంటి వైఖరి వల్ల ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టినే ఆకర్షించారు.బిజెపి ఆవిర్భవించి ఎన్నో ఏళ్ళైనా..కేంద్రంలో.. పలు రాష్ట్రాల్లో అధికారం చేపట్టినా ఆంధ్రప్రదేశ్ లో కనీస పట్టు సాధించలేకపోయింది.2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో చేయి కలిపి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించినా సొంతంగా తనకంటూ బలం లేకపోవడంతో 2019 ఎన్నికల్లో ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఏది ఏమైనా జాతీయ పార్టీ హోదా కలిగిన బిజెపి బాసట పవన్ కళ్యాణ్ కు లభించింది..లాభిస్తుందో లేదో రెండేళ్లలో తెరపై చూడాలి..!!

ఇప్పుడు జగన్ ప్రభుత్వం..ఆయన పార్టీ పట్ల ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతూ 2024 ఎన్నికల నాటికి అది పెరిగితే పవన్ కీలక పాత్రధారిగా బిజెపి..జనసేన కాంబో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.ఈ కూటమిలో చంద్రబాబు కూడా చేరితే..ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టి విశ్లేషిస్తే 2024 లో టేబుల్స్ టర్న్ అయ్యే అవకాశం లేకపోలేదు.

సరే..మోడీ చరిష్మా ఎటూ ఉండనే ఉంటుంది.చంద్రబాబు అంత క్రేజీ స్టార్ గా ఉండే సూచన లేదు..కనుక పవనే కేంద్రబిందువయ్యే పరిస్థితి ఉంటుంది..ఎటొచ్చీ కావాల్సిందల్లా ఆనాటికి పవన్ కళ్యాణ్ మరింతగా పరిపక్వత సాధించుకోవడమే..అంతేగాక పూర్తిగా బిజెపి ఊపు మీద ఆధారపడిపోకుండా తన పార్టీ క్యాడర్ ను పెంచుకుంటూ.. దిగువస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరచుకుంటే..ఏమో..
జగన్మోహన రెడ్డికి ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కి కూడా అవకాశం ఇస్తారేమో..
చూడాలి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE